Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

ప్యానిక్ ఎటాక్ దేనికి?

life

‘పరీక్ష’ లంటేనే అందరికీ భయం… భయం…! ‘పరీక్ష’ అన్నపదం వింటేనే అదేదో ‘మన భవిష్యత్తును తేల్చేది’ అన్పిస్తుంది. చాలామందిలో ఈ పదం దడ, వణుకు, తీవ్రమైన ఆందోళనలను కల్గిస్తే… ఉల్లాసంగా ఉండే వారిలో సైతం కొద్దో గొప్పో భయాన్ని రేకెత్తిస్తుంది. పరీక్షలంటే ‘కాస్త’ భయం ఉండటం మంచిదే కానీ చదివింది కాస్తా మరిచిపోయేంత భయం పనికిరాదు.  పరీక్షలకు ‘తగినవిధంగా’ ప్రిపేర్ అవటానికి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించడానికి భయం ఉపయోగపడ్తుంది. అతి భయం అసమర్థుడి లక్షణం.

యేడాది పొడవునా పుస్తకాలు ముందేసుకుని చదివిన చదువు సరైన డైరక్షన్‌లోనే సాగిందా? సబ్జెక్ట్ ఏమైనా అర్థమైందా? చదివింది బుర్రకెక్కిందా? స్టూడెంట్ పనికివచ్చే బాపతేనా? అన్నది తేల్చిచెప్పేది పరీక్ష. అభ్యర్థి పెర్ఫార్మెన్స్‌ను మార్కుల కొలతతో/గ్రేడుల సాయంతో అంచనావేసేదే ‘పరీక్ష’. ఆ మాటకొస్తే జీవితమే ఒక పరీక్ష! ఇంకా గట్టిగా చెప్పాలంటే అందులో శ్రమచేసే సమయం అగ్నిపరీక్ష. సవాళ్ళను ఎదుర్కొనే సత్తా తెచ్చుకోలేకపోతే జీరో మార్కులొస్తాయి. సమర్థంగా నిలదొక్కుకుంటే ఫస్ట్‌మార్కులొస్తాయి. సవాల్‌ను ఎదుర్కొనడానికి శారీరకంగా, మానసికంగా సన్నద్ధతను, సంసిద్ధతను ఎలా అలవరచుకోవాలో నేర్పేది పరీక్ష. మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని, సంకల్పదీక్షను గుర్తించి దానికి పదునుపెట్టుకోడానికి అందివచ్చే సువర్ణావకాశం పరీక్ష. మనను మంచి విల్‌పవర్ కలవారిగా మలచడానికి, ఎంత ఎత్తుకైనా ఎదిగే పరిస్థితి కల్పించడానికి ఇదొక గొప్ప అవకాశం.
పరీక్ష శిక్ష కాదు. మనలోని ప్రతిభకు గీటురాళ్ళు. పురోగతికి కొలమానాలుగా నిలిచే మైలురాళ్ళు. ఎవేర్‌నెస్ పెంచే సాధనాలు. మన జీవితంలో అంతర్భాగాలు. కనుక పరీక్ష అంటే భయపడడం మానేసి బలం పెంచుకోడానికి, జీవితంలో బలపడడానికి వీటిని వినియోగించుకోవాలి. ఫెయిల్యూర్ ఎదురైనా నీరుగారిపోనవసరంలేదు. ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ టు ది సక్సెస్. కానీ విచిత్రమేమిటంటే పెద్దవాళ్ళు మొదలు పిల్లవాళ్ళ వరకు అందరూ పరీక్షలంటే భయపడిపోతారు. టెన్షన్ పడిపోతుంటారు. ఇది పరీక్షలు తెచ్చిపెట్టే భయం వల్ల వచ్చింది కాదు. ఓటమి భయం వల్ల కలిగే దడ. ఇదెందుకు కలుగుతుంది? పరీక్షలకు ముందున్న సమయంలో మనం ఓటమిని లైట్ తీసుకుంటే మిగిలినవన్నీ ఆటోమాటిక్‌గా సెట్ అవుతాయి.
కాలేజికి రెగ్యులర్‌గా అటెండ్ అయ్యామా…ఆల్త్‌ఫాల్త్‌గా కాక సీరియెస్‌గా పాఠాలు విన్నామా? ఆడుతు పాడుతు పుణ్యకాలమంతా గడిపేశామా? ఏ రోజు పాఠం ఆ రోజు చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అలర్ట్‌గా ఉన్నామా? అని ఒకసారి ఆలోచించండి..! ఏ రోజుకారోజు టార్గెట్ కంప్లీట్ చేసేవారికి ఏ భయమూ ఉండదు. సాధారణ రోజులలో ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమాలు, షికార్లు, సెల్ఫీలు, సెల్‌ఫోన్‌లో పోసుకోలు కబుర్లు, వీడియో గేములతో కాలక్షేపం చేసేస్తే పరీక్షల టైముకు చదవాల్సిన సబ్జెక్ట్ కొండంతై టెన్షన్ పుడుతుంది. ప్రిపరేషన్ సరిగాలేకపోతే ఫెయిల్ అవడం అనివార్యమే కదా! కానీ ఫెయిలవకూడదు. ఫెయిలవ కూడదు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కూడా ఉండాలి కదా!
ఓకె. బాగా చదువుకోని వారికి భయం పుడుతోందంటే అర్థం చేసుకోవచ్చు. కారణం కళ్ళముందే ఉంది కదా..! కానీ చాలా సందర్భాలలో బాగా చదువుకునే పిల్లలు కూడా పరీక్షకు వెళ్ళాలంటే హడలిపోతుంటారు. వీరికెందుకు భయం?
(1) సహజంగానే న్యూరోటిక్ పెర్సనాలిటీ కావటం :
బాల్యదశలో ఉన్నపుడు బిడ్డ, సామాజిక పరిస్థితులతోను, చుట్టూ ఉన్న వారితోను సరైన సర్దుబాటు ధోరణి అలవర్చుకోక పోవటం చేత డిజార్డర్స్ మొదలవుతాయి. వ్యక్తిత్వం పటిష్టంగా ఉండదు. వీరిలో అకారణంగా ఏర్పడే భయాలు, ఆందోళనలు హైపో ఖాండ్రియా వంటి లక్షణాలు కల్గుతుంటాయి.
న్యూరోటిక్ పర్సనాలిటీ కల్గిన వారిలో, పరీక్షలు సమీపిస్తున్నాయనగానే, కొంపలు మునుగుతున్నాయనే భయం, ఆందోళన కల్గుతుంటాయి. దీన్ని యాంగ్జయిటీ న్యూరోసిస్ అంటారు. యాంగ్జయిటీ న్యూరోసిస్ వల్ల అనేక అవాంఛనీయ పరిణామాలు, మరీ ఇబ్బంది పెట్టే పరిణామాలు ఏర్పడతాయి. ఊపిరి సరిగ్గా తీసుకోలేక పోవటం, ఛాతీలో నొప్పికల్గటం, చెమటలు పట్టటం, నిస్సత్తువ కల్గటం, కడుపు బిగుసుకుపోవడం, లేదా కడుపు నొప్పి కల్గటం, తలనొప్పి వంటి సోమాటిక్ క్షణాలు కల్గుతాయి. నిద్ర పట్టదు, ఆలోచనలు తరుముతూ వుంటాయి. గందరగోళంగా వుంటుంది. చికాకుగా వుంటుంది. ఆకలి వుండదు, శరీరంలోని వివిధ అవయవాల పనితీరులో వేగం పెరుగుతుంది. పల్స్‌రేట్ అధికమవుతుంది. కొందరికి బి.పి. పెరుగుతుంది. కండరాలు బిగుసుకుపోతాయి. నోరు, పెదవులు ఎండిపోతుంటాయి. అరిచేతులు, అరికాళ్ళలో చెమ్మ పట్టేస్తుంది.
(2) ప్యానిక్ ఎటాక్ :
పరీక్షలు దగ్గర పడగానే ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోతుంది. స్వభావరీత్యా న్యూరోసిస్ లక్షణాలు ఉన్నా లేకున్నా ప్యానిక్ ఎటాక్ రావచ్చు. ఈ ఎటాక్ పెద్దపెద్ద వాళ్ళలో కూడా వుంటుంది. ఇలా ప్యానిక్ అయిపోవటానికి కారణం “సక్సెస్ తప్పనిసరి” అన్పించటం వల్ల! కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు వెళ్ళే విద్యార్థ్ధుల్లో ఇది “కామన్‌” గా ఏర్పడ్తుంటుంది. ఫలానా టెస్టులో, ఏమైనా సరే విజయం పొంది తీరాలి. ర్యాంకు తప్పనిసరి, లేకపోతే ఈ జీవితమే వృథా వంటి ఆలోచనలు బలంగా ఏర్పడటం మూలంగా ఇది కల్గుతుంది. పరీక్ష హాల్‌లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మటం, నెర్వస్‌నెస్ భయోత్పాతాలు కలుగుతాయి. ఇంకొంతమంది విద్యార్థుల్లో సహజంగానే ఓటమిని అంగీకరించే తత్వం ఉండదు. పరీక్షలకు తాము సరిగ్గా ప్రిపేర్ అయ్యామా లేదా అన్నది వీళ్ళు విశ్లేషించుకోరు. ప్రయత్నాల మాట ఎలా వున్నా పరీక్షల్లో పాసై పోవాలని మాత్రమే వీరు కోరుకుంటారు. అంచేత పరీక్షల పట్ల భయాన్ని ఏర్పరుచుకుంటారు.
(4) సిట్యుయేషనల్ యాంగ్జయిటీ :
కొంతమంది విద్యార్థులు చాలా బాగా చదువుతారు. మంచి హార్డ్‌వర్క్ చేస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం కోర్సును కంప్లీట్ చేస్తారు. తీరా పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే అంతా మర్చిపోతారు. పరీక్షలు జరిగే తీరు, ఇన్విజిలేటర్ ల ముఖాల్లో వుండే గాంభీర్యం, సూది పడినా వినబడేంత నిశ్శబ్దం… ఇదంతా వారిలో యాంగ్జయిటీని కల్గిస్తుంది. సందర్భాన్ని బట్టి ఏర్పడేది కాబట్టి దీన్ని సిట్యుయేషనల్ యాంగ్జయిటీ అంటారు. పేపర్ చూడగానే వీరికి ఏమి తోచదు. అలోచనలు బ్లాంక్ అయిపోతాయి. దాంతో ఏ ప్రశ్నకూ సమాధానం గుర్తుకురాదు. కాస్సేపటికి తేరుకున్నా యాంగ్జయిటీ వల్ల ఏదీ రాయలేక పోతుంటారు. పరీక్ష అయిందన్పించి బయటపడతారు. ఎగ్జామినేషన్ పూర్తయి ఇంటికి వచ్చిం తర్వాత, ప్రశ్నా పత్రంలోని చాలా ప్రశ్నలకు, సమాధానాలు తమకు తెల్సినవేనని, వాటిని రాయలేక పోయినందుకు చింతిస్తారు.
(5) పోటీని తట్టుకోలేక పోవటం :
ఏ రకమైన మానసిక అవ్యవస్థలూ లేకపోయినప్పటికీ, నేటి విద్యారంగ పరిస్థితులు, విద్యార్థుల్లో తీవ్రమైన ఒత్తిడిని, ఆందోళనను కల్గించేవిగా వున్నాయి. చదివే కాలం పరిమితం. పోర్షన్ కంప్లీట్ అవ్వదు. రిఫరెన్సులు చూసే టైం వుండదు. క్లాసులు జరగవు. సిలబస్ అనంతం. ఈ గొడవలో తలమునకలుగా వుండగానే పరీక్షలు వచ్చి పడతాయి. పరీక్షల్లో మార్కులకు గట్టిపోటీ వుంటుంది. వివిధ దశల్లో వివిధ తీవ్రతలను కల్గి వుంటుంది. ఏమైనా సరే ఫస్ట్‌గ్రేడ్ రావాల్సిందే. ఈ రకమైన షరతు భూతంలా ఎదురుగా కన్పిస్తుంటుంది. ఎక్కడబడితే అక్కడ పోటీ, పై చదువులకు పోటీ, ఫారిన్ వెళ్ళాలంటే పోటీ, ఉద్యోగాల్లో పోటీ. ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో మరింత పోటీ. ఈ పోటీని తట్టుకునే మనస్తత్వం లేక పోవటం వల్ల పరీక్షలు రాయలేకపోతారు.
(6) చదువు పట్ల విముఖత :
న్యూరోసిస్ లక్షణాలు విపరీతంగా వుండి, పదే పదే తరిమికొట్తూ వున్నట్లయితే అవి క్రమేపి సైకోన్యూరోటిక్ లక్షణాలుగా పరిణమించే ప్రమాదం వుంది. అట్లాంటి పిల్లల్లో చదువుపట్ల స్వభావరీత్యా పూర్తి విముఖత కల్గి వుండటం, “చదువులో రాణించకపోవటం” పగ తీర్చుకునే మార్గం ఎంచు కోవటం వంటి అవ్యవస్థలు చోటు చేసుకుంటాయి. ఇట్లాంటి వారి విషయంలో నిపుణులైన సైకోథెరపిస్టుల సాయాన్ని తీసుకోవాలి.
(7) ఇతర కారణాలు :
ఒంట్లో బాగుండక పోవటం, పరీక్షలకు ముందు రివిజన్‌కు టైం సరిపోక పోవటం, పరీక్షల సమయంలో ఇతర పనుల్లో మునిగి వుండటం, కళలు, హీరోలు, స్నేహితులతో విలాసాలు, ప్రేమ గొడవలు, వగైరా వల్ల కూడా పరీక్షలను అలక్ష్యం చేస్తుంటారు విద్యార్థులు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి చేయాల్సిందంతా అదే చూసుకుంటుంది అన్నాడు సోక్రటీసు. వ్యక్తిత్వ వికాసానికి, విజ్ఞాన వికాసానికి, విజయ సాధనకి ఇదే మూల సూత్రం.

Comments

comments