Search
Wednesday 23 May 2018
  • :
  • :

తెలంగాణ మాటల మూట హన్మాజీపేట పాట

dinare

మహోన్నత కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినారె) చిన్ననాటి జ్ఞాపకాలను “మావూరు మాట్లాడింది” లో హృద్యంగా పల్లె పరవళ్ళు తొక్కినట్టుగా పూసగుచ్చారు. ఊరు, ఊరితొవ్వలు, ఆ తొవ్వల్లో నిల్చుండి మాట్లాడే తీరు, వావివరుసలతో పిల్చుకునే ఆప్యాయతలు, అనురాగాలు ప్రొద్దుటలేచి వాకలి ఊడ్చి కల్లాపు చల్లే ఆడపడచులు “చలి”ని కూడా లెక్కచేయకుండా ముసి, ముసి మబ్బు పనులకు వెళ్లేవారు. వారి చేతిలోకట్టె, భుజంపై కండువా, ఆత్రంగా నడుస్తూ వెల్లుంటారు. మక్క చేనుకు నీళ్ళు పట్టే ఆడపడచులు, ఒడ్డు చెక్కి నేలను చదును చేస్తున్న పల్లెవాడు. అదొక తీరుఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఆ కాలంలో వృత్తికులాలకు తీరికలేని పనుండేది. వడ్ల, కమ్మరి, చాకలి, మంగళి, అవుసల, గొల్ల, కురుమ, సాలె, మాల,మాదిగలు వీరు మంచిగనే బ్రతికిండ్రు ఎవరిపనివారికుండేది. తీరిక ముచ్చట్లకు అవకాశం తక్కువ. పనివంతుల కాలం. ఊరంటే సినారెకు “హన్మాజీపేట” ఆ ఊరిలో పోశమ్మతో సినారెకు అనుబంధం “తాతమ్మలాంటిది. మాల పోశమ్మనా? మాదిగ పోశమ్మనా? తెలువది కాని? సినారె చిన్ననాటి నుండే కులాలను అంతగా పట్టించుకునే వారుకాదు. అన్ని కులాల వారితో కలిసుండేవాడు. పాలేర్ల గుడిసెల్లోకి వెళ్ళి, గడుకంబలియిష్టంగా తాగిన రోజులున్నాయి. వందల ఎకరాలకు వొక్కడే వారసుడు, తల్లిదండ్రులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు ముద్దులబిడ్డడు అయినా? గర్వం లేని వాడు అందరూ ఒక్కటేనని భావించేవాడు. అందుకే పోశమ్మను సాహిత్యంలో చేర్చి తన వినయాన్ని చాటుకున్నాడు. పల్లె నుండి నేర్చిన పదాలు ఆ తర్వాత సినీ గీతాలలో, కవిత్వంలో పొందుపర్చాడు. పోశమ్మ మనుమడు మైసడు, ఆ అమ్మతో సినారె మైసడు అనద్దు మైసయ్య అనాలి అని చెప్పాడు, “గైండ్లగూసోరా” అంటే ఇందులో “గైండ్ల” అంటే వాకిలి అనే అర్ధాన్నిస్తుందని చెప్పారు.పల్లెటూళ్లో ముత్తయిదువలు కాని! కన్నె పడచులు కాని! కొందరు ఒంటరిగా గానకోకిలలై పాడుకుంటారు. గేయం గాన మాధుర్యాన్ని వారికందిస్తుంది. ఆ మాధుర్యంలో మునిగి ఒంటరిగా పరవశిస్తారు. ఒక ముత్తయిదువ ఇలా పాడుతుందన్నారు. “ఉసికాల ఆడేటీ / కుసుమాసిరిబాలా / మా బాలా వచ్చిందా / మిమ్మూ కూడంగ” ఒక తల్లి ఒక పాప నడుగుతున్నది తన పాపను గూర్చి, ఆ పాప ఎవరు? ఉసికాల ఆడేటీ కుసుమాసిరిబా” ఇసుక ఉసికగా మిసిమిపెంచుకుంది. “కుసుమాసిరిబాలా” కుసుమంలా సిరులొలికే బాల. ఈ విధంగా పల్లె వారి పాటల్లో మాధుర్యత, గాంభీర్యత, అర్థవంతమై ఉంటుంది. పోశమ్మ మనుమడు మైసయ్య చింతచెట్టెక్కి చిటారు కొమ్మల్లో కూచుని పాడుతున్నాడు. “పచ్చి మానూతొర్రలోనే / పంచరంగుల పచ్చిపలికె / పచ్చిపలికె పచ్చిపలికె / పచ్చీపలికె, పచ్చీపలికె” “పచ్చిపలికె” అనే రెండు నుడుగులనే తిప్పి, తిప్పిపాడుతున్నాడు. లయల్లో, గతుల్లో దరువులు విసురుతున్నాడు. కేరింతలు కొడుతున్నాడు. దరువు దరువుకీ మధ్య నోటితో మద్దెలవాయిస్తున్నాడు. “పంచరంగుల పచ్చి పలికె / పచ్చీ పలికె పచ్చీపలికె” ఈ విధంగా లయగతుల విన్యాసాల్లో మాధుర్యాన్ని చాటుతున్న మైసయ్య మొక్కజొన్న కాపలాగా ఉండి పిట్టల్ని వడిసెల గుండ్లతో తరుముతున్నాడు.
“పచ్చి మానూ తొర్రలోనే / పంచరంగుల పచ్చి పలికె / పచ్చి పలికిన పలుకూలకూ / పగడమే పదివక్కాలాయె” పంచరంగుల పచ్చి అంటే పంచవన్నెల చిలుక. పక్షి శబ్దం మెత్తగా ఒదిగిపోతే పచ్చి, ఇందులోని చమత్కారం “పచ్చి, మానూ తొర్రలో” పచ్చిపలకడం, పచ్చి రెండు సార్లొచ్చింది. ఒకటి పసిమివల్ల, పచ్చదనం ఏర్పడిన పచ్చి మరొకటి “పక్షికి” వ్యవహార వికృతి పచ్చి, లక్ష్మికిలచ్చిలాగా ఆ చిలకపలుకుల్లో ఎంతో ముచ్చట గొలిపే ఆనందం ఉంది. ఈ విధంగా సినారె లయాత్మమైన జానపద కవిత్వంలోని అంతరార్థాన్ని విడమర్చి చెప్పారు. మైసయ్య నోట మరోపాట, పోశమ్మ ‘వారీ’అని ఉరిమే సరికి అందుకున్నాడు.
“కాల్లిరుగ గొట్టిండు నా దేవుడుకాల్ల / కాల్లకడియాలు దెచ్చిండు నాదేవుడు / నడుమిరుగ గొట్టిండు నాదేవుడు నడుము / ఒడ్డాలం దెచ్చిండు నాదేవుడు / మెడలిరుగ గొట్టిండు నాదేవుడుమెడల / కంటెనే వెట్టిండు నాదేవుడు” ఎవడా దేవుడు ఎందుకలా చేస్తున్నాడు? కాళ్ళు విరగ్గొట్టడమెందుకు? కడియాలు తేవడమెందుకు? ఎందుకింత క్రూరత్వం? సమాధానం చివరి పంక్తుల్లో దొరికింది.
“బాయిల కప్పోలె వాడున్నడూ / బంగారు బొమ్మోలె నేనున్నా / చేతూల కట్టోలె వాడున్నడూ / సెనిక్కాయ పువ్వోలె నేనున్నా” ఇప్పుడు తెలిసింది ఆ దేవుడు భర్త. ఆవిడ భార్య ఆమెవన్నెలో బంగారుబొమ్మ, అతడు బావిలోని కప్ప చేతిలో కట్టెవంటివాడు. ఏదో నెపంతో చావబాదేవాడు. ఆ పడచు హృదయ వేదనను ఇలా చిత్రించాడు. మైసయ్య భావం, గాంభీర్యం హాస్యం సమపాళ్లలో ఉంటుంది. పల్లెటూరి వాళ్ల ప్రణయాన్ని జానపదులు పాడుకునే తీరును ఆ పాటల్లోని మాధుర్యాన్ని ప్రణయాన్ని రంగరించిపోశాడు. “ఎంత పనిచేసె దొరకొడుకు అతనిపే / రెత్తితే కడుపంత ఉడుకు”
“లచ్చిని దొరా అంటె లచ్చి మీ అన్నాడు / లచ్చి మీ మాయింటి లక్ష్మి వే అన్నాడు / లగ్గమాడే రోజు దగ్గెరుందన్నాడు / ఎన్నొబాసలు జేసి ఇగరాడు అగరాడు” తెలంగాణలో “దొర” అంటె పెత్తందారు అన్నమాట, అతని మాట వేదవాక్కు, ఈ పాటలో దొరకొడుకు పట్నంలో చదువుకుంటాడు సెలవులో ఊరికి వచ్చినప్పుడు దొరకొడుక్కు లచ్చి అనే అమ్మాయి కంటబడింది వారిలో చిగురించిన ప్రణయ సన్నివేషం ఈ పై పాటలోని పరమార్థం
గ్రామాల్లో బతుకలేక పుట్టినూరు వదిలి బొంబాయికి వెల్తుంటారు. అప్పటికీ ఇప్పటికీ ఈ వలుసలు జరుగుతున్నాయి. కొడుకు బొంబాయిలో తల్లి పుట్టినూరులో తల్లి కొడుకు కొరకు పడే తండ్లాట.“పొట్ట సేత బట్డుకొనీ / బొంబాయికి యెల్లిపాయె / ఎట్లవున్నడో కొడుకు / ఏమితిన్నడో” ఈ విధంగా ఈ పాటలో తల్లి “తండ్లాట” కన్పిస్తుంది. బావమమరదలు ప్రణయసన్నివేశాన్ని ఎంతో రసవత్తరంగా చిత్రించినారు.
“బావయెప్పుడొస్తడే లేగదూడా నా / పానమాగకున్నదే ఇంటి కాడ” ముని వాకిట ఏ యెద్దుల / మువ్వల సప్పుడు విన్నా / బావ యెక్కివచ్చేటి స / వారి కచనమనుకున్న” తాగుబోతు మొగళ్లతో వేగలేని బతుకులెన్నో పల్లెటూళ్లో కన్పించును. “వద్దంటె యినడేమి మొగడో తాగ / వద్దంటె యినడెంత అగ డో” “తిట్టినా కొట్టినా కట్టుకున్నాడని / ఎట్టెట్టనో ఉగ్గ బట్టుకుంటిని గాని “మల్లి నీ మొగడు….. గుడిసెలేలె” నని / పొరుగమ్మలంటె తల నరికేసినట్లాయె” మల్లికి తన మొగడంటె వల్లమాలిన ప్రీతి. కాని దురలవాట్లకు లోనవుతున్నడని బాధ పడుతుంది. పల్లెటూళ్లలో రైతులకు అతివృష్టి అనావృష్టి బాధలు తప్పడం లేదు. “సావుకాలం వచ్చె చెల్లెలా మాసెడ్డ / గావుకాలం వచ్చె సెల్లెలా / పాడు వరుదల వచ్చి పల్లెనే ముంచేసె / పంటకెదిగిన పైరు పచ్చలను కాజేసె / ఏమితిని బతుకుదము సెల్లెలా ఇకముందు / ఎట్టిల్లు గడుపుదము సెల్లెలా” బతుకు యమయాతనవుతుందని కాలం కలిసిరావట్లేదని ఈ పాటలోని అర్థం స్ఫురిస్థుంది. ఊరి ముచ్చట్లను చెక్కుచెదరని జ్ఞాపకంగా దాచుకొని, పల్లెవారి సాహిత్యాన్ని ఆనాటి పాటల్ని, వారి మనసుల్ని మనముందుంచి, ఆనాటి వారి పాటల్లోని, మాటల్లోని భాషా విశేషాలను ఎంతో చక్కగా అర్థవంతంగా వివరించారు.

Comments

comments