Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

ముగిసిన రెండోరోజు ఆట… శ్రీలంక 131/3

Virat-Kohli

న్యూఢిల్లీ: వేదికగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఆతిథ్య భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 536/7 వద్ద డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో లంక ఇంకా 405 పరుగులు వెనబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోర్ 371/4తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్… విరాట్, రోహిత్ శర్మ ద్వయం లంక బౌలర్లను ఆటాడుకున్నారు. వీరవిహారం చేసిన విరాట్ కోహ్లీ కేవలం 238 బంతుల్లోనే ద్విశతకం(201) నమోదు చేశాడు. దాంతో కెప్టెన్‌గా విరాట్ ఆరు డబుల్ సెంచరీలు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఐదు డబుల్ సెంచరీలతో బ్రియన్ లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో రోహిత్ అర్ధశతకం నమోదు చేశాడు. కానీ లంచ్ సమయానికి కొద్దిసేపటి ముందు రోహిత్(65) పరుగుల వద్ద అనుహ్యంగా క్యాచ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ, రోహిత్ జోడి 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

భోజన విరామం తరువాత కాలుష్యం ఆటంకంగా మారడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. కొద్దిసేపటి అనంతరం ఆట ప్రారంభం కాగా టీమిండియా స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదట అశ్వీన్(4) వెనుదిరిగాడు. ఆ తరువాత కోహ్లీ(243) పెవిలియన్ చేరాడు. క్రీజులో సాహా(9), జడేజా(5) ఉండగా.. కోహ్లీ ఇన్నింగ్స్‌ను 536/7 వద్ద డిక్లేర్డ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. లంక బౌలర్లలో స్పిన్నర్ సందకన్ 4, గమగె 2, పరెరా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక పరుగులేమి చేయకుండానే ఓపెనర్ కరుణరత్నే(0) వికెట్ కోల్పోయింది. మధ్యలో పరెరా(42) కాసేపు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. డిసిల్వా(1) త్వరగానే ఔటయ్యాడు. దీంతో లంక 75 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. వికెట్లు తొందరగానే కోల్పోయిన లంకకు సినీయర్ బ్యాట్స్‌మెన్ మ్యాథ్యూస్ అర్ధశతకంతో ఆదుకున్నాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 131 పరుగుల చేసింది. ప్రసుత్తం క్రీజులో మ్యాథ్యూస్(57 బ్యాటింగ్), చండీమల్(25 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ బౌలర్లలో షమీ, ఇషాంత్ శర్మ, జడేజా చెరో వికెట్ తీశారు.

Comments

comments