Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

చిటుక్కున మరిచిపోతే చటుక్కున గుర్తుకురాదు

life2

మరుపును అధిగమించేదెలా?

విజయమే జీవితానికి అంతిమ గమ్యంకాదు. దాన్ని సాధిం చగానే విర్రవీగిపోకూడదు. వైఫల్యం పతనానికి పరాకాష్టకాదు. జీవితం అక్కడికే ఆగిపోదు. దేన్నయినా ఎదుర్కోగల ధీరచిత్తం ఉన్నవాడే జీవితంలో దేన్నయినా సాధించగలుగుతాడు. సముద్రంలో పైకెగిరే ప్రతి అలా కిందపడుతుంది. అలా అని సముద్రం ఎగరడం మానేయదు. అలాగే ముందుకురికిన ప్రతి అలా వెనక్కి జారిపోతుంది. అలా అని అది సముద్రంలోనే ఉండిపోదు. మరింత ఫోర్స్‌తో, రెట్టించిన ఉత్సాహంతో ముందుకురికివస్తుంది. ఒడ్డున ఉన్న బండరాళ్ళను ఢీకొంటుంది. ఆటుపోట్లు జీవితంలో మామూలే! అన్నిటికీ ధైర్యమే కావాలి. దైన్యంతో సాధించగలిగేది ఏదీ ఉండదు. 

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ మరిచిపోతున్నామని వాపోతున్నారు. దీనికి వయసుతో సంబంధంలేదు. అందరిలోనూ మరుపు ఇబ్బందికరంగా తయారవుతోంది. ఒకనాడు బాగా పరిచయం ఉండి తర్వాతి రోజులకు కనబడకుండా పోయినవాణ్ణి ప్రయత్నపూర్వకంగా గుర్తుచేసుకోడానికి వీలవుతుంది. మరి తక్కువ పరిచయంలో ఉన్న వారు గుర్తుండే అవకాశం ఎటూలేదు. అలాంటి వాటి విషయంలో ఎవ్వరూ బాధపడరు కూడా! కానీ ఇప్పుడేచూసి అప్పుడే మరిచిపోయినపుడు, ఇప్పుడే విని అప్పుడే మరిచిపోయినపుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకప్పుడు మంచి మెమొరీపవర్ ఉండి ఇప్పుడు అదిలేకుండా పోయినా, బాగా తగ్గిపోయినా వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. పబ్లిక్ ఫిగర్‌కు ఎంతో మందిని గుర్తుంచుకోవడం సాధ్యం కాదు కనుక వారికి మన్నింపు ఉంటుంది. ఒక టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకున్నవారు వందలలో ఉంటారు. ఆయన అందరి పేర్లూ గుర్తుపెట్టుకోడం సాధ్యంకాదు. కానీ ఒక స్టూడెంట్‌కి లిమిటెడ్ సంఖ్యలోనే టీచర్లు ఉంటారు కనుక వారు గుర్తుంచుకోలేకపోతే దాన్ని మరుపు సంబంధమైన ఇబ్బందిగానే గుర్తించాలి. కొందరికి ఒకసారి చూసినా, చదివినా, విన్నా అలా గుర్తుండిపోతుంది. మరికొందరికి ఎన్నిసార్లు చదివినా, విన్నా గుర్తుకురాదు. ఎందుకిలా? చూడడంలో తేడా ఉందా? అబ్జర్వేషన్‌లో తేడా ఉందా? అంటే అబ్జర్వేషనే అని చెప్పాలి. అబ్జర్వేషన్‌లో తేడాకు మొదటికారణం ఆసక్తి. ఇష్టంలేని విషయాన్ని గుర్తుపెట్టుకోడానికి ఎవ్వరికీ మనసురాదు. కనుక అది బుర్రకెక్కదు. రెండో కారణం శ్రద్ధ. కొందరికి ఏది కనిపించినా శ్రద్ధగా గమనించడం ఒక హాబిట్. మరికొందరికి ఈ లక్షణం ఉండదు. అన్నీ కాజువల్‌గానే తీసుకుంటారు. ఆ పట్టింపు లేనితనం వల్లే ఏదీ గుర్తుంచుకోలేరు. మెదడుకు జ్ఞాపకశక్తిలేక కాదు. ఆసక్తి, శ్రద్ధవంటి లక్షణాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ రెండు లక్షణాలు ఉంటే విషయాలు అవే గుర్తుంటాయి. తెలుసుకోవాలనే కోరిక, దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలనే కోరిక ఉంటే చదువుకు సంబంధించిన విషయాలు గుర్తుంటాయి. ఎవరైనా ఏ విషయాన్నయినా బాగా గుర్తుంచుకోడానికి సైకాలజిస్టులు కొన్ని క్లూస్ చెప్పారు. దీనికి వీరు విషయ సమన్వయ క్రియ అన్నారు. మనసులో చేసుకోవాల్సిన ఈ ప్రక్రియను ఆరుభాగాలుగా విభజించారు.
పోలిక, వ్యతిరేకత, సాన్నిహిత్యం, తరచుగా జరగడం, ఇటీవల జరగడం, వైవిధ్యం
పోలిక : సాయంత్రం పూట కాఫీ తాగాలన్న ఆలోచన వస్తుంది. పొగలు చిమ్మే కాఫీని ఊహిస్తావు. దాని రుచి, పరిమళం నీ మనసులో ముద్రించుకుంటావు. మరునాడు ఉదయం కాఫీ తాగకున్నా సాయంత్రం కాఫీ తాగే సమయానికి మనసులో ప్రత్యక్షమవుతుంది. రెండు పదాలు, లేక రెండు అనుభవాలు సమానార్థకాలు అయివుంటే వాటి మధ్య కామన్ పాయింట్‌ను గుర్తించి ఒక దగ్గర చేర్చుకుంటాం. వాటికి కారణాల్ని అన్వేషించుకుంటాం. ఒక దాన్ని గుర్తు చేసుకుంటే వెంటనే యింకొకటి కూడా గుర్తుకువస్తుంది. అలాగే ఒకే రకమయిన శబ్దాలున్న పదాలు కూడా గుర్తుంటాయి. ఇక్కడ పదాల మధ్య సమాన ధర్మం లేకున్నా శబ్దమే సమానధర్మంగా పనిచేస్తుంది. అందుకని అవి గుర్తుంటాయి. ఉదాహరణకి పువ్వు, నువ్వు, తోట, వేట, కాయ, ఛాయ. వీటి మధ్య శబ్ద సామ్యమే తప్ప అర్థ సామ్యం లేదు. ఐనా ఒక మానసిక ఆవిష్కరణకు ఆస్కారమిస్తాయి. అవి ఎప్పుడు కావాలనుకుంటే అవి అప్పుడే గుర్తుకురావడానికి సిద్ధంగా ఉంటాయి.
వ్యతిరేకత : సమానమైన, అర్థాలు, శబ్దాలు ఉన్న పదాలు ఎలా గుర్తు ఉంటాయో అలాగే వ్యతిరేకమయిన లక్షణాలున్న పదాలు కూడా గుర్తుంటాయి. వ్యతిరేకతలున్న పదాలు బొమ్మా బొరుసులాంటివి. తెలుపు, నలుపు, కింద, పైన, వేడి, చలువ, చీకటి, వెలుగు మొదలైనవి. ఇవి ఒక దాన్ని ఒకటి అనుసరిస్తాయి. ఒకటి గుర్తొస్తే యింకొకటి రంగంలోకి వస్తుంది. సామ్య సూత్రం లాగే వ్యతిరేక సూత్రం కూడా మనసులో పనిచేస్తుంది.
సాన్నిహిత్యం : ఇప్పుడు కలిసి వుండడానికి సంబంధించిన సూత్రం. ఇది మంచీ చెడ్డా తెలిసిన వాళ్ళ ప్రవర్తనకు సంబంధించిన విషయం. రెండు విభిన్న అభిప్రాయాలతో, విభిన్న అనుభవాలతో ఉన్న అంశాలు కూడా ఒక దాని వెంట మరొకటిగా సిద్ధంగా వుంటాయి. జీవితానికి సంబంధించిన చారిత్రక సన్నివేశాల సమ్మేళనమిది.
తరచుగా జరగటం : తరచుగా సంభవించే దాన్ని అధారం చేసుకున్న సూత్రం ఇది. పేర్లు, నెంబర్లు తరచు చెబుతూ వుంటే మెదడులో రిపీటై ఎప్పుడూ అందుబాటులో వుంటాయి. పాతభావాలు, గతానికి చెందిన అనుభవాలు క్రమంగా కనుమరుగయితే వాటి స్థానంలో కొత్త అభిప్రాయాలు, ప్రేరణలు రంగంలోకి వస్తాయి. అవసరమయినప్పుడు పాతవాటి కన్నా అవి ముందుకు రావడానికి సిద్ధంగా వుంటాయి.
వైవిధ్య సూత్రం : మనని ప్రతీరోజూ భిన్నవిభిన్నమైన అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల రకరకాల ప్రేరణలకు లోనవుతాం. ఏది బలంగా మనల్ని ప్రభావితం చేస్తుందో అది శక్తివంతంగా వుంటుంది. అది మన అభిప్రాయాల్ని కూడా బలోపేతం చేస్తుంది. ఏదయినా వస్తువును, పేరును గుర్తుచేసుకుంటే వాటితో బాటు ఆ వస్తువుతో, వ్యక్తితో ఉన్న సాన్నిహిత్యం కూడా గుర్తుకు వస్తుంది. అవన్నీ మధుర జ్ఞాపకాలుగానో, చెడు అనుభవాలుగానో వల్లెవేసుకోడానికి అవుతుంది. అందుకే ఏ ఇద్దరు ఎదురుపడినా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం కనిపిస్తుంది.
ఊహలకు రెక్కలొస్తే…కదిలే వస్తువులు మనిషి వూహని మరింత విసృ్తతం చేస్తుంది. అందుకనే టీవీ ప్రింట్ మీడియాని డామినేట్ చేసింది. కదలిక ఎంత ఆకర్షణీయంగా ఉంటే, ఎంత ప్రతిభావంతంగా ఉంటే అంత ప్రభావ భరితంగా ఉంటుంది. అందుకే నాటకాన్ని సినిమా డామినేట్ చేసింది. చలనం ఏకాగ్రతని ఆకర్షిస్తుంది. గతంలో కళ్ళుమూసుకుని తపసుచేసుకునే రుషులను రంభాది దేవకాంతల నాట్యాలు చెదరగొట్టేవి. వీళ్ళ నాట్యాలే వారి మనసులో ముద్రవేసుకునేవి. విసృ్తతమైన వూహాశక్తిని చలనంతో మేళవిస్తే జ్ఞాపకశక్తి విస్తరిస్తుంది. ఈ ప్రాథమిక సూత్రాల్ని అధ్యయనం చెయ్యడం ద్వారా ఆసక్తిని అభివృద్ధి పరచుకోవడం ద్వారా జ్ఞాపక శక్తిని ఎదిగేలా చెయ్యవచ్చు. ఏ సూత్రమూ దానికది శక్తివంతమైంది కాదు. ఇతరమైన వాటితో సమ్మేళనం చెందడం ద్వారా అవి బలాన్ని పుంజుకుంటాయి. వీటన్నిటినీ సాధించాలంటే మొదట నీకు లక్ష్యం వుండాలి. సంకల్పం వుండాలి. వాటిని ఆచరణలో పెట్టాలి.ఇవంటే ఎలాగో ఒకలాగ పడగలుగుతాం. కానీ పేర్లని, ముఖాల్ని, వస్తువుల్ని గుర్తు తెచ్చుకోవడం ఎలా? ఇదో పెద్ద జంజాటంగా తయారవుతోంది. ఈ విషయంలో తడబడనివారు ఉండడంలేదు. మనిషిని చూసినపుడు ఆ నిమిషానికి ఏదో ఒక కొండగుర్తును వెతుక్కున్నా ఆ కాసేపటికే అది మనసులోంచి ఎరేజ్ అయిపోతోంది. దాంతో విషయం మళ్ళా మొదటికొస్తోంది. పేర్లని, ముఖాల్ని చాలా కాలం గుర్తుంచుకోవాలంటే వాటికి సంబంధించి మానసిక చిత్రం, సమన్వయం అవసరం. ఉదాహరణకి ‘హరి’ అనే వ్యక్తిని కలుసామనుకుందాం. హరికి వెక్కిరింతగా వాడుకునే పదం ఏమిటి? గిరి..అది గుర్తుండాలి. అతగాడిని చూసినపుడు దృష్టిని ఆకర్షించిన అంశాలేమిటి? ఒత్తుగా ఉన్న జుట్టా? ‘పొడవుగా వున్న గడ్డమా? అతని చేతులపై గుబురుగా వున్న వెంట్రుకలా? ఇలాంటివేవో కొండగుర్తుగా మనసులో ఆవిష్కరించుకోండి!
హరిని గురించి ప్రస్తావన వచ్చినపుడెల్లా ఈ కొండగుర్తులు గుర్తుకువస్తాయి. కనుక వెంటనే ఆయన బొమ్మ మన కళ్ళముందు కదలాడుతుంది. దాంతోపాటే ఆయనతో మాట్లాడిన సందర్భాలు, మాటలు అన్నీ గుర్తుకువస్తాయి. అంతంత మాత్రపు పరిచయాలున్న వ్యక్తుల్ని గుర్తుంచుకోవాలంటే ఆ ఎకర్‌సైజ్ మరో రకంగా ఉంటుంది. ఒకవ్యక్తి గురించి విని వుంటాం. కానీ అతణ్ణి ఎప్పుడూ కలవలేదు. అలాంటివాడు ఎదురుపడినా గుర్తుపట్టలేం. తన గురించి చెప్పుకుంటే మాత్రం ఎప్పటి నుంచో తెలిసినవాడితో మాట్లాడినంత చనువుగా మాట్లాడతాం. దీనికి కారణం ఆ వ్యక్తిని ఎప్పుడూ చూడకపోయినా వారికి సంబంధించిన వివరాలు మన మనసులో, మెదడులో రికార్డయి ఉండడమే! ఒకసారి వారిని చూస్తే సాధారణంగా మరిచిపోవడమంటూ ఉండదు. అంతవరకు వారికి సంబంధించిన ఆడియో మాత్రమే మీ జ్ఞాపకాలలో ఉంది. తొలిసారి వారిని చూశాక బొమ్మకూడా జతపడింది కనుక బొమ్మ, ధ్వని, అంతకు ముందే ఫీడైన డేటా అన్నీ సమన్వయపడి మనకు ఒక స్పష్టమైన మూర్తి కళ్ళకు కడుతుంది. దీనికితోడు ఆయనతో చేయికలిపితే కరస్పర్శ, వస్త్రధారణ కూడా జాపకానికి జతపడుతుంది. వ్యక్తులలోని తారతమ్యాల్ని, ఒడ్డుపొడవుల్ని గుర్తుపెట్టుకోగలిగితే అది జ్ఞాపకాన్ని మరింత పెంచుతుంది. అంటే నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. బొంగురు గొంతు లేదా కంగుమనే గొంతు. హుషారు లేదా డల్ వంటి లక్షణాలను జోడించుకుంటే అనేకమందిని ఏ ఇబ్బందిలేకుండా గుర్తుపెట్టుకోడానికి వీలవుతుంది. అప్పుడు మన అనుభవం మరింత అర్థవంతంగా వుంటుంది. యితరులకు లేని జాగ్రత్త మనకుంటుంది. ఆ విధంగా ఆకారాల్ని, స్వరాల్ని పరిశీలించడం, గర్తుంచుకోవడం అభ్యాసం చేస్తే అనేక సమస్యలు తప్పుతాయి.

Comments

comments