Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పరమపదవాసినే శరణమయ్యప్పా…

ayyapa-image

ఏ దేవుడికైనా వివిధ నామాలు ఉంటాయి. వాటినే నామావళి అంటాం. ఇవి ఆ దేవుని వివిధ కోణాలను ఆవిష్కరించేవిగా ఉంటాయి. కనుక ఆ నామాలు చదువుకుంటే ఆ దేవుడు సమగ్రంగా అర్థమవుతాడు. ఇవి షోడశంగాకాని, అష్టోత్తరంగాగానీ, సహస్రంగాకాని ఉంటాయి. షోడశం అంటే 11 నామాలు, అష్టోత్తరం అంటే 108 నామాలు, సహస్రం అంటే వెయ్యి 8 నామాలు. నామాల విస్తృతి ఎంతగా ఉంటే అంతగా ఆ దేవుడి గుణగణాలు, లీలావిశేషాలు, అవతారపరమార్థాలు, అనంత విభూతులు అంతగా ఆవిష్కారమౌతాయి. విషయ విస్తృతి కన్నా అసలు విషయమే ప్రధానం కనుక నామావళి ఏదైనా ఆయన మౌలిక స్వరూపాన్ని, లక్షణాలను క్లుప్తంగా వివరించేవిగా ఉంటాయి. నామాలలో వ్యక్తమయ్యే దేవుని మూర్తి వేదాలు, పురాణాలు వెల్లడించినవై ఉంటాయి. అలాంటి వేదమయమూర్తి అయిన అయ్యప్ప గొప్పతనాన్ని ఒకసారి గమనిద్దాం. అయ్యప్ప నామావళి అంతా శరణుఘోషగా ఉంటుంది. అందుకే దాన్ని శరణుఘోష అని కూడా పిలుస్తారు. అందులో మొట్టమొదటి మంత్రం…

ఓం స్వామియే శరణం అయ్యప్ప. స్వరూప, స్వభావ సంపదలు కలిగినవాడిని స్వామి అని పిలుస్తారు. అయ్యప్పలో ఈ మూడూ ఉన్నాయి. స్వరూపంలో తండ్రి శివుడి పోలిక. ఏమిటి శివుడి పోలిక. దయార్ద్రహృదయుడై ఉండడం, బోళాతనం కలిగిఉండడం. స్వభావంలో కేశవుడి పోలిక. అయ్యప్పకు ఆయనే తల్లి కనుక. తల్లిపోలిక వస్తే పిల్లవాడు అదృష్టవంతుడవుతాడంటారు. ఆ విధంగా అయ్యప్ప అదృష్టవంతుడు కనుకనే శబరిమల మీద ఒక్కడిగా ఉన్నా కోట్లాది భక్తులను ఆకట్టుకోగలుగుతున్నాడు. శివపరివారంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి అత్యంత మహిమాన్వితులు ఉన్నా తనకంటూ విశేషమైన, విశిష్టమైన స్థానాన్ని సాధించుకున్నవాడు కనుకన ఆయన గొప్ప అదృష్టవంతుడిగా కీర్తి అందుకుంటున్నాడు. స్వభావం ఆయన పెంపుడు తల్లి పార్వతీదేవిది. శివయ్య కుటుంబం అనురాగాల పందిరి. పార్వతి తానుగా వినాయకుణ్ణి తయారుచేసుకుంటే శివుడు ఆయనను తన పిల్లవాడిగానే ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. అందుకే మనం శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ అని ఎంతో అభిమానంగా పాడుకుంటున్నాం. శివుడిద్వారా జన్మించినవాడు కాకపోయినా ఆయన శివుడి కుమారుడిగానే ఆరాధ్యుడయ్యాడు. అలాగే అయ్యప్ప పార్వతీసుతుడు కాకపోయినా ఆమె లాలనలో ఆమె లలితగుణ స్వభావాన్నే పుణికి పుచ్చుకుని పరమశాంతుడయ్యాడు. ఈ ముగ్గురి చేతిలో గొప్ప అందగాడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయాన్నే ‘హరిహరసుతవే’ అనే రెండో మంత్రం స్పష్టం చేస్తోంది. అలాంటి ఈ అయ్యప్ప ‘ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు’. ఆయన ‘అన్నదాన ప్రభువు’. శివుడికి అన్నమయ్య అని పేరు. అన్నపూర్ణకు భర్త అయినందుకు, భిక్షమెత్తి లోకాలకు ఇంత అన్నంపెడుతున్నందుకు ఆయనకు ఈ పేరువచ్చింది.

శివుడిలాగే అయ్యప్ప అభిషేకప్రియుడు. విష్ణుమూర్తిలాగా అలంకార ప్రియుడు. శివుడిలాగే అయ్యప్ప పంచామృతాభిషేకాలను ఎంతగానో ఇష్టపడతాడు. శివుడు భస్మాభిషేకాన్ని అమితంగా ఇష్టపడితే, అయ్యప్ప నెయ్యభిషేకాన్ని ఎంతగానో ఇష్టపడతాడు. ఏమిటి నెయ్యి ప్రత్యేకత? పరమపరిశుభ్రత కు, జ్ఞానానికి ఇది ఆటపట్టు. నారాయణుడు జ్ఞానానికి సంకేతమైన పాలకడలిలో పవళిస్తాడు. అయ్యప్ప గుహ్యజ్ఞానప్రియుడు కనుక పాలలోంచి వచ్చే నె య్యితో అభిషేకం కావాలని కోరుకుంటాడు. గుహ్యజ్ఞానాన్ని కోరుకోవడం శివుడిలో కనబడుతుంది. ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిలోనూ కనబడుతుంది. శివుడికే గుహ్యమంత్రాలు ఉపదేశించి కుమారస్వామి గురుగుహ నాథుడయ్యాడు. శివుడికి అన్నాభిషేకమంటే కూడా ఎంతో ఇష్టం. అమ్మానాన్నలిద్దరూ అన్నపూర్ణత్వం కలిగిన వారు కనుక కొడుకు అడిగినవారి లేదనకుండా అన్నంపెట్టి అన్నదానప్రభువవడం సహజమే కదా! ‘కన్నిమాల మహాగణపతియే’ అన్న మంత్రం ఆయనకున్న సోదర ప్రేమను చాటిచెబుతోంది. ‘సద్గురునాథవే’ అన్న మంత్రం సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సూచిస్తోంది. ఈ మొత్తం కథలను మాతాపితగురుదైవమే అన్న మంత్రం సూచిస్తోంది.
అయ్యప్పకు పరిజనులతోనూ ఎంతో సాన్నిహిత్యం ఉందంటోంది ‘నాగరాజువే శరణమయ్యప్పా’ అన్న మంత్రం. ఆయనకు శైవ, వైష్ణవ క్షేత్రాలు రెండూ సొంతిళ్లు. ఒకటి తండ్రి తరఫు ఇల్లయితే రెండోది తల్లి తరఫు ఇల్లు. ‘కాశీవాసియే, హరిద్వార్ వాసియే, శ్రీరంగవాసియే’ తదితర మంత్రాలు ఈ మర్మాన్నే చెబుతున్నాయి.

అయ్యప్ప వీరాధివీరుడు. గొప్ప విలుకాడు. ఆయన మెడలో వేలాడే వీరమణి ఈ విషయాన్నే చెబుతోంది. ధర్మస్వరూపుడు, శరణుఘోషప్రియుడు ఈ మోహిని కుమారుడు. విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తినపుడు శివుడితో సహా దేవ, రాక్షస గణాలన్నీ ఆయన అందంచూసి దిమ్మెత్తిపోయాయి. నారాయణుడు సర్వసమ్మోహనాకారుడు. కనుక ఆయన మోహినిగా ఉన్నా, మోహనరూపుడిగా ఉన్నా ఆ అందం అద్వితీయం. రామావతారంలో ఉన్నప్పుడు ఆయనను చూసి మునులు సైతం మోహించిపోయారు. ఆయన కుమారుడు కనుక అయ్యప్ప కూడా సర్వసమ్మోహనాకారుడే అయ్యాడు. పైగా చిన్నపిల్లలు ఎలాగూ అందంగానే ఉం టారు కదా! ఆయన కలియుగ వరదుడు కనుక కోట్ల సంఖ్యలో భక్తులు దీక్షవహించి ఆయన కొండకు పరుగులు తీస్తున్నారు. ఆయన అపర ధన్వంతరి. అసలు ధన్వంతరి పాలసముద్రం చిలికినపుడు జన్మించాడు. పాలసముద్రం ఎవరిది? లక్ష్మీదేవిది. లక్ష్మీదేవి ఎవరు? నారాయణుని అర్థాంగి. చంద్రుడిలాగే ధన్వంతరి కూడా విష్ణువుకు అతి సమీప బంధువు. ఈ ధన్వంతరి దేవవైద్యుడు. అయ్యప్పకు కూడా ఆ ఇంటి లక్షణమే అబ్బింది. అందుకే సర్వరోగ నివారకుడిగా సామాన్యభక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ విషయాన్ని చెప్పడానికే నా మావళి ఆయనను ‘సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే’ అని కీర్తించింది. అయ్యప్ప, పార్వతీదేవి కూడా మహిషాసురుల్ని విభిన్నకాలాలలో సంహరించారు. ఇద్దరూ పెద్దపులి మీద ఊరేగుతారు. శబరితో నారాయణుడికి, అయ్యప్పకు కూడా సంబంధాలున్నాయి. అయ్యప్ప నివాసమున్న కొండను శబరిగిరి అని ఆయనను శబరిగిరీశుడనీ అన్నారు. అయ్యప్ప ఇరుముడి ప్రియుడు. ఈ ఇరుముడులేమిటి? కలిమిలేము లు, కష్టసుఖాల వంటివాటిని ఈ ఇరుముడులు సూచిస్తాయి. పురాణాలు చెప్పే సుఖదు:ఖాది ద్వంద్వాలకు ఇవి గుర్తులు. ఈజ న్మ గతజన్మలను కూడా ఇవి సూచిస్తాయి.పార్వతికి సర్వమంగళ అనే పే రుంది. ఆమె మన్ననలలో పెరిగిన అయ్యప్ప కూడా సర్వమంగళదాయకుడయ్యాడు. ఆయన ఓంకారస్వరూపుడు. వేదస్వరూపుడు. వేద, వేదాంత ప్రియు డు.ఓంకారం బ్రహ్మను సూచిస్తుంది. నారాయణుడు వేదమయుడు.

బ్రహ్మ నిరంతర వేదవిద్యార్థి. అంటే ఆయన తదేక ధ్యానంతో నారాయణుని అధ్యయనం చే స్తుంటాడు. తానే సమ స్తం కావడం, తనని తానే అధ్యయనం చేయడం, అభిమానించుకోవడం గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు అయ్యప్ప. ఆయన ఆనందస్వరూపుడు. ఆనందం ఎవరికైనా మనసులో ఉంటుంది. కనుక అయ్యప్ప కూడా మనసులో ఉంటాడు. మనసులో ఉండడం శివ, కేశవులిద్దరికీ సమాన లక్షణం. అందుకే రాముడు ఆత్మారాముడయ్యాడు. లింగస్వరూపుడైన శివుడు ఆత్మలింగంగా భక్తులలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించాడు. అయ్యప్పకు కూడా అవే లక్షణాలు రావడంవల్ల ఆయనను మనం భక్తచిత్తధివాసినే అని పిలుస్తున్నాం. ఆశ్రితవత్సలత్వం నారాయణుడిలో ఎక్కువ. భూతగణాధిపత్యం శివునిలో కనిపించే విలక్షణ లక్షణం. ఈ రెండూ కలిగినవాడు అయ్యప్ప. ఆయన శక్తి స్వరూపుడు. శక్తి అంటే శరీరంలో ఉండే శక్తేకాదు పరాశక్తి..అంటే మానవాతీత శక్తి కూడా ఆయనే! అంతేకాదు శక్తి అనేది పార్వతిపేరు. ఈ కోణం నుంచి చూసినపుడు ఆయన పార్వతిలాగా ఉండేవాడు. పార్వతి ఏం చేస్తుంది? అభిమానంగా లోకాలను లాలిస్తుంది. కోపం తెప్పించేంత తప్పుచేస్తే ఉరుముతుంది. అయ్యప్ప కూడా అలాంటివాడే! సాధారణంగా స్వతహాగా శాంతమూర్తే అయినా మహిషుడిలాంటి వాడు కనిపించి లోకాలను కల్లోలపరుస్తుంటే శాంతంగా చూస్తూ ఉండలేడు. రుషులను రక్షించాల్సివచ్చినపుడు ఆయన ఆగ్రహశక్తి ప్రదర్శిస్తాడు.

నిగ్రహానుగ్రహశక్తి కలిగినవాడు కనుకనే ఈ మాధవసుతుడు ఉత్తమపురుషుడై మనందరిచేత పూజలందుకుంటున్నాడు. ఈయన 18 మెట్లు ఎక్కి వచ్చే వారికి తన సన్నిధానాన్నిచ్చి అనుగ్రహిస్తాడు. ఈ పద్దెనిమిది మెట్లు పరమపదసోపానాలు. అంటే పరమపదానికి పద్దెనిమిదిమెట్లన్నమాట. స్వామి ఉండే శబరిమలే పరమపదం. 18మెట్లు దశేంద్రియాలకు, పంచ (భూత) తత్త్వాలకు, త్రిగుణాలకు సంకేతాలు. దశేంద్రియాలలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వీటిలో మనం కదులుతూ పనిచేయడానికి ఉపకరించేవి కర్మేంద్రియాలు. ఇవి భౌతికమైనవి. జ్ఞానేంద్రియాలు 5. ఇవి కంటికి కనిపించేవికావు. కానీ ఇవన్నీ అనుభవంలో ఉంటాయి. కన్నుచూసే కాంతి, ముక్కు తెలుసుకునే వాసన, చెవి తెలుసుకునే ధ్వని, చర్మానికి తెలిసే స్పర్శ, నోటికి తెలిసే రుచిలాంటివి. వీటికి ఆకారాలు ఉండవు. కానీ ఉనికి ఉంటుంది. పంచభూతాలు అంటే భూమి, వాయువు, అగ్ని, వాయువు, ఆకాశం. మన కాలునిలదొక్కుకుని ఉండడానికి ఉపకరించేది భూమి. మనం నిత్యవసరాలకు అత్యవసరంగా కావాల్సింది నీరు. బతకడానికి అవసరమయ్యేది గాలి. కంటికి కాంతినివ్వడానికి, య్ఞయాగాలు చేసుకోడానికి, వంటకు ఉపకరించేది అగ్ని. అవకాశాలు అనంతాలని చెప్పి అభివృద్ధికి మానసికంగా ప్రోత్సహించేది ఆకాశం. అనేక గ్రహాలకు, నక్షత్రాలకు ఆటపట్టయిన ఈ ఆకాశం మనకు పనిచేసుకోడానికి పగటిని, విశ్రాంతి తీసుకోడానికి రాత్రిని అనుగ్రహిస్తోంది. భూతత్వాన్ని, అగ్నితత్త్వాన్ని, వాయుతత్త్వాన్ని, ఆకాశతత్త్వాన్ని ఛేదించుకుని వెళ్తే వచ్చేదే పరమపదం. ఆ పరమపదం అయ్యప్పది. అత్యున్నతమైన ఆ స్థానానికి చేరుకున్న వాడికి జరామృత్యుభయాలు ఉండవు. మరోసారి పుడతామన్న బాధా ఉండదు. ఆయనలో ఐక్యమై పరమశాంతిని, పరమానందాన్ని పొందుతాం.

Comments

comments