Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

నత్తనడక వీడండి

cm

మూడు షిఫ్ట్‌లలో పని చేసి ప్రాజెక్టులను అతివేగంగా పూర్తి చేయండి

కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల తొలి రోజు పర్యటనలో ప్రాజెక్టుల నిర్మాణ సంస్థలకు సిఎం ఆదేశం

జాప్యంపై ఆగ్రహం

పంప్‌హౌస్‌లు, సుందిళ్ల, తుపాకులగూడెం బ్యారేజీలు, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పనుల క్షేత్రస్థాయి పరిశీలన

హెలికాప్టర్‌లో చుట్టివచ్చిన కెసిఆర్, హరీశ్ రావు

ప్రాజెక్టుల సత్వర పరిపూర్తికే ప్రభుత్వం ప్రాధాన్యం : సిఎం

 హైదరాబాద్/కరీంనగర్/ భూపాలపల్లి/ వరంగల్:  తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించ డానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి  చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, కాలువల నిర్మాణం, ఏక కాలంలో  మూడు షిప్టుల్లో పనులు జరగాలని అధికారులను, వర్క్  ఏజెన్సీలను  సిఎం ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి పనులను పరిశీలించారు. ఉదయం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి  రెండు హెలికాప్టర్లలో బయలుదేరిన ముఖ్యమంత్రి తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్,  సిరిపురం పంప్ హజ్ లను మధ్యహ్నం వరకు సందర్శించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను, వర్క్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం పేర్కొన్నారు. తుపాకుల గూడెం వద్ద గోదావరి వరద ప్రవాహం గురించి అధికారులను అడిగారు.  ప్రస్తుతం 6వేల క్యూ సెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు వివరించారు. 1132 మీటర్ల కాపర్ డ్యాం నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 150 మీటర్లు పూర్తి అయితే మొత్తం కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. పక్క రాష్ట్రాల అధికారులతో పోలీస్ శాఖకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని  డిజిపి మహేందర్‌రెడ్డికి సూచించారు. డ్రోన్ కెమెరాలతో కూడా ప్రాజెక్ట్ ల పనులను పర్యవేక్షిస్తూ భద్రత పరంగా చర్యలు తీసుకుంటున్నట్టు డీ.జి.పి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సిఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్ట్ లు పూర్తి చేయడమే చాలా ముఖ్యమైన కార్యక్రమం అని ఈ విషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ లు గమనంలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సుందిళ్ల బ్యారేజీని, సిరిపురం వద్ద నిర్మిస్తున్న పంప్ హౌజ్ ను, గోలివాడ పంప్ హౌజ్ ను సందర్శించారు. అక్కడ నిర్మాణం పనులను పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. బ్యారేజీల నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం చెప్పారు. గత ఏడాది భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలకు మిడ్ మానేరు డ్యాం వద్ద మట్టి కట్ట కొట్టుకుపోయిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. ఆ చేదు అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను పటిష్టం చేయాలని చెప్పారు. ప్రధాన బ్యారేజీకు కరకట్టలు కలిసే చోటును అత్యంత పటిష్టంగా నిర్మించాలన్నారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు గోదావరికి రెండు వైపులా రవాణా సౌకర్యం అందించేందుకు వీలుగా డబుల్ లేన్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వర్షాలు వచ్చే లోపు పంప్ హజ్ ల నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను కూడా పూర్తి చేయాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు.
గోదావరి ప్రవాహ ఉధృతికి అనుగుణంగా నిర్మాణాలు : 1.63 కిలో మీటర్ల పొడవుతో 16.17 టిఎంసీల సామర్ద్యంతో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ ఎంత వరద వచ్చినా తట్టుకునేలా ఉండాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులన్నింటినీ ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. కన్నెపల్లిలో నిర్మిస్తున్న మేడిగడ్డ పంప్ హజ్ ను లిప్టు సిస్టంను సిఎం పరిశీలించారు. 11 మోటార్లను బిగించి నీటిని ఎత్తిపోసే వ్యవస్థ గురించి అధికారులు వివరించారు. పంప్ హజ్ పనులు ఎండా కాలంలోనే పూర్తయ్యేలా చూడాలని సిఎం చెప్పారు. అనంతరం 1.27 కిలోమీటర్ల మేర 10.87 టిఎంసీల సామర్ద్యంతో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీని సిఎం సందర్శించారు. అనంతరం సిరిపురంలో నిర్మిస్తున్న అన్నారం పంప్ హౌజ్ ను పరిశీలించారు. 1.31 కిలోమీటర్ల పొడవు, 8.83 టిఎంసీల సామర్ద్యంతో నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీని, 9 మోటార్లతో నిర్మిస్తున్న పంప్ హౌజ్ ను సిఎం పరిశీలించారు. బ్యారేజీలు, పంప్ హౌజ్ ల నిర్మాణం జరుపుతూనే అదే సమయంలో అవసరమైన గేట్లను తయారు చేయించి బ్యారేజీ నిర్మాణ స్థలానికి రప్పించాలన్నారు. మోటార్లను కూడా తెప్పించాలన్నారు.
విద్యుత్ శాఖ పనితీరుపట్ల సిఎం సంతృప్తి : రికార్డు స్థాయిలో ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ ను సరఫరా చేయడానికి సకల ఏర్పాట్లు చేసిన విద్యుత్ శాఖను ముఖ్యమంత్రి కేసిఆర్ అభినందించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అనుబంధంగా నిర్మిస్తున్న పంప్ హౌజ్ ల వద్ద నిర్మిస్తున్న సబ్ స్టేషన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు విద్యుత్ శాఖ తరపున చేసిన ఏర్పాట్లను వివరించారు. మేడిగడ్డ పంప్ హౌజ్ నడవడానికి 440 మెగావాట్ల విద్యుత్ అవసరమని నిర్ణయించామని, ఇందుకోసం 220 కే.వి. సబ్ స్టేషన్ నిర్మించామని, 80 కిలోమీటర్ల మేర 220 కే.వి. డబుల్ సర్క్యూట్ లైన్ కొత్తగా వేశామని ప్రభాకర్ రావు చెప్పారు. సబ్ స్టేషన్ తో పాటు ఇతర నిర్మాణాలు పూర్తి కావోచ్చాయని, వచ్చే ఏడాది మార్చిలోగా నూటికి నూరు శాతం పనులు పూర్తవుతాయన్నారు. అన్నారం పంప్ హౌజ్ కు 320 మెగావాట్ల విద్యుత్ అవసరమని నిర్ణయించామని, ఇక్కడ కూడా 220 కే.వి సబ్ స్టేషన్ ను, 28 కిలోమీటర్ల మేర కొత్త డబుల్ సర్క్యూట్ లైన్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. సుందిళ్ల పంప్ హౌజ్ కు 360 మెగావాట్ల విద్యుత్ అవసరమని, ఇందుకోసం 400 కె.వి.సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ నుండి సుందిళ్ల వరకు 400 కె.వి. డబుల్ సర్క్యూట్ లైన్ ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. సుందిళ్లలో నిర్మించే 400 కె.వి. సబ్ స్టేషన్ నుండే మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజ్ లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్ ను సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 2018 మార్చి నాటికి విద్యుత్ శాఖ పనులన్ని పూర్తవుతాయని, ఎత్తిపోతల పథకాల కోసం డెడికేటెడ్ లైన్లు, సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సిఎండి వివరించారు. ఎత్తిపోతల పథకాలకు కావలసిన విద్యుత్ విషయంలో ముందస్తు అంచనాలురూపొందించుకుని పక్కా ప్రణాళికలు అమలు చేయడం వల్ల అనుకున్న సమయంలో పనులు పూర్తవుతున్నాయని సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఎంపిలు పి. వినోద్ కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి సింగ్, డి.జి.పి మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, జెన్కో సి.ఎం.డి. ప్రభాకర్ రావు, నీటిపారుదల శాఖ ఇ.ఎన్.సి. మురళీధర్, సిఇ వెంకటేశ్వర్లు, ఎన్.పి.డి.సి.ఎల్.సిఎండి గోపాల్ రావు, ట్రాన్స్ కో డైరెక్టర్లు జగత్ రెడ్డి, సూర్యప్రకాష్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల పల్లి జిల్లాల కలెక్టర్లు కణ్ణన్, ప్రభాకర్ రెడ్డి, మురళి, ఎల్ అండ్ టి చైర్మన్ సుబ్రమణ్యం, మెగా కంపెనీ ఎండి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments