Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

కోచింగ్‌సెంటర్‌ను ఎలా ఎంచుకోవాలి

life

ప్రపంచంలో నానాటికీ పోటీ ముదిరిపోతోంది. ఏ పనిచేయాలన్నా ఎంతో గ్రౌండ్ వర్‌చేయాల్సి వస్తోంది. పిల్లలకు అనుభవం, ఒక గైడెన్సీ ఉండకపోవడం వల్ల వారు కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడుతుంటారు. మంచి కోచింగ్ దొరికే సెంటర్ దొరికితే పండగే కానీ బోగస్ సంస్థలో చేరితే డబ్బు, టైమూ దండగ అవుతాయి. ఇలాంటి దురనుభవం ఎదురైతే పిల్లలు తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఇనిస్టిట్యూట్‌ను ఎంచుకునేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకున్నా ఉద్యోగం దొరకక అల్లాడిపోయే పరిస్థితి. ఈ సమయంలో కోచింగ్ సెంటర్ల చేతిలో మోసపోవాల్సివస్తే పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతుంది. ఈ మధ్యకాలంలో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలతో అభ్యర్థులను వలలో వేసుకోవడానికి ఎరవేస్తున్నాయి. వ్యాపార ఎత్తుగడలు రచిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉద్యోగనియామకాలు లేకపోవడంతో వయోపరిమితి దాటినవారికి ప్రభుత్వం కొంతసడలింపు ఇచ్చింది. దాంతో అర్హతగల వయసులో జారిపోయిన అవకాశాన్ని దక్కించుకోడానికి మరో ఛాన్స్ దొరకడంతో ఏజ్‌బార్ అభ్యర్థులు కూడా ముందుకు దూకుతున్నారు. ఉద్యోగనియామకాల నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఎలాగైన ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకునే ప్రయత్నం అభ్యర్థుల్లో తీవ్రమవుతోంది. వీళ్ళ ఆదుర్దాను అవకాశంగా తీసుకుని కోచింగ్ సెంటర్లు కోట్లరూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ప్యాకల్టీ మా దగ్గర బాగుందంటే మా దగ్గర బాగుందని అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ స్థితిలో కన్‌ఫ్యూజ్ అయిపోకుండా ఎలాంటి కోచింగ్ సెంటర్లను ఎన్నుకోవాలి, సిలబస్ ఎలా అర్థం చేసుకోవాలనే అంశాలపై ప్రముఖవిద్యావేత్త, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ….

ప్ర: ఈ దేశంలో ఒక దశలో మన యువత ప్రభుత్వ ఉద్యోగాలంటే ఆసక్తి చూపని పరిస్థితి ఉండేది. కార్పొరేట్ ఉద్యోగాలకోసం, ఎంఎన్‌సి ఉద్యోగం కోసం అర్రులు చాచిన పరిస్థితిని చూశాం. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలకే మళ్ళుతున్న వాతావరణాన్ని చూస్తున్నాం. సడన్‌గా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరగడానికి కారణమేమిటి?
జ: గతంలో కేవలం పోలీసు, టీచర్ల ఉద్యోగాలనియామకాలు కొంతమేరకు జరిగాయి. మిగతా ఉద్యోగాల నియామకాల వైపు ఆనాటి ప్రభుత్వం చూడలేదు. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ఏర్పడగానే నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అలాగే వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో నిరుద్యోగుల్లో పోటీ పెరిగింది. ప్రభుత్వం ఇప్పటివరకు 34 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 24 వేల ఉద్యోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఉద్యోగాలను దక్కించుకోవాలని కొందరూ, కొత్తనియామకాల్లో అవకాశాలు రావాలని కొందరూ పొటీకి సిద్ధమై కోచింగ్ సెంటర్లకు వెళ్ళుతున్నారు. అయితే కోచింగ్ సెంటర్ ఎలా ఉండాలి? ఫ్యాకల్టీని ఎలా ఎంపిక చేసుకోవాలనే అలోచనలకు అభ్యర్థులు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే నోటిఫికేషన్ ను సమగ్రంగా చదివి సిలబస్ అర్థం చేసుకోవాలి.

ప్ర: సిలబస్ ను ఏమేరకు అభ్యర్థులు పరిశీలించాలి
జ: నోటిఫికేషన్‌ను సమగ్రంగా చదివితే అందులోనే పోటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్‌లో తెలియని అంశాలపైనే కోచింగ్ తీసుకుని మిగతావాటిని స్వంతగా చదువుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆతృతతో దొరికిన పుస్తకం దొరికినట్లు చదవడంకాదు. కోచింగ్‌లో అన్ని అంశాలపై నోట్స్ రాసుకునేప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పాఠ్యాంశాలపై అభ్యర్థి పట్టు సాధించే విధంగా ఉండాలి. మెటీరియల్ సొంతగా సమకూర్చుకునే ఆలోచన లో ఉండాలి. అంతేకానీ ప్రకటనల బుట్టలో పడకూడదు.

ప్ర: ఫ్యాకల్టీ సత్తా గుర్తించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ: కొన్ని కోచింగ్ సెంటర్లలో ప్రఖ్యాతి చెందిన ప్యాకల్టీతో గెస్టు లెక్చర్స్ ఇప్పిస్తామనీ, వారితో తరగతులు చెప్పిస్తామని అడ్వర్టయిజ్ చేస్తుంటారు. అయితే గెస్టు లెక్చర్స్ ఉంటే వినాల్సిందే..అయితే రెగ్యులర్ స్టాఫ్‌లో సరుకున్నవాళ్ళెవరో చూసుకోవాలి. ఎందుకంటే వీరే అభ్యర్థులకు నిరంతరం అందుబాటులో ఉండాలి. కనుక ఈ ప్యాకల్టీ విషయంలోనే జాగ్రత్తగా జడ్జ్ చేసుకోవాలి. కోచింగ్ సెంటర్ల చరిత్ర, గతంలో అవి సాధించిన విజయాలు. పూర్వవిద్యార్థులు సాధించిన మార్కులు వగైరాలను కొత్తగా చేరాలనుకునే అభ్యర్థి కచ్చితంగా పరిశీలించాలి. ప్రతి విద్యార్థికి సుమారు 60శాతం వరకు సొంతగా తెలిసిన అంశాలు ఉంటాయి. మిగతా 40 శాతం కోసం చేసే ప్రయత్నమే ముఖ్యమైంది. తెలంగాణ వ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల వ్యాపారం ఉధృతంగా సాగుతోంది. ఎక్కడికక్కడ కోచింగ్ సెంటర్లు వెలిసాయి. ఈ నేపధ్యంలో తెలియని పాఠ్యాంశాలు బోధించే సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? అందులో ఫ్యాకల్టీ ఎలాఉంది? వంటి వివరాలు సేకరించిన అనంతరమే అభ్యర్థి ఫీజుకట్టాలి. అయితే ఫీజు మెుత్తం ఒకేసారిచెల్లించవద్దు. నచ్చకపోతే వెళ్ళి వేరే కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ పొందేందుకు వీలుగా, సిద్ధంగా ఉండాలి.

ప్ర: అభ్యర్థులు ఏ అంశాలపై దృష్టి సారించాలి?
జ: ఉద్యోగాల వేటలో ఉన్న విద్యావంతులు మెుదట స్పష్టమైన లక్ష్యం ఎంచుకోవాలి. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంచెనా వేయాలి. ఎవరి ఒత్తిడికి లొంగకూడదు. స్వంత నిర్ణయాలకు, విద్యకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత నిర్ణయించుకున్న ఉద్యోగానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ సమగ్రంగా అధ్యయనంచేసి రానిఅంశాలపై పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. ఇందుకు సాయపడగల నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉన్న కోచింగ్ సెంటర్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ప్రణాళికను రూపొందించుకుని చదివితే విజయం సాధించవచ్చు. పోటీ ప్రపంచంలో ఎవరు ఎవరికంటే గొప్పకాదు,నీ పరిజ్ఞానంపై అపోహవద్దు. ఉన్నజ్ఞానాన్ని సరైన మార్గంలో మలుచు కుంటే విజయం వరిస్తుంది. వేలాది సంవత్సరాల భారతీయ విజ్ఞానానికి వారసులు అవుతారు.

Comments

comments