Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

గుజరాత్ ఎటు?

modi

బిజెపి, కాంగ్రెస్ హోరాహోరీ, పోటాపోటీ
గత ఎన్నికల్లో తేడా 9%, అంతకుమించిన
అధిక్యం కోసం కమలం ఆరాటం, మూడు
వర్గాల అదనపు ఓటు మీద హస్తం ఆశలు

రాజ్‌కోట్: గుజరాత్ ఎన్నికల్లో అధికార బిజెపికి చెక్ పెట్టి విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2012లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి అధికారం తెచ్చి పెట్టిన 9 శాతం ఓట్ల తేడాను అధిగమించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా తన స్టార్ ప్రచారకుడు రాహుల్ గాంధీపైనే ఆశ లు పెట్టుకుంది. కొత్త పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో పాటు దళితులు, పటేదార్లకు చేరువయ్యేందుకు మార్గాలు అన్వేషిస్తోంది.గుజరాత్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ఇక్కడ రెండు దశాబ్దాలకు పైగా పాలన సాగిస్తోంది. అయితే, 2012లో వచ్చిన ఓట్ల శాతంతోనే తృప్తి పడుతున్నట్టుగా లేదు. ఈ శాతాన్ని మరింత పెంచుకోవాలనే లక్షంతో ప్రచారంలో ముందుకు సాగుతోంది. గుజరాత్ శాసనసభ ఎన్నికలు రెండు దశల్లో  డిసెంబరు 9, 14 తేదీల్లో జరుగనున్నాయి. ఓటర్లు 182 అసెంబ్లీ స్థానాలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రచారానికి ప్రత్యేకించి ర్యాలీలకు వచ్చే జనం సంఖ్య ఓట్లుగా మారుతుందని, పటీదార్ కోటా ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్, ఒబిసి నాయకుడు అల్పేష్ ఠాకూర్, దళిత ఉద్యమ నేత జిగ్నేష్ మెవానీ వంటి కొత్త భాగస్వామ్య పక్షాలకు మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఠాకూర్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, పటీదార్ అనామత్ ఆందోళన్ సమితికి నేతృత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గుజరాత్‌లో దళిత ఉద్యమానికి నేతగా ప్రకటించుకున్న మెవానీ ఉత్తర గుజరాత్‌లోని వేద్గాం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో తన అభ్యర్థిని పోటీకి దించకుండా కాంగ్రెస్ పార్టీ మెవానీకి మద్దతు పలికింది.మరోవైపు, వ్యాపార వర్గాలు, గిరిజనుల ఓట్లను చేజిక్కించుకోవడంపై బిజెపి దృష్టిని సారించింది. భారత ఎన్నికల సంఘం గణాంకాల మేరకు.. 2012 గుజరాత్ ఎన్నికల్లో బిజెపి 47.85 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్ 38. 93 శాతం ఓట్లను పొందింది. ఈ రెండు పార్టీల మధ్య పొందిన ఓట్ల వ్యత్యాసం 8.92 శాతం. దాదాపు 9 శాతంగా ఉన్న ఈ తారతమ్యంతోనే బిజెపి 115 స్థానాలను గెల్చుకోగా,
కాంగ్రెస్ 61 స్థానాలకే పరిమితమైంది. ఎన్‌సిపి, కేశూభాయ్ పటేల్ నేతృత్వంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ చెరో రెండు స్థానాలను గెలుపొందాయి. జనతా దళ్ (యు) ఇండిపెండెంట్‌గా ఒక స్థానంలో విజయం సాధించింది. 2012 ఎన్నికల నాటికి గుజరాత్‌లోని 26 జిల్లాల్లో 3.8 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 72.02 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది గుజరాత్ చరిత్రలోనే అత్యధికం. తాజాగా ఇసి విడుదల చేసిన గణాంకాల మేరకు..గుజరాత్ ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 4.35 కోట్లకు చేరింది. ఈసారికి బిజెపికి తగ్గి పోటీ ఇవ్వనున్నామని గుజరాత్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (జిపిసిసి) వర్కింగ్ ప్రెసిడెంట్ కువార్జీభాయ్ బావలియా తెలిపారు. హార్దిక్ పటేల్ ద్వారా పటీదార్ వర్గాల్లో, అల్పేష్, జిగ్నేష్‌ల ద్వారా ఓబిసిలు, దళితుల్లో ప్రచారం సాగుతుందని, ఇది తమకు మంచి ఫలితాన్ని (బిజెపి ఓట్ల శాతాన్ని గెల్చుకోవడం) అందిస్తుందని బావలియా ధీమా వ్యక్తం చేశారు. ‘2012లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు హార్దిక్, అల్పేష్‌లు లేరు. ఒంటరిగా పోటీ చేసినప్పుడే కాంగ్రెస్ 38.93 శాతం ఓట్లను సాధించింది, ఇప్పుడు ముగ్గురితో కలిసి వెళ్తున్నందున మరింత అదనపు శాతాన్ని గెల్చుకుంటాం’ అని ఆయన చెప్పారు. 2012 తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో బిజెపి విజయం సాధించిందని ఆ పార్టీ గుజరాత్ అధికార ప్రతినిధి హర్షద్ పటేల్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉందని, మూడేళ్ల తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే 2012 కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తామని చెప్పారు. ‘కాంగ్రెస్‌తో బిజెపికి ఓట్ల తేడా 9 శాతమన్నది వాస్తవమే కాని, తమకు ఎంత మంది ఎంఎల్‌ఎలు ఉన్నారో ఒకసారి చూడండి’ అని అన్నారు.‘ 2014 ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుంటే (మొత్తం 26 లోక్‌సభ స్థానాలను బిజెపి గెల్చుకుంది) ఈసారి కూడా ఓటర్ల నుంచి ఇదే విధమైన ఫలితాలను పొందుతాం. 2012 కంటే అదనంగా స్థానాలను గెల్చుకుంటాం’ అని అన్నారు. రాష్టంలో 150కు మించి స్థానాలను గెల్చుకోవాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లక్షం నిర్ధేశించుకున్నారు. కాంగ్రెస్ 176 స్థానాల్లో పోటీ చేసింది (2012 ఎన్నికల్లో) అయితే బిజెపి అన్ని స్థానాల్లోనూ (182) అభ్యర్థులను నిలిపింది. అయితే, కాంగ్రెస్ బిజెపితో 9 శాతం ఓట్లతోనే వెనుకబడింది. ఇది కాంగ్రెస్‌కు ఇప్పుడు కలిసొచ్చే అంశం’ అని ప్రముఖ పాత్రికేయుడు జయేష్ థాకూర్ పేర్కొన్నారు. 2012లో కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంది. కాని ఇప్పుడు పటీదార్, ఓబిసి, దళిత నాయకులు ప్రచారం చేయనున్నందున ఈ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఓట్లను సాధించేందుకు మరింత శక్తి సామర్థాలను పెంపొందించుకోవాల్సివుంటుందని పేర్కొన్నారు.

Comments

comments