Search
Tuesday 19 June 2018
  • :
  • :

టైము చెప్పిన నగారా

Harivillu-image

సింగినాథానికి తాళవాయిద్యాలంటే వల్లమాలిన మోజు. మృదంగం, తబలా, డోలు, డప్పు రాత్రింబవళ్లు వాయిస్తూనే ఉంటాడు. అలా అని అతడు ఈ వాయిద్యాలు వాయించడంలో నిపుణుడని అనుకున్నారో డప్పులో కాలేసినట్లే.. ఆ మోజు అతడికి వినోదం అయితే ఇరుగుపొరుగు వాళ్లకు విషాదం. పగలల్లా శ్రమించి నిద్రాదేవి ఒడిలో ఓలలాడుతున్న వాళ్లకు శయనభంగం. పిల్లలకు విద్యాభంగం కలిగేది. వాళ్లంతా సింగినాథం, నీ బాదుడు వల్ల మేం నిద్రపోలేకపోతున్నాం. పిల్లలు చదువుకోలేక పోతున్నారు. అందువల్ల ఈ అలవాటు మానుకో అని వార్నింగ్ ఇచ్చారు. సింగినాథం మానలేను అని అనగానే వెంటనే అక్కడున్న ఓ మొరటు మనిషి అలా అయితే నిన్ను వాయించేస్తాంఅన్నాడు. మరో మనిషి సరే సాయంత్రం ఆరు నుంచి పగలు పది దాకా వాయించుకో అన్నాడు. ఎదురు మాట్లాడితే మర్యాద కాదుగదా ప్రాణమే దక్కదని తలాడించాడు సింగినాథం. సింగినాథం భార్యాపిల్లలు ఇంటికి వెనుక భాగంలో ఉంటున్నారు వాయిద్యాల ధ్వనికి దూరంగా. భోజనానికి, టిఫిన్లకు ఇంటి వెనుక భాగంలోకి వెళ్తుంటాడు సింగినాథం. తరచు రాత్రికూడా తన వాయిద్యాల మధ్యే నిద్రపోతాడు. అతడికి సంపాదించే అవసరం లేదు. పూర్వీకులు వెనకేసిన బోలెడంత సంపద ఉంది. కాలేజీలో ఉన్నప్పుడే మద్దెల, డోలు, మృదంగం పట్ల వ్యామోహం పుట్టి అది తాళవాయిద్యాలన్నింటికీ వ్యాపించింది. సింగినాథం మాత్రం జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ గానే ఉండిపోయాడు.

ఓ రోజు సింగినాథం బాల్యమిత్రుడు సాలెపట్టులోకి ఎర్రపురుగు వచ్చినట్లు సింగినాథం ఇంటికి వచ్చాడు. పేరు గణపతి. న్యాయవాది. ఒకసారి హఠాత్తుగా పట్నంలో ఇద్దరూ కలిసారు. చిన్ననాటి జ్ఞాపకాలు ముచ్చటించుకుంటూ మాట్లాడుకున్నారు. అప్పుడు సింగినాథం ఏరా, గణపతీ మా ఇంటికి రారాదూ. రెండు మూడు రోజులు ఉండేలా! ఇలా అలా కాదు . నిన్నెలా ఎంటర్‌టేన్ చేస్తానంటే నువ్వు నమ్మలేవు అన్నాడు. అలాగా తప్పకుండా వస్తా…అన్నడు గణపతి. ‘ఎంతలా ఎంటర్‌టేన్ చేస్తానంటే స్పెషల్ ఫారిన్ సరుకు అనుకుని. అందుకే ఆ రోజు ఊడిపడ్డాడు గణపతి సింగినాథం ఇంటికి. సింగినాథం చాలా ఆప్యాయంగా , ఆత్మీయంగా గణపతిని స్వాగతించి నానా అట్టహాసం చేశాడు. కాఫీ, ఫలహారాలు వచ్చాయి. అది ఆరగించాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. కబుర్లు అవుతూండగా గణపతి సింగినాథం మనం కలుసుకున్నప్పుడు నువ్వు నన్ను ఎంటర్‌టేన్ చేస్తానన్నావు గుర్తుందా? అడిగాడు. ఓ అదా! తప్పకుండా చేస్తా. అందుకే కదా నిన్ను పిలిచింది అంటూ ఓ మృదంగాన్ని తెచ్చాడు సింగినాథం.

గణపతీ , నేను మోత వాయిద్యాలని ఎంతగా గొప్పగా వాయిస్తానంటే నువ్వు ఒక్కసారి వింటే ఆ ధ్వని నీ చెవుల్లో మారుమోగుతుంటుంది అన్నాడు సింగినాథం. తకిట థోం…తకిట థోం, థధికిట, తకిట థోం… అంటూ మృదంగాన్ని వాయించడం మొదలెట్టాడు సింగినాథం. మై హంబుల్ సబ్‌మిషన్ యువర్ ఆనర్ అనీ తాను అనడానికి, యు ఆర్ వేస్టింగ్ ది కోర్ట్ టైమ్ బై రిపీటింగ్ లైక్ పారెట్ ది సేమ్ ఆర్గుమెంట్స్ అని న్యాయమూర్తి అనడానికీ అలవాటు పడ్డ తనకు ఈ తాళ ధ్వని సొద ఏమిటిరా అని దిగ్భ్రాంతి చెందాడు గణపతి. నేనెలాగూ ఇక్కడే ఉంటాను కదా తర్వాత వింటాలే అని లేవబోయాడు అతిథి. ఇది నీకు నచ్చలేనట్లుంది నచ్చకపోవడమేమిటి …అద్భుతంగా ఉంది. ఐతే పాలఘాట్ మణి అయ్యర్ మృదంగ విన్యాసాలు వినిపిస్తా . అవి విన్నావంటే డంగయిపోతావు. కాస్త రెస్ట్ తీసుకుందామనినసిగాడు గణపతి. నువ్వలా కుర్చీలో కూర్చుని రెస్ట్ తీసుకో ఈ తాళ విన్యాసాలను వినడమే ఒక మధురానుభూతి అని పాలఘాట్ మణిఅయ్యర్ ఆత్మ విలవిల్లాడేలా మృదంగ విన్యాసాలు మొదలెట్టాడు సింగినాథం. ఇదెక్కడ వచ్చి చిక్కుకున్నా దేవుడా అని మనసులో అనుకుని ఆ మృదంగం ధ్వని మధ్య బిగ్గరగా సింగినాథం అని పిలిచాడు. ఈ విన్యాసం నీకు నచ్చిందా ఏమిటి? మళ్లీ వాయించమంటావా అని అడిగాడు సింగినాథం. నాకు ఈ వేళప్పుడు షికారుకెళ్లడం అలవాటు. అలా తిరిగి వస్తాను అది మరీ మంచిది. బైటకు వెళ్లకుండా వాకిట్లోనే పచార్లు చేస్తూండు. నేను మృదంగం వాయిస్తూంటా. ఈ విధంగా నువ్వు మృదంగ వాదనా వినవచ్చు, షికారు చేయవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి అన్నాడు సింగినాథం మృదంగ ధ్వని హెచ్చిస్తూ. రెండు పిట్టలు కాదు నాయనా మూడు పిట్టలు అను . చచ్చిపడే మూడో పిట్ట ఈ గణపతి అని మనసులో అనుకుని వాకిట్లో పచార్లు మొదలెట్టాడు.

మృదంగం మోత అయ్యాక సింగినాథం! మృదంగ వాదనే కాక నీ దగ్గర మరేదైనా ఉందా…? అని నర్మగర్భంగా అడిగాడు గణపతి. లేకేం గణపతీ. నేను అనేక దేశవాళీ తాళ వాద్యాలు అంటే తబలా, ఢోలక్, బ్రహ్మతాళం, డప్పు, పక్కవాద్యం, మందర, ఘట వాయిద్యం, నగారా..
అదికాదు ఏదైనా స్పెషల్, ఫారిన్….

బాస్ డ్రమ్, కాంగో డ్రమ్స్ , థాయ్‌లాండ్‌కు చెందిన గాంగ్ చైమెన్, ఇండోనేషియాకు చెందిన గాంగ్ చైమ్స్ బొనాంగ్ కూడా వాయించగలను అదికాదు డ్రింక్స్ గట్రా తీసుకునే వాడివి కదా! అది మానేసి పదేళ్లయిది. ఇప్పుడు నీకు తబలా వాయించి వినిపిస్తా అని తబలా అందుకుని థా దిన్ థా, థా ధిన్ థా.. అంటూ మోత మొదలెట్టాడు.

గొంతు తడిసే భాగ్యం ఎలాగూ లేదని తేలిపోయాక ఇంక ఈ దుర్భర ధ్వని కాలుష్యం ఊబిలోంచి బైటపడితేనే శ్రేయస్కరం అని నిర్ణయించుకున్నాడు గణపతి. సాయంత్రం సింగినాథం శోక వదనంతో నాకు తెలుసు నీకు నా తాళ వాయిద్యాలు, సంగీతం బాగా ఆకట్టుకుందని , కానీ నా ఇరుగుపొరుగు వాళ్లు నీలా సంగీత ప్రియులు కారుగా!! అందుకని సాయంత్రం నుంచి ఉదయం వరకు నేను వాయించకూడదని ఆంక్ష విధించారు. అందువల్ల నువ్వు ఎంత ఉబలాటపడినా నేను వాయించలేను అన్నాడు సింగినాథం. అందుకే కదా దేవుడిని దయామయుడంటారు అని అనుకుని సింగినాథం. నాకు ఓ కేసు ఎల్లుండే విచారణకు రానుందని డైరీ చూశాక గుర్తుకొచ్చింది. అందువల్ల రేపు వేకువజామునే వెళ్లిపోదామని అనకుంటున్నా. ఉదయమే బండి ఉందిగా !

అబ్బే , నువ్వు వెళ్లడానికి వీలులేదు. ఇన్నాళ్లకు కలుసుకున్నాం కదా ! ఇంకా నువ్వు నా డప్పు , ఘటవాదనం విననే లేదు. విచారణను వాయిదా వేయమని కోరుతూ కోర్టును వేడుకో అన్నాడు సింగినాథం.
నువ్వు క్షమించాలి. ఇది చాలా ముఖ్యమైన కేసు. ఇవాళ నీ వాద్య సంగీతం విని ఆనందించాగా. ఇంకా ఆనందించాలనే ఉంది. ఈసారి వచ్చినప్పుడు నీ డప్పు, ఘట వాదనలేకాదు నగారా వాదన కూడా వింటా! అన్నాడు. గణపతి లోలోనే ఈ గండం గడిచి బైటపడితే మరణ మృదంగమైనా వినడానికి సిద్ధం అనుకుంటూ..

రాత్రి నిద్రపోతున్న గణపతికి పీడకల వచ్చింది. తాను స్టేషన్‌కు చేరగానే తన బండి బైలుదేరుతున్నట్లు, ఇంతలో సింగినాథం మెడలో పెద్ద బ్యాండుతో వచ్చి నువ్వు వెళ్లడానికి వీలులేదు. నా బ్యాండు వాదనం విని వెళ్లాలి గణపతీ అని తనను లాగుతున్నాడట. తాను విడిపించుకోబోతూంటే సింగినాథం తన తలమీద బ్యాండుతో మోదగా, బాధగా తనకు మెలకువ వచ్చేసింది. తల తడుముకుని ఇంకా నయం ఇది కల మాత్రమే అనుకుని టైమ్ చూద్దామని వాచీ చూస్తే అది ఆగిపోయి ఉంది. బండికి టైమయిందేమోనని అనుకుని జడుసుకున్నాడు. బండి తప్పిపోతే రేపల్లా తాళ నరకయాతన అనుభవించాలి. వెంటనే పక్కగదిలో పడుకున్న సింగినాథాన్ని లేపి టైం చెప్పమన్నాడు.
అయ్యో! నేను నగారా వాయిస్తుంటే గోడ గడియారం కిందపడి ముక్కలైంది. నా వాచీని కూడా బాగు చేయించడానికిచ్చా. కానీ ఉండు. టైం

పొరుగువాళ్లు చెప్తారులేఅని లోపలికి వెళ్లి ఢాం ఢాం అని నగారా వాయించసాగాడు సింగినాథం.
ఆ మోత విన్న పొరుగువాళ్లు ఏం సింగినాథం! నీకు ఒళ్లు దురదగా ఉందా ? రాత్రి ఒంటి గంటన్నరకు ఈ నగారా బాదుడేంటి? మేం వచ్చి నీ పొగరు అణచాలా లేక బాదుడు ఆపుతావా? అనే అరుపులు వినవచ్చాయి. నగారా వాయింపు ఆపి అదిగో ఒంటిగంటన్నర అయ్యింది. నీ బండికి ఇంకా టైముంది . వెళ్లి పడుకోఅని చెప్పి మరలా పక్కమీదకు చేరాడు సింగినాథం. నిద్రపోతే వేళకు వెళ్లగలనో లేదో! బండి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోకూడదు. ఎందుకైనా మంచిది దైవధ్యానం చేసుకుంటూ మేలుకునే ఉంటా. రక్షించు తండ్రీ అంటూ రామనామ తారకం, భక్తిముక్తి ప్రదాయం అని వల్లించసాగాడు గణపతి.

Comments

comments