Search
Friday 20 April 2018
  • :
  • :

పిల్ల రాయేసురాలైంది…

ఆడపిల్ల పెద్ద మనిషి అయిన ముచ్చట ఆడోల్లకే తెలుస్తది. తెల్సినంక ఇంట్ల ఓ మూలకు ఈత సాప ఏసి కూసుండ పెట్టి నాలుగు దిక్కుల బియ్యం పోసి వాటి మీద కొబ్బరికుడుకలు పెట్టుతరు. ఆడపిల్లను సాపల కుసుండ పెట్టేటప్పుడు ఒక పెద్ద ముత్తైదువను తీసికవచ్చి ఆమెతోనే అక్షింతలు ఏపిస్తరు. పెద్ద ముతైదువ అంటే ఎక్కువ మంది పిల్లలు కన్న పెద్ద మనిషి అన్నట్టు. 

Girl-Sold

రాయేసురాలంటే ఈ కాలం పిల్లలకు మనుసుకుపట్టకపోవచ్చుగాని ఎన్కటివాల్లకు తెల్సు రాయేసురాలు అంటే ఏంది అమ్మమ్మ అని అడిగితే ముసి ముసి నవ్వుకుంట చెప్పతరు రాయేసురాలంటే పెద్దమనిషి అయినట్టు. జీవితంలో ఇదొక పరిణామ ప్రక్రియ. ఆడపిల్లలు ఎన్కటికాలంలో పదిహేనండ్లకు రజస్వల అయ్యేది ఇది పుస్తకాల భాష పెద్దమనిషి అవుడు. సముర్థ అవుడు ఊర్ల ఇండ్లల్ల భాష ముఖ్యంగా అమ్మలక్కల మద్యనే మాట్లాడుకునే కత ఇది. ఆడపిల్ల పది పదిహేనుఏండ్లు అయితాంటే జరిగే మార్పులు. ఇప్పుడతై తొమ్మది పదేండ్లకే అయితన్నరు కాకపోతే ఈ పేర్లు ఏవి వాడరు మ్యెచురిటీ అంటరు. దీనికో పెద్ద ఫంక్షన్ చేస్తున్నరు ఇది వేరే సంగతి అసలు ఎన్కట రాయేసురాలు అవుతే ఏం చేస్తరు చూద్దాం.

ఆడపిల్ల పెద్ద మనిషి అయిన ముచ్చట ఆడోల్లకే తెలుస్తది. తెల్సినంక ఇంట్ల ఓ మూలకు ఈత సాప ఏసి కూసుండ పెట్టి నాలుగు దిక్కుల బియ్యం పోసి వాటి మీద కొబ్బరికుడుకలు పెట్టుతరు. ఆడపిల్లను సాపల కుసుండ పెట్టేటప్పుడు ఒక పెద్ద ముత్తైదువను తీసికవచ్చి ఆమెతోనే అక్షింతలు ఏపిస్తరు. పెద్ద ముతైదువ అంటే ఎక్కువ మంది పిల్లలు కన్న పెద్ద మనిషి అన్నట్టు. సాపల కూసుండ పెట్టినంక ఆమెకు ఎవలను మొగోల్లను సూడద్దు మాట్లడద్దు అని చెప్పుతరు అప్పుడే మంగాలామెను తీసిక వచ్చి నెత్తి ఈద కొబ్బరి కుడుగలు తింపుతరు. అటెన్క మూడు రోజుల దాక తానం చేపియ్యరు. మూడొద్దులకు మంగలామె తానం చేపిస్తది. పసుపు నూనె పిల్లకు పెయ్యంత రాసి తానం చెపియ్యంగనే మొకం రంగే మారుతది. ఇట్ల పదిరోజుల దాక ఇంట్లనే కూకోవాలె. ఎటు తిరగద్దు ఎవలతో మాట్లాడవద్దు. ఆరోనాడు కూడి మల్ల మంగళామె వచ్చి తానం చేపిస్తది. ఇక పదోనాడు వేడుక జరుపుతరు దీనినే కాళ్లగోల్లు అని అంటరు.

కాళ్లగోల్లు మంగలామె వచ్చి గోరుగాలు తెస్తది. పదోరోజు అమ్మమ్మ తరుపున వాల్లు చిన్నమామలు పెద్దనాయనలు పాలోల్లను కుపోల్లను పిలుస్తరు. జర పెద్ద కుటుంబాలైతే యాటను కోస్తరు లేదా చిన్న కుటుంబాలైతే కోళ్లను కోస్తరు. ఇదంత ఇంటి మ ందం కుపోల్ల మందం చేస్తరు.
ఆదినం మల్లీ మంగాలమె వచ్చి ఐదుగురి ముత్తైదువలకు రాయేసురాలైన అమ్మాయికి అందరికి పసుపు రాసి తానం చేపిస్తది. అందరికి కాళ్ల గోర్లు తీస్తది. అటెన్క మల్ల సాపల కూకుండ బెట్టి కొత్త బట్టలు పెడతరు. అమ్మమ్మ వైపు వాల్లు చెవులకు గున్నాలు తెస్తరు సుట్టు ముట్టు దగ్గరి సుట్టాలు బట్టలు పెడతరు. ఇదొక చిన్న పండుగ లెక్క చేసుకుంటే మల్ల అప్పుడే అందరు కల్సి అన్నం తింటరు. కొందరి ఇండ్లల్ల కల్లు గుడాలు ఉండే ఉంటయి. ఎన్కట ఈ వేడుక కొంచం చిన్నగానే అయ్యేది. ఇది అయినంక ఆడ పిల్లలలో మార్పు కనిపిస్తది. మార్పు అంటే ప్రవర్తనలో మగపిల్లలతో మాట్లాడుడు, ఆడుడు ముచట్లు పెట్టడు ఉండది. ఆడోల్లు మాత్రమే కల్సి తిరుగుతరు అట్ల ఇదొక మార్పు.

అయితే ఇప్పుడుఇలాంటి వేడుకలు గొప్పగానే సాగుతున్నాయి. ఈ పంక్షన్ పేరు సారీ ఫంక్షన్ అనే నామకరణం చేసిండ్రు. ఫంక్షన్ హాల్లో సుట్టాలు ఫ్రెండ్స్ అమ్మాయి ఫ్రెండ్స్ ఫొటోలు, ఆహ్వాన పత్రాలు వాట్సప్ మెసేజ్‌లు, వీడయో గ్రాఫులు ఇదో చిన్నగ పెండ్లి అంత కత నడుస్తున్నది. ఇది వరకు అయితే కొంత అంతర్గతంగా జరుగుతే ఇప్పడు ఒక ఉత్సవంగా జరుగుతున్నది ఇప్పటి పిల్లలే మమ్మీ నా ఫంక్షన్ హాల్ బుక్ చేయలె అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాల్ల క్లాస్‌మేట్స్‌ను ఫ్రెండ్స్ ఫంక్షన్‌లను చూసెమనాం అట్లానే చెయ్యాలనే ఆలోచనతో ఉన్నరు. అయితే ఈ ఉత్సవం కూడా రాను రాను గమ్మతి అయింది. ఇంకో కత ఏందంటే ఆడపిల్లలకే వేడుకలంటే ఎట్లా మగ పోరగాండ్లకు పంచె దోతి వేడుక జరపాలని కొత్తగ పుట్టించి ఆడోల్లకు చీరకట్టిచ్చుడు అంటే మగాల్ల దొతి కట్టిచ్చుడు పెట్టిండ్రు. ఆడోల్లకంటే శారీరకంగా జరిగే మార్పులాయే. మగ పోరగాంండ్లకు సుత బాగా ఉన్నవాల్లు ఇట్లా చేస్తున్నరు.

అన్నవరం దేవేందర్

Comments

comments