Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

బరి సరికిసరి

Bjp-Congress

గుజరాత్‌లో బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా..నేనా అనే పోటీ రెండింటికీ సమానంగా 43% ఓట్లు సిఎస్‌డిసి లోక్‌నీతి తాజా సర్వేలో వెల్లడి గత ఎన్నికల్లోని ఓట్ల వ్యత్యాసం మాయమై కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన పరిస్థితి

న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికాంగ్రెస్ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది. పలు అధ్యయన సంస్థల సర్వేలలో ఈ విషయం వెల్లడైంది. పోలింగ్ దశలు సమీపిస్తున్న కొద్దీ రెండు పక్షాల మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు ఆసక్తిదాయకంగా, ఎవరిది గెలుపు ? అనేది ఇప్పటి దశలో తేలనంత స్థాయికి చేరాయి. లోక్‌నీతి నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ వివరాలను వెల్లడించారు. ఇందులో బిజెపి , కాంగ్రెస్‌లకు సమాన స్థాయిలో 43 శాతం ఓట్లు దక్కుతాయని పేర్కొన్నారు. కీలక రాష్ట్రంలో జనం నాడి ఇరు పక్షాల వైపు సరిసమానంగా ఉందని , ఇప్పటి పరిస్థితి ఇదని ఈ సర్వేలో వెల్లడైంది. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో బిజెపి పట్ల ప్రజలలో అసంతృప్తి నెలకొంది. అధికార వ్యతిరేక కమ్ముకుంది. 2౦ సంవత్సరాల ఏకబిగి పాలనపై జనం విసుగెత్తిపోయారు. పెద్ద నోట్ల రద్దు, తరువాత జిఎస్‌టి ప్రభావం, పాటిదార్లు, ఒబిసి, దళిత నేతలు బిజెపియేతర శిబిరంలో చేరడం వంటి పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా అసాధారణ రీతిలో కాంగ్రెస్ ప్రచార శైలి అందరినీ ఆకట్టుకుంటూ రావడం వంటి పరిణామాలు ఉన్నప్పటికీ బిజెపికి చాలా ప్రతికూలత నెలకొన్నప్పటికీ బిజెపి ఓటమి పాలవుతుందని భావించే వారి సంఖ్య తక్కువగానే ఉందని సర్వేలో స్పష్టం అయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ల నాడిలో ఇప్పుడు చెరిసమానపు 43 శాతం ఓట్ల అంశం కీలకంగా మారింది. గుజరాత్‌లో బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ అటా ఇటా అన్నట్లుగా ఫోటో ఫినిష్‌గా మారిందని లోక్‌నీతి బృందం తమ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పురోగతి అద్భుతమే. అయితే ప్రచారం తుది దశలో ఆ పార్టీ ఇప్పుడు పుంజుకున్న వేగాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవడమే సవాలు అని విశ్లేషించారు.
నవంబర్ చివరిలో ఈ సర్వే
లోక్‌నీతి వారు నవంబర్ 23 నవంబర్ 3౦ మధ్యలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. నమూనా అధ్యయనంగా 2౦౦ ప్రాంతాలలో 3655 మందిని కలిసి వారి వైఖరిని కనుగొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బిజెపిలకు సమానంగా చెరి 43 శాతం ఓట్లవాటా దక్కిందని వెల్లడైంది. దశాబ్దాలుగా ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వాటా వ్యత్యాసం దాదాపు 4 శాతం గా ఉంటూ వచ్చింది. అయితే ఈసారి ఈ శాతం దాదాపుగా చెరిగిపోవడం రెండు పార్టీలకు సగటున చూస్తే జనం నాడి సానుకూలంగా ఉండటం కీలకం అయింది.
పార్టీల ప్రతిష్ఠల తరాజు రసవత్తరమే
గత కొద్ది నెలలలో కాంగ్రెస్ ప్రజలలో పుంజుకోవడం, ఇదే సమయంలో బిజెపి పట్ల అసంతృప్తి పెరగడం చోటుచేసుకుంది. ఈ ఏడాది నెలలవారిగా చోటుచేసుకున్న ఈ పరిణామం కూడా ప్రజల నాడికి అద్దం పడుతూ పార్టీల ప్రతిష్టా చిత్రాలను ఆవిష్కరిస్తూ ఆసక్తిని రేకెత్తించిందని సర్వేదార్లు వెల్లడించారు. సిఎస్‌డిఎస్‌లోక్‌నీతి వారు గుజరాత్ పరిణామాలపై కన్నేస్తూ వచ్చి, ఈ ఏడాది ఆగస్టు మొదలుకుని క్రమం తప్పకుండా సర్వేలు చేపట్టారు. ఆగస్టులో ఓట్ల శాతంలో ఇరు పార్టీల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఇందులో తేలింది. అప్పట్లో బిజెపికి 59 శాతం ఓట్ల వాటా, కాంగ్రెస్‌కు కేవలం 29 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం అయింది. అయితే ఆగస్టు నుంచి నవంబర్ మధ్యకాలంలో ఈ ఓట్ల తూకంలో మార్పు చోటుచేసుకుంది. జనం స్పందన ఏ విధంగా ఉందనేది స్పష్టం తేటతెల్లం అయింది. ఈ నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 14 శాతం పెరగడం, బిజెపి 16 శాతం నష్టపోవడం జరిగింది. ఓట్ల శాతం పెరగడం వల్ల కాంగ్రెస్‌కు అదే స్థాయిలో అత్యధిక సీట్లు వచ్చినా రాకున్నా పార్టీ పట్ల పెరిగిన సానుకూలత పార్టీకి భారీ సత్ఫలితమే అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో తిరుగులేకుండా ఉన్న బిజెపి ప్రతిష్టకు గండికొట్టి , ఇక ముందు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో అధికారం ఎవరిది? అనే దశకు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మోడీ పాలనపై అసంతృప్తి పెరుగుదల 

కేంద్రంలో మోడీ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తి ఎప్పుడు ఏ విధంగా మారుతూ వచ్చింది? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరిందనేది సర్వేలో నిర్థిష్టంగా వివరించారు. ఆగస్టులో మోడీ పాలన సంతృప్తికరంగా ఉందని 67 శాతం మంది చెప్పారు. అయితే ఇప్పుడు అది 47 శాతానికి దిగజారింది. అదే విధంగా గుజరాత్ సిఎం విజయ్ రూపానీ ప్రభుత్వ హయాంలో పనితీరు పట్ల అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఆగస్టులో రూపానీ సర్కారు తీరుపై 69 శాతం ఫర్వాలేదన్నారు. అయితే ఇప్పుడు  కేవలం 53 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారని వెల్లడైంది. ఇక బిజెపికి ఆందోళన కల్గించే రీతిలో ప్రతి ఐదుగురు ఓటర్లలో ముగ్గురు అచ్ఛేదిన్ లేనే లేదని తెలిపారు. అక్టోబర్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరు మోడీ అచ్చేదిన్ వాగ్దానం విఫలం అయిందని చెప్పారని, ఇప్పుడు అది 5ః3గా మారిందని విశ్లేషించారు. ఇక మోడీ తరచూ చెపుతూ వస్తున్న వ్యాపార సరళీకృతం, మూడీస్ గ్రేడింగ్ పెరుగుదల , జిఎస్‌టి రాయితీలు వంటి వాటి ప్రభావం సగటు ఓటరులో నాటుకుపోయిన మోడీ పనితీరు అభిప్రాయాన్ని మార్చలేకపొయ్యాయి. ఇండియా బాగుందని  ప్రపంచ బ్యాంక్ చెపుతోందనే ప్రధాని వాదనను అత్యధికులు నమ్మలేదనే విషయం గుజరాత్ ఎన్నికల దశతో స్పష్టం అయింది. ఇక అక్టోబర్ నవంబర్ మధ్యలో జరిపిన ఇతర ఒపినియన్ పోల్స్‌లో ఓటు ఎటు అనేది విభిన్నంగా ఉంది. ఇప్పుడు సర్వే నిర్వహించిన లోక్‌నీతి సర్వేలో రెండు పార్టీల మధ్య నువ్వానేనా ఉంటుందని చెప్పగా,  ఇండియా టుడే, యాక్సిస్ పోల్‌లో పది శాతం ఓట్ల తేడా ఉందని తేల్చారు. బిజెపి 48 శాతంతో ముందంజలో ఉందని విశ్లేషించారు. ఇక టైమ్స్ నౌ విఎంఆర్ సర్వేలో బిజెపికి 52 శాతం ఓట్ల వాటా కాంగ్రెస్‌కు కేవలం 37 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అయితే ఓట్లు, సీట్ల సంఖ్యలో కాంగ్రెస్‌కు గణనీయ పెరుగుదల ఉన్నా అది భారీ సంకేతాలనే ఇస్తుంది. గత వారం సిఎం విజయ్ రూపానీ ఒక సభలో మాట్లాడుతూ ఇంతకు ముందు కన్నా బిజెపి బలం పెరగదని చెప్పారు. అప్పటికన్నా ఒకటి రెండు సీట్లు పెరిగినా అది విచిత్రమే అవుతుందన్నారు.

Comments

comments