Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

లావణ్యపై కారుణ్యం చూపండి

Lavanya

నరాల వ్యాధితో పదేళ్లుగా మంచానికి పరిమితం.
చదువు కోవాలని ఉన్నా కదలలేని పరిస్థితి.
సైకిల్ రిపేరర్‌గా చాలి చాలని తండ్రి సంపాదనే కుటుంబానికి ఆధారం.
ముఖ్యమంత్రి సహయ నిధిని ఉపయోగించలేని దుస్థితి.
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.
మనతెలంగాణ/పెద్దపల్లి: చదువుల్లో సరస్వతి, రూపంలో సౌందర్యవతి అయినా ఆ అభాగ్యురాలు నరాల వ్యాధితో అంపశయ్యపై రోజులు లెక్క పెడుతోంది. రోజులు, నెలలు కాదు ఏకంగా పది సంవత్సరాలుగా మంచానికే పరిమితమైంది లావణ్య. నరాల వ్యాధి లావణ్యకు నరకం చూపిస్తున్నది. దశాబ్ధ కాలంగా మంచానికే పరిమితమైన 27 ఏళ్ల లావణ్య చిన్నతనంలో అందరు ఆడ పిల్లల్లాగే చలాకీగా తిరుగుతూ విద్యలో రాణించింది. సరిగ్గా పది సంవత్సారల క్రితం 2007లో ఇంటర్ చదువుతున్న రోజుల్లో నరాల వ్యాధి సోకింది. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామానికి చెందిన కల్వకోట ప్రభాకర్, జగదీశ్వరీల కుమార్తె అయిన లావణ్య ఇంటర్ చదువుతున్న సమయంలో చదువుపై శ్రద్ధతో కర్రల సాయంతో కళాశాలకు వెళ్లేది. జబ్బు తీవ్రరూపం దాల్చడంతో చదువుపై శ్రద్ధ ఉన్నా నడువలేని స్థితిలో కళాశాలకు వెళ్లడం మానేయాల్సి వచ్చింది.

సైకిల్ రిపేరు దుకాణంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న లావణ్య తండ్రి ప్రభాకర్ చేతికందిన డబ్బుతో కరీంనగర్, వరంగల్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించాడు. అయినప్పటికీ నయంకాకపోవడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌తో పాటు పలు వైద్యశాలల్లో చికిత్స చేయించారు.

అయిన వ్యాధి తీవ్రత తగ్గలేదు. వ్యాధి ప్రారంభ సమయంలోనే ఖరీదైన వైద్యం చేయించి ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేదని, ప్రస్తుతం నరాల ఎదుగుదల పూర్తిగా క్షీణించిందని, కుడికాలు హిప్‌ను మార్చాలని హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యులు తెలిపారు. చికిత్సకు 2 లక్షల 20 వేల వరకు వ్యయం అవుతుందని 2017 జనవరి 14న నిమ్స్ ఆసుపత్రి వర్గాలు ఎస్టిమెట్ సర్టిఫికెట్‌ను అందజేశారు. దాంతో లావణ్య తండ్రి స్థానిక సర్పంచ్ గంట రమేష్ ద్వారా పెద్దపల్లి ఎంఎల్‌ఎను ఆశ్రయించడంతో 2017 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్షా 50 వేల రూపాయలు చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నిమ్స్ ఆసుపత్రి యాజమాన్యానికి కాన్సెంట్ లెటర్ అందజేసింది. చికిత్సకు ఖర్చులతో సహ దాదాపు రూ.3 లక్షల వరకు వ్యయం కానుంది. దాంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి హామీ పొందిన లక్షా 50 వేలతో వైద్య చికిత్స సాధ్యం కాకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేని దుస్థిలో ఆ కుటుంబం ఉంది. సైకిల్ రిపేరర్‌గా చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తనకు, తన కూతురు వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేనని, దాతలు ఎవరైనా దయార్థహృదయులు ముందుకొచ్చి ఆదుకోవాలని లావణ్య తండ్రి ప్రభాకర్ వేడుకొటున్నారు.

దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:  ప్రభాకర్ (బాధితురాలి తండ్రి) ఫోన్ నంబరు.. 9550523486

Comments

comments