Search
Monday 21 May 2018
  • :
  • :
Latest News

ట్రంప్ ద్రోహపూరిత నిర్ణయం

sampadakeyam

పవిత్రమైన జెరూసలెం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం చేసిన ప్రకటన పశ్చిమాసియాలో అగ్నికి ఆజ్యం పోసేదిగా ఉంది. తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. జెరూసలెం ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య వివాదంగా ఉన్నందున వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌లోనే ఉన్నాయి. తూర్పు జెరూసలెం తమ భవిష్య రాజధానిగా పాలస్తీనియన్‌లు భావిస్తున్నారు. పాలస్తీనా రాజ్య స్థాపన సమస్య పరిష్కారంలో భాగంగా జెరూసలెం సమస్యను పరిష్కరించాలన్నది పూర్వపు అధ్యక్షులు జార్జిబుష్, బరాక్ ఒబామా వైఖరి. అరబ్ ఇజ్రాయిల్ వివాదానికి శాంతియుత పరిష్కారం కొరకు రెండు దశాబ్దాలుగా అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ, పరిష్కారం లభించకపోవటానికి ఇజ్రాయిల్‌పట్ల అమెరికా పక్షపాతమే కారణం. అయితే గత అధ్యక్షులు నేర్పుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాని ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతున్న ట్రంప్, పాలస్తీనా సమస్యపై శాంతి చర్చలకు దూతగా తన అల్లుడు జరెడ్ కుష్‌నర్‌ను నియమించి శాంతి క్రమం కొనసాగుతుందంటూనే జెరూసలెంపై నిర్ణయం ప్రకటించారు. పశ్చిమాసియాలో చిచ్చురగిల్చే ఈ దుందుడుకు నిర్ణయం పాలస్తీనియన్‌లకు, ఇతర అరబ్ దేశాలకు ద్రోహం చేసింది. ట్రంప్ ఒంటెత్తు పోకడను ఐరాస ప్రధాన కార్యదర్శి, జర్మనీ, బ్రిటన్, ప్రాన్స్, రష్యా, చైనా తదితర దేశాలు ఖండించాయి. ట్రంప్ నిర్ణయాన్ని ‘చరిత్రాత్మకం’గా ఇజ్రాయిల్ అభివర్ణించటంలో ఆశ్చర్యం లేదు. కాగా అమెరికా మిత్ర రాజ్యాలైన సౌదీ అరేబియా, జోర్డాన్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని బాహాటంగా బలపరచలేని స్థితిలో ఉన్నాయి. జెరూసలెంపై ఇజ్రాయిలీ అనుకూల నిర్ణయంవల్ల శాంతి క్రమానికి విఘాతం ఏర్పడుతుందని పాలస్తీనాసహా కొన్ని అరబ్ రాజ్యాలు ముందుగా చేసిన హెచ్చరికలను ట్రంప్ చెవినపెట్టలేదు. ఇజ్రాయిల్ పక్షపాతిగా ప్రకటించుకున్నందున శాంతి చర్చల్లో మధ్యవర్తి పాత్రను అమెరికా కోల్పోయింది. వాషింగ్టన్‌లోని పాలస్తీనా విముక్తి సంస్థ కార్యాలయాన్ని మూసివేయటానికి ఇంతకు ముందు ప్రయత్నించిన ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. శాంతి చర్చల నుంచి తప్పుకుంటామని పిఎల్‌ఒ చేసిన హెచ్చరిక పని చేసింది.
యూదు, ముస్లిం, క్రైస్తవ మతాల పవిత్ర ప్రదేశాలున్న జెరూసలెం ప్రపంచంలోనే విశిష్టమైంది. 1517 నుంచి ఆ నగరాన్ని పాలించిన ‘ఒట్టమాన్ సామ్రాజ్యం నుంచి 1917 లో బ్రిటిష్ జనరల్ ఎడ్మండ్ అల్లెనీబ్ స్వాధీనం చేసుకున్నాడు. తదుపరి మూడు దశాబ్దాల్లో యూదులు పెద్ద ఎత్తున నివాసమేర్పరుచుకున్నారు. 1947లో యూదు, అరబ్ రాజ్యాలుగా విభజించిన ఐరాస ప్రణాళిక, జెరూసలెంను విశిష్టమైన అంతర్జాతీయ పరిపాలన వ్యవస్థగా ప్రతిపాదించింది. దాన్ని యూదు నాయకులు అంగీకరించినా, అరబ్ నాయకులు తిరస్కరించారు. 1948లో బ్రిటిష్ వారి ఉపసంహరణతో జెరూసలెం పశ్చిమ భాగాన్ని ఇజ్రాయిల్ ఆక్రమించుకోగా, జోర్డాన్, పాలస్తీనీయులు తూర్పు భాగం స్వాధీనం చేసుకున్నారు. కాగా 1967 యుద్ధంలో ఇజ్రాయిల్ తూర్పు భాగాన్ని ఆక్రమించుకుంది. “సంపూర్ణ, ఐక్య జెరూసలెం ఇజ్రాయిల్ రాజధాని” అంటూ 1980లో ఇజ్రాయిల్ పార్లమెంట్ ఒక బిల్లు ఆమోదించింది. అయితే ఆ శాసనం “చెల్లుబాటు కాదు” అని ఐరాస భద్రతా మండలి తీర్మానం (478) ఆమోదించింది. ఇదిలా ఉండగా, అమెరికన్ కాంగ్రెస్ 1995లో జెరూసలెంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తూ తమ ఎంబెసీని అక్కడికి తరలించాలని కోరుతూ ‘జెరూసలెం ఎంబెసీ చట్టం’ ఆమోదించింది. దాని అమలును వాయిదా వేస్తూ ఆర్నెల్లకొకసారి ప్రకటన చేసే అవకాశాన్ని అధ్యక్షునికి కల్పించింది. బిల్ క్లింటన్, జార్జి డబ్లుబుష్, ఒబామా ఆ క్లాజును ఉపయోగించారు.
ట్రంప్ ఏకపక్ష నిర్ణయం మరో తిరుగుబాటుకు దారి తీస్తుందని అరబ్ యువత హెచ్చరిస్తోంది. ఇరాన్‌ను అణచివేసే ప్రయత్నంలో సౌదీ అరేబియాను ప్రోత్సహిస్తున్న ట్రంప్, ఇరాన్‌తో ఒబామా కాలపు అణు నిరోధక ఒప్పందాన్ని రద్దు చేస్తామంటున్నాడు. ప్రమాదకరమైన ట్రంప్ ఒంటెత్తు పోకడలను గట్టిగా నిరసించటమే అంతర్జాతీయ సమాజం ముందున్న తక్షణ కర్తవ్యం. భారత ప్రభుత్వం అస్పష్టతను, ఊగిసలాటను విడనాడాలి. అంతర్జాతీయ సమాజంతో గొంతు కలపాలి.

Comments

comments