Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

మొక్కజొన్న రైతుల కన్నెర్ర

farmer

*కేంద్రాలను తెరవాలని డిమాండ్
*కొనుగోళ్లు లేక దిగాలు
*దిగుబడులకు అందని గిట్టుబాటు
*నష్టపోతున్న రైతులు

మన తెలంగాణ/మద్నూర్: ఆరుగాలం కష్టించే రైతులకు ఖరీఫ్ సాగు సంతృప్తిని ఇవ్వలేకపోయింది. పెట్టిన పెట్టుబడులకు వచ్చిన దిగుబడులు వారి అంచనాలను తారుమారు చేశాయి. ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర అందకపోవడంతో వారిలో ఆందోళన కలుగుతోంది. కొనుగోళ్లు లేక మొక్క జొన్న రైతులు దిగాలు చెందుతున్నారు.  శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో వారు రోడ్డెక్కే పరిస్థితులు దాపురిస్తున్నాయి. దిగుబడులను కొనుగోలు చేసి ఆదుకోవాలని రెండు రోజుల క్రితం జుక్కల్ నియోజక వర్గంలోని పిట్లం మార్కెట్ యార్డులో రైతులు ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అధికారులతో వాగ్విదానికి దిగారు. కార్యాలయంలో రైతులు జమగూడి గాయిగాయి చేశారు. ఏకంగా కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన చాటారు. మరో రైతు గోవింద్ రావ్ ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వివాదాస్పద  వాతావరణాన్ని సృష్టించాడు. పోలీసులు  రంగ ప్రవేశం చేసి వాతావరణాన్ని చల్లబడేట్లు  చేసినప్పటికీ రైతుల్లో ఆందోళన తగ్గుముఖం పట్టలేదు. తాము పండించిన  పంటను మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నా రు. ఖరీప్ సాగులో జుక్కల్ సెగ్మెంట్‌లో మొక్కజొన్న పంటను అధికంగా సాగుచేసుకున్నా రు. అనుకున్నంతగా పంటలు చేతికి రాక రైతుల్లో ఓ వైపు అసంతృప్తి చోటుచేసుకుంటే మరోవైపు అధికారులు కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు కన్నె ర్ర చేస్తున్నారు. జిల్లాలో 19 కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న దిగుబడులను కొనుగోళ్లు చేసినట్లు మార్క్‌ఫెడ్ డిఎం చంద్రశేఖర్ తెలిపారు. రైతు ల ఆందోళనకు స్పందించిన ఆయన పిట్లం మార్కెట్ కమిటీని సందర్శించి మొక్కజొన్న పంట స్థితిగతులను పరిశీలించారు. అక్కడ రైతు ల సమస్యపై వాకబు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 17 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను  కొనుగోలు చేయడం జరిగిందని, పిట్లం మార్కెట్‌లో  కూడా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పా ట్లు చేస్తామన్నారు. రైతులు సామరస్యంగా ఉండాలని ఆయన సూచించారు. రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రం తెరిపించే విధం గా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. క్వింటాళులకు 1425 రూపాయల గిట్టుబాటు ధరను అందించడంపై రైతులు అసహనాన్ని వ్యక్తం చేశారు. పక్షం రోజుల క్రితం మద్నూర్‌లో కూడా మినుము రైతులు ఆందోళనకు దిగిన సంఘటణలున్నాయి. రైతుల వద్ద ఉన్న మినుము పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో లాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిర్ధేశించిన టార్గెట్ ప్రకారం కొనుగోళ్లు జరిగిపోయాయని మార్క్‌పెడ్ అధికారులు కేంద్రాన్ని మూసి వేయడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. ప్రతీసారి పంట దిగుబడులను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సహకరించక, మద్య దళారుల చేతికి చిక్కి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆపదలో ఆదుకున్నవాడే దేవుడు అన్న చందంగా దళారులు నగదును ఆశచూపి ఇష్టారీతిన ధరను తగ్గిస్తూ కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. వరితో పాటు మొక్కజొన్న, మినుము, సోయా, కంది పంటలను అమ్ముకోవడం రైతులకు సవాలుగా మారింది. ఇప్పటికైనా రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, సకాలంలో రైతులకు పైకం అందించి, దళారుల బెడదకు కళ్లెం వేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments