Search
Monday 11 December 2017
  • :
  • :

క్రికెటర్లకు అస్వస్థత

SL

న్యూఢిల్లీ: వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్, శ్రీలంక క్రికెటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రెండో రోజు ఆటలో శ్రీలంక క్రికెటర్లు ఫీల్డింగ్ చేసేందుకు నిరాకరించడంతో దాదాపు అరగంటకు పైగా ఆటను నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రికెటర్లు మాస్క్‌ను ధరించి ఫీల్డింగ్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి కూడా వాయు కాలుష్యం దెబ్బకు అస్వస్థతకు గురయ్యాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బౌలింగ్‌కు దిగిన షమి మైదానంలోనే వాంతి చేసుకున్నాడు. కాలుష్య పొగ వల్ల షమి బౌలింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అనంతరం అతను ఒక బంతి వేసి మైదానం విడిచి పెవిలియన్‌కు వెళ్లి పోయాడు. అంతకు ముందు భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లక్మల్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. అతను కూడా మైదానంలో వాంతి చేసుకున్నాడు. అతను కూడా కొద్ద సేపు మైదానాన్ని వీడి పోవాల్సి వచ్చింది. పొగ కాలుష్యం పెరిగి పోవడంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాగా, ఢిల్లీ మ్యాచ్‌కు పొగ కాలుష్యం భూతం వెంటాడుతుండడంతో భవిష్యత్తులో ఇక్కడ మ్యాచ్‌లు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇకపై జాగ్రత్త వహిస్తాం…
మరోవైపు ఢిల్లీలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే ముందు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని భారత క్రికెట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ మ్యాచ్‌కు కాలుష్యం దెబ్బతగలడం, పలుమార్లు ఆటకు అంతరాయం కలుగడం తదితర పరిణామలపై బిసిసిఐ క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని బిసిసిఐ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా శీతకాలంలో ఢిల్లీలో మ్యాచ్‌లు లేకుండా చూస్తామని, భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీ ప్రణాళికతో ముందుకు సాగుతామని వారు తెలిపారు. ఢిల్లీలో మ్యాచ్‌ల షెడ్యూల్డ్‌ను ప్రకటించే ముందు వాయు కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని వారు వివరించారు. కాగా, ఢిల్లీలో గాలిలో కాలుష్యం తీవ్రత సోమవారం 455గా నమోదైంది. ఇదిలావుండగా నాణ్యత సూచీలో దీని తీవ్రత 150 దాటితేనే అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తారు. దీన్ని బట్టి ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Comments

comments