Search
Monday 11 December 2017
  • :
  • :

రసపట్టులో యాషెస్‌ రెండో టెస్టు

Ashesఆడిలైడ్: ఇంగ్లాండ్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. 354 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ మరో 178 పరుగులు చేయాలి. కెప్టెన్ జో రూట్ (67 నాటౌట్, 114 బంతుల్లో 9×4) క్రీజులో ఉండడంతో ఇంగ్లాండ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాకు గెలుపు కోసం మరో ఆరు వికెట్లు కావాలి. ప్రస్తుతం అయితే అవకాశాలు ఆస్ట్రేలియాకే అధికంగా కనిపిస్తున్నాయి. బుధవారం చివరి రోజు ఇంగ్లాండ్ నిలకడగా ఆడితే మాత్రం ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పక పోవచ్చు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు అలిస్టర్ కుక్, మార్క్ స్టోన్‌మన్ శుభారంభం అందించారు. ఇద్దరు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే 18 పరుగులు చేసిన కుక్‌ను లియాన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ స్టోన్‌మన్ ఆరు ఫోర్లతో 36 పరుగులు కూడా పెవిలియన్ చేరాడు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ రూట్ తనపై వేసుకున్నాడు. అతనికి విన్స్ అండగా నిలిచాడు. కుదురుగా ఆడుతున్నట్టు కనిపించిన విన్స్ 18 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 91 పరుగు ల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన డేవిడ్ మలాన్‌తో కలిసి రూట్ పోరాటం కొనసాగించాడు. కానీ, 4ఫోర్లతో 28 పరుగులు చేసిన మలాన్‌ను కమిన్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆట ముగిసే సమయానికి రూట్ 67, వోక్స్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాం డ్ బౌలర్లు అండర్సన్ ఐదు, వోక్స్ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించడంతో ఆస్ట్రేలియా ప్రత్యర్థి ముందు  క్లిష్టమైన 354 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Comments

comments