Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

గీత కార్మికులకు ఉచితంగా క్లయింబింగ్ మిషన్లు

harish

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: రాష్ట్రంలోని గీత కార్మికులకు త్వరలోనే ఉచితంగా చెట్లు ఎక్కేందుకు క్లయింబింగ్ మిషన్లను సిఎం చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేటలో 1.50 లక్షలతో నిర్మిస్తున్న గౌడ సంఘం ఫంక్షన్ హాల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొలివిడతగా రాష్ట్రంలో 10వేల మందికి వీటిని అందిస్తున్నామని, టిఎఫ్‌టిలను టిసిఎస్‌లుగా మారుస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించనున్నదని తెలిపారు. గీత కార్మికులు మారుతున్న కాలమాన పరిస్థితుల ప్రకారం పాత పద్ధతులను విడనాడి కొత్తదనాన్ని అందుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కుల వృత్తిని చేసేవారు గీతకార్మికులేనని వారి కోసం క్లయింబింగ్ మిషన్లను తెస్తున్నట్టు తెలిపారు. సొసైటీలోని సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. సొసైటీలను ఐదేండ్లకొకసారి రెన్యువల్ కాకుండా పదేండ్ల కొకసారి రెన్యువల్ చేయించుకునే విధంగా  చెట్టు పన్నును ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను త్వరలోనే  జారీ చేయనున్నదని తెలిపారు. వైఎస్‌ఆర్ హయాంలో హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్‌లను తొలగిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత సిఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వాటిని తిరిగి ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. గీత కార్మికులు, సొసైటీలు తాటి, ఈత వనాలను ఏర్పాటు చేసుకుని మంచి ఆదాయాన్ని పొందాలని సూచించారు. సిద్దిపేట గౌడ సంఘం ఫంక్షన్ హాల్‌కు తాను సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి టీ.హరీష్‌రావు మాట్లాడుతూ మూడంతస్థుల్లో సిద్దిపేట గౌడ సంఘం ఫంక్షన్ హాల్‌ను నిర్మిస్తామని, పేద గీత కార్మికుల పిల్లల వివాహాలకు తక్కువ రుసుముతో వాటిని అద్దెకివ్వాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో తాటీ, ఈత వనాలతో పాటు జీలుగ చెట్ల పెంపకానికి తన వంత సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. వీటికి సబ్సీడీపై డ్రిప్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేట గౌడ సంఘ ఫంక్షన్ హాల్‌కు తన ఎంపి నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కల్లు సొసైటీలు చిగురిస్తున్నాయని, కల్లుగీత వృతి ఒక పరిశ్రమగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా చంద్లాపూర్ సొసైటీ సభ్యులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అంతకు ముందు మంత్రులు రేణుక ఎల్లమ్మదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ కె.రాజనర్సు, జెసీ పద్మాకర్, శ్రీకాంత్‌గౌడ్, వెంకటగౌడ్, శంకర్‌గౌడ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

comments