Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

బిజెపిని హడలెత్తిస్తున్న హార్దిక్

edt

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతాపార్టీ నేతలంతా కలిసి చేస్తున్న ఒకేఒక పని కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎగతాళి చేయడం. బిజెపి ఒకవైపు రాహుల్ ప్రాముఖ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ దానికి పక్కలో బల్లెంలా ఎదుగుతున్నాడు. పాటిదార్ సముదాయానికి రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలు నిర్వహించిన 24 సంవత్సరాల ఈ యువనేత నేడు గుజరాత్ ఎన్నికల్లో ఒక ప్రధానశక్తిగా ఎదిగాడు. బిజెపిపై తీవ్రమైన దాడి చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. రానున్న ఎన్నికలు ఆరుకోట్ల గుజరాతీలకు, బిజెపికి మధ్య పోటీగా చెప్పాడు. గుజరాత్ బిజెపి ప్రభుత్వం అహ్మదాబాద్‌లో ప్రారంభించిన రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను, సూరత్‌లో కూడా ప్రారంభించాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్టును వేలెత్తి చూపుతూ ప్రగతి వికాసాలకు ఇది నిదర్శనం కానేకాదని, గ్రామీణ ప్రజలు వలసపోవడం ఆగిపోతే అది ప్రగతికి నిదర్శనమని హార్దిక్ చెప్పాడు. సూరత్‌లో ఒక ర్యాలీని ఉద్దేశించి హార్దిక్ మాట్లాడాడు. దాదాపు 50 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బిజెపి సమాజాన్ని ముక్కలు చేసిందని మండిపడుతూ, కమల నాథులు గుజరాత్ తమ స్వంత ఆస్తి అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. ఆ వెంటనే బానిసత్వం అలవాటైపోయిందని ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను కోరాడు. ఉత్తర గుజరాత్‌లో, దక్షిణ గుజరాత్ హార్దిక్ పటేల్ ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పటేల్ సముదాయం ఆయన వెన్నంటి వుంది. వజ్రాల వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు హార్దిక్ పటేల్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ హఠాత్తుగా హార్దిక్ ఒక 5 నిముషాలు బ్రేక్ తీసుకుందామని, ఈ లోపు మీరంతా సౌరాష్ట్రలో మీ బంధువులకు సెల్ ఫోనుతో ఫోన్లు చేసి బిజెపికి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పండన్నాడు. ప్రజలు తమ తమ సెల్ ఫోన్లు తీసి ఫోను చేసే ప్రయత్నాల్లో పడిపోయారు. కాని ఫోన్లు కలవడం లేదు. వెంటనే హార్దిక్ పటేల్ ఈ పరిస్థితిని ఎత్తి చూపుతూ, 4జి వచ్చేసిందంటారు, అసలు 2జి కూడా పనిచేయడం లేదు. ఇది వీళ్ళు చెప్పే గొప్ప డిజిటల్ ఇండియా అని ఎద్దేవా చేశాడు. అంతేకాదు, విదేశాలు తిరుగుతూ మోడీ విదేశీ పెట్టుబడుల కోసం బిచ్చమెత్తుతున్నారని నిరసించాడు. మీరంతా ఓటు వేయాలి. ఎన్నికల మర్నాడు వార్తా పత్రికలన్నీ ఒకే గొంతుతో ”ఆరుకోట్ల గుజరాతీలు అహంకార పాలకులను విసిరి కొట్టారని“ రాయాలన్నాడు. ప్రజలను ఆకట్టుకోవడం ఎలాగో హార్దిక్ పటేల్‌కు బాగా తెలుసు. బిజెపి ఎలాంటి టెక్నిక్కులతో ప్రజలను ఆకట్టుకుందో అవే టెక్నిక్కులు ఇప్పుడు హార్దిక్ దానిపై ప్రయోగిస్తున్నాడు. ర్యాలీలో ఆయన వెనుక భగత్ సింగ్, సర్దార్ పటేల్ బొమ్మలున్నాయి. జాతీయ జెండా చేతుల్లో వున్న భారతమాత బొమ్మ వుంది. ర్యాలీకి వచ్చిన వారందరితో హార్దిక్ ప్రతిజ్ఞ కూడా చేయించాడు. ఓటు వేయడానికి త్వరగా వెళతాం, బిజెపికి ఓటు వేయం అని అందరి చేత ప్రతిజ్ఞ చేయించాడు. కాంగ్రెసుకు ఓటేయాలని వారిని హార్దిక్ కోరలేదు. కాని, ప్రభుత్వం ఏర్పరిచే స్థాయిలో వున్న పార్టీకి ఓటేయండన్నాడు. అంటే బిజెపికి ఓటు వేయవద్దు, మిగిలిన పార్టీల్లో ప్రభుత్వం ఏర్పరిచే బలమున్న పార్టీకి ఓటేయాలని చెప్పడం. సౌరాష్ట్రలో పోటీ పడుతున్న నేషనలిస్ట్ కాంగ్రేసు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు అంత బలం లేదు. కాబట్టి చెప్పకుండానే కాంగ్రెసుకు ఓటేయండని చెప్పేశాడు. తన ప్రసంగానికి ముందు వేదికపై సోఫాలో ఆయన కూర్చోలేదు. క్రిందనే బాసింపట్లు వేసుకుని కూర్చున్నాడు. ప్రసంగం మధ్యలో సోషల్ మీడియా లైవ్ టెలికాస్ట్‌లో తన ప్రసంగానికి వచ్చిన లైకుల గురించి కూడా సంతోషంగా చెప్పాడు. ఇవన్నీ ప్రజలతో కనెక్ట్ చేసే ముఖ్యమైన విషయాలు. హార్దిక్ పటేల్ ప్రసంగం ప్రజల్లో నూతనోత్తేజాన్ని కలిగించిందన్నది నిజమే కాని, ఆయన ప్రసంగంలో ఉర్రూతలూపే ఆవేశం కాని, హావభావాల్లో ఆగ్రహం కాని లేదు. చాలా మృదువుగా, మెతకగా మాట్లాడాడు. మౌనంగా ఉండమని ఆయన కోరిన వెంటనే ర్యాలీలో జనం నిశ్శబ్దమైపోయారు. మృదువుగా మాట్లాడినా మోడీ, అమిత్ షా ద్వయంపై తీక్షణమైన దాడి చేశాడు. బహుశా ఇంతవరకు మోడీని, అమిత్ షాను ఈ స్థాయిలో నిలదీసిన వాళ్ళు లేరు. అమిత్ షా ను జనరల్ డయ్యర్‌తో పోల్చాడు.
జలియన్ వాలా బాగ్ ఊచకోతలు సాగించిన జనరల్ డయ్యర్ తో పోల్చడం గమనించదగింది. అతను యువకుడు, యువరక్తం ఉరకలేస్తున్నవాడు. రాజకీయాల్లో ఎలాంటి ట్రాక్ రికార్డు లేనివాడు. గ్రామీణ ప్రజలు, పట్టణాల్లో స్థిరపడిన గ్రామీణుల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తుతున్నాడు. అందువల్లనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని కొందరి అభిప్రాయం. ప్రయివేటు కాలేజీల్లో పెరిగిపోతున్న ఖర్చులు, సగటు పౌరుడికి తన పిల్లలను చదివించడం అసాధ్యంగా మారిన పరిస్థితులు, ఒకవేళ చదివినా ఉద్యోగం దొరకని చదువును ఆయన ప్రశ్నిస్తున్నాడు. చాలా సందర్భాల్లో అతను చెప్పిన మాట, తన తండ్రికి ఆరెకరాల భూమి వుంది. దాంతో నెలకు కేవలం పాతికవేల రూపాయలు మాత్రమే ఆదాయం లభిస్తుంది. అది కూడా పంట సరిగా పండుతుందని కాని, పండిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని కాని ఎలాంటి గ్యారంటీ లేని ఆదాయం. పాటెల్ సముదాయంలో అందరూ సంపన్నులే అనడం సరికాదని అంటాడు. పాటిదార్ సముదాయంలో కేవలం 5 శాతం మాత్రమే సంపన్నులుంటారని, మిగిలిన వారంతా, ముఖ్యంగా గ్రామాల్లో జీవించే వారంతా తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నారని చెప్పాడు. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాలున్నాయి. అందులో 98 స్థానాలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి. అందువల్లనే హార్దిక పాటిల్ గుజరాత్‌లో నేడు బలమైన నాయకుడని విశ్లేషకుల అభిప్రాయం. మరి 45 స్థానాల్లో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు కలగలిసి వున్నాయి. ఈ స్థానాల్లో కూడా ఓటింగ్ సరళిపై హార్దిక్ పటేల్ ప్రభావం వుండవచ్చని తెలుస్తోంది. కేవలం 39 పట్టణ ప్రాంతాలో వున్న స్థానాల్లోనే బిజెపి బలంగా వుంది. పట్టణ ప్రాంతాల్లో హార్దిక్ ప్రభావం తక్కువ. అయితే సూరత్ వంటి చోట్ల చాలా మంది వజ్రాల వర్కర్లు ఉన్నారు.
ఇలాంటి చోట్ల కూడా హార్దిక్ ప్రభావం వుంది. హర్దిక్ విమర్శల వల్ల గుజరాత్‌లో ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య చర్చ మొదలైంది. ఉన్నవారు, లేనివారన్న చర్చ మొదలైంది. ఈ చర్చ ఎన్నికలపై బలమైన ప్రభావం వేయవచ్చని చాలా మంది భావిస్తున్నారు. హార్దిక్ పాటిల్ స్టేజి ఎక్కుతున్నప్పుడు “జై సర్దార్‌“ నినాదాలు మిన్నంటాయి. ఈ నినాదాలు నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఉద్దేశించినట్లు అనిపించినా, హార్దిక్ పాటిల్ నాయకత్వం వహిస్తున్న పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నినాదాలుగా వీటిని ఆయన మార్చేశాడు. హార్దిక్ పాటిల్ త్వర లో బహుశా ఒక పాటిదార్ పార్టీ స్థాపించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో పాటిల్ సముదాయం 15 శాతం వున్నారు. రాజకీయాధికారం కోసం ఈ సముదాయం ప్రయత్నిస్తోంది. 1980 వరకు పాటిల్ సముదాయం కాంగ్రెసుకు మద్దతిచ్చేది.

                                                                                                                                                                                 * కింగ్ షుక్ నాగ్ 

Comments

comments