Search
Sunday 27 May 2018
  • :
  • :

సృజనకు శ్రమ తోడైతే..

life

స్టార్టప్ స్థాపన నిర్వహణలో ఎక్కువ మంది పాలుపంచుకుంటారు కాబట్టి అహం అనే దాన్ని పక్కన పెట్టాల్సిందే. కోపతాపాల్ని బ్యాలెన్స్ చేసుకోకుంటే , ఏ సంస్థా ముందుకు సాగదు. డబ్బుతో వచ్చే సమస్యల్ని అధిగమిస్తూ కలల ఉత్పత్తిని సాధించి, వినియోగదారుల ముందు
ఉంచినట్లయితే అప్పుడే లక్షం సాధించగలుగుతాం అంటూ …అంటూ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సూచనలిస్తున్నారు
క్యాష్‌కరో స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకురాలు స్వాతీ భార్గవ.

మన దేశంలో ఆన్‌లైన్ వినియోగదారులకు రాయితీ కూపన్లు, తిరిగి చెల్లింపులూ అందించే సంస్థల్లో క్యాష్‌కరో సంస్థ ఒకటి.  2013లో భర్త రోహన్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించింది స్వాతీ భార్గవ. హరియాణాకు చెందిన స్వాతి లెక్కల్లో దిట్ట. డిగ్రీ పూర్తయ్యాక ప్రసిద్ధి చెందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కి దరఖాస్తు చేసింది. స్కాలర్‌షిప్‌తో సహా ఆహ్వానం అందింది స్వాతికి. అదే స్కూల్లో పరిచయమైన రోహన్‌ను ప్రేమించి పెళ్లాడింది.  మొదటి నుంచి స్వతంత్రంగా ఆలోచించే స్వాతి ఇండియాకు వచ్చాక  భర్తతో కలిసి స్టార్టప్ మొదలుపెట్టింది. మన దేశంలో విదేశీ మదుపు సంస్థల నుంచి సుమారు 26 కోట్ల రూపాయల పెట్టుబడి పొందిన రాయితీల స్టార్టప్ ఇదే కావడం విశేషం. స్టార్టప్ ప్రారంభించాలనుకున్న వెంటనే ఎంతో రీసెర్చ్ చేశానంటోంది స్వాతి. అనేక ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే నైపుణ్యం, చాకచక్యం ఉండాలంటుంది. మలేసియా, సింగపూర్‌లాంటి చోట్ల స్టార్టప్ ప్రారంభించాలనుకున్నాం. కానీ చివరకి ఇండియాను ఎంచుకున్నాం.  భారత్‌లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.  చివరికి ఎన్నో స్టార్టప్‌లు ఆలోచించినా, అందరికీ భిన్నంగా ఉండాలనుకుని క్యాష్‌కరో స్టార్టప్‌ను ఎంచుకున్నానని తన మొదటి ప్రయత్నాన్ని చెప్పింది. బాధ్యతగా ఒక పని మొదలుపెట్టినప్పుడు అంతే బాధ్యతతో దాన్ని పూర్తి చేయాలంటుంది. తన అనుభవాన్ని చెబుతూ మొదట్లో నేను రాత్రి ఎప్పటికో నిద్రపోయి, ఉదయం లేటుగా లేచేదాన్ని. వ్యాపారం మొదలుపెట్టాక ఉదయాన్నే ఆరు గంటలకు లేవడం అలవాటు చేసుకున్నాను. పొద్దుటే లేవడం వల్ల మంచి ఆలోచనలతో పాటు ఎక్కువ సమయం దొరికినట్లు అనిపించింది.  ఆ దొరికిన సమయాన్ని నా ఫిట్‌నెస్ కోసం వాడుకున్నాను. యోగ, ధ్యానం చేసేదాన్ని. మంచి ఆలోచనలు రావాలంటే శారీరక ఫిట్‌నెస్ కూడా ముఖ్యమే అంటుంది స్వాతి భార్గవ. మహిళా వ్యాపారవేత్తగా ఒత్తిళ్లను ఎదుర్కొని, వ్యాపార రంగంలో ముందుకెళ్లాలంటే ఉదయాన్నే లేచే అలవాటు చాలా మంచిదంటారామె.  ఈ మాటలు సలహాలుగా తీసుకోకుండా పాటించి చూడమంటుంది. వ్యాయామం వల్ల రోజంతా సానుకూల దృక్పథంతో పనిచేస్తూ, అలసటకు తావులేకుండా ఉంటుందంటుంది.  స్టార్టప్ ప్రారంభించిన మొదటి రోజుల్లో ఉన్న ఊపు తర్వాతర్వాత పక్కదారి పట్టకుండా చూడాలంటారు. అంటే నిర్లక్ష్యానికి తావివ్వద్దని చెబుతుంది. స్టార్టప్‌ను మానసపుత్రికలా చూసుకోవాలంటుంది. నాణ్యతలో రాజీపడటం అనేది పారిశ్రామిక వేత్తలకు ఉండకూడని లక్షణమంటుంది.  బయట నుంచి పెట్టుబడులు ఆశించడం తప్పుకాదు కానీ అదే మన లక్షం కాకూడదు. ఆ నమ్మకం పెట్టుకుంటే సక్సెస్ కాలేకపోవచ్చంటుంది.  డబ్బుతో మొదలయ్యే సమస్యల్ని అధిగమించడం నేర్చుకోవాలి. వినియోగదారుని దగ్గర నిజాయితీగా ఉండాలి. ఉత్పత్తి విషయంలో నిజాయితీనే పెట్టుబడిగా పెట్టాలంటుంది స్వాతి. క్యాష్‌కరో సంస్థకు  స్వాతి భర్త రోహన్  సహవ్యవస్థాపకుడు.   ఇద్దరి మధ్యా ఎన్ని అపోహలు అపార్థాలున్నా అవి మాత్రం వ్యాపారంలో రాకుండా చూసుకుంటామని చెబుతోంది.

Comments

comments