Search
Tuesday 19 June 2018
  • :
  • :

గుడి గడప దాటని స్థానచలనాలు దేవస్థాన దిశ మార్చేనా?

temple

అంతర్గత బదిలీల పేరిట నామమాత్రపు చర్యలు
మనతెలంగాణ/వేములవాడ: అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతున్న వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రక్షాళన చేసేందుకు జరిగిన బదిలీలు అపహాస్యంగా మారాయి. ఆలయ ఉద్యోగుల్లోని బాధ్యతారాహిత్యాన్ని. అవినీతి కార్యకలాపాలను నివారించేందుకు ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుండి (రాజరాజేశ్వరస్వామి దేవాలయం) ఇతర ఆలయాలకు బదిలీ చేయవలసి ఉంటుంది.కానీ అధికారులు మాత్రం అదే ఆలయంలో వారివారి స్థానాలను మార్చి కొత్త కుర్చీలలో కూర్చోబెట్టి అప్రత్యక్షంగా దండుకోమని సలహా ఇచ్చిన చందంగా బదిలీలు చేశారని భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయంలో ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న విభాగాల్లో బదిలీలు జరిగినా ఈ బదిలీలు కేవలం ఉన్నతాధికారులు తమ అనుకూల ఉద్యోగులను ఆ విభాగాల్లో చేర్చడానికి చేసిన చర్యేనన్న చర్చ జరుగుతోంది. 21 డిసెంబర్ నాటి ఎసిబి దాడుల్లో పట్టుబడిన ఆలయ పర్యవేక్షకులు నామాల రాజేందర్ ఉదంతంతో రాజన్న ఆలయ అవినీతి భాగో తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయం అయిన వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టి కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించిన ప్రభుత్వం నిఖార్సయిన అధికారులకు స్థానం కల్పించకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఎసిబి దాడులు అనంతరం ఉద్యోగుల అవినీతి, అక్రమార్జన వెలుగుచూసిన సందర్భంలో అంతర్గత బదిలీలు చేపట్టామనీ ఆలయ అధికారులు పేర్కొంటున్నా, గుడి గడప దాటని బదిలీలు అధికారులు అనుకున్న విధంగా అక్రమార్జనను అరికట్టగలవా అన్నది ప్రశ్నగా మిగులుతోంది.
అంతర్గత బదిలీలలో భాగంగా ఇద్దరు ఎఇఒలు, ఎనిమిది మంది పర్యవేక్షకులకు స్థానచలనం కల్పించారు. 2013 నుండి అకౌంట్స్, అన్నదానం, ప్రసాదం తయారీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగాల ఇన్‌ఛార్జీగా విధులు నిర్వహించిన ‘ఉమారాణి’ ప్రధాన ఆలయము, అనుబంధ, దత్తత దేవాలయాలు గోదాం, గోశాల, అన్నదానం ఇన్‌ఛార్జీగా పరిపాలన విభాగం, ప్రధాన అనుబంధ దత్తత దేవాలయాలు గోదాం, గోశాల, శానిటేషన్, ఆడిట్, లీగల్, ఆర్‌టిఐ సంస్కృత విద్యా సంస్థల ఇన్‌ఛార్జీ, ఎఇఒ సిహెచ్ దేవేందర్‌కు పరిపాలన విభాగం, అకౌంట్స్, ప్రసాదాల తయారీ ప్రిం టింగ్ అండ్ స్టేషనరీ శానిటేషన్, ఆడిట్, లీగల్, ఆర్‌టీఐ, సంస్కృత విద్యా సంస్థల ఇన్‌ఛార్జీగా బదిలీ అయ్యారు. రెండేళ్ళకుమించి ఒకే స్థానంలో విధులు నిర్వహించకూడదనే నిబంధన దేవాదాయశాఖ ఉద్యోగులకు ఉన్నా ఒక ఆలయ అధికారి నాలుగేళ్లు ఒకే విభాగంలో ఎలా విధులు నిర్వహించారో ఆలయ అధికారులు తేల్చాల్సి ఉంది.
దేవాలయ పర్యవేక్షకుల బదిలీల్లో భాగంగా అకౌంట్స్ విభాగం ఇన్‌ఛార్జీ బి శ్రీనివాస్ గోదాము, గోశాలకు ప్రధాన దేవాలయ ఇన్‌ఛార్జీ కె నట్‌రాజ్ నిత్యాన్న దానము, స్టేషనరీ, పిఆర్‌ఒ, గోదాము, గోశాల ఇన్‌ఛార్జీ ఎస్ శ్రీరాములు ప్రధాన దేవాలయము, వేద పాఠశాలకు, అనుబంధ దేవాలయాల ఇన్‌ఛార్జీ బి తిరుపతిరావు విచారణ కార్యాలయము, లీజెస్‌కు నిత్యాన్న దానము, స్టేషనరీ విభాగం ఇన్‌ఛార్జీ ఐ జయకుమారి అనుబంధ దేవాలయాలకు, పరిపాలన విభాగాం, లీగల్, ఆర్‌టీఐ, సంస్కృత విద్యా సంస్థల ఇన్‌ఛార్జీ, ఎ శంకర్ అకౌంట్స్, దత్తత దేవాలయాలకు, విచారణ కార్యాలయము, లీజెస్, దత్తత దేవాలయం ఇన్‌ఛార్జీ శానిటేషన్‌కు, ప్రధాన దేవాలయం ఇన్‌ఛార్జీ జి హరిహరనాథ్ పరిపాలన విభాగం, క్యాంటీన్, లీగల్, ఆర్‌టిఐ, సంస్కృత విద్యా సంస్థలకు బదిలీ అయ్యారు.

Comments

comments