Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

అది ఆస్కార్ కంటే ఎక్కువ

అక్కినేని నాగార్జున నిర్మాణ సారధ్యంలో తన కుమారుడు అఖిల్‌తో చేస్తున్న సినిమా ‘హలో’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం ఈనెల 22న విడుదలకానుంది. ఈసందర్భంగా చిత్ర నిర్మాత నాగార్జునతో ఇంటర్వూ విశేషాలు…

Nag

 అద్భుతమైన స్పందన…
‘హలో’ సినిమా టీజర్, ట్రైలర్, తాజాగా విడుదలైన వన్ మినట్ సాంగ్ అన్నీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేశాయి. ట్రైలర్‌ను అయితే మూడు, నాలుగు రోజుల్లోనే 8 మిలియన్ల మంది చూశారు. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది.

 10న ఆడియో వేడుక…
సినిమా ఆడియో వేడుకను ఈనెల 10న వైజాగ్‌లోని ఎంజిఎం గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్నాం. ఈ వేడుకలో అఖిల్ స్వయంగా పాట పాడి డ్యాన్స్ కూడా చేస్తాడు. ఇందుకోసం అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు.

 పక్కా స్క్రిప్ట్‌తో…
ఎనిమిది నెలల క్రితం దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమా లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. దానిమీద బాగా వర్క్ చేసి పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాకే షూటింగ్‌కు వెళ్లాం.

 బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ…
టీజర్ చూశాక అందరూ ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అనుకున్నారు. కానీ ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ. ఇందులో మంచి మదర్, ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

 చిన్న మ్యాజిక్…
దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన పనితనం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాను. ఈ సినిమాను ఎంతో శ్రద్ధగా తెరకెక్కించారు. ఆయన అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఇందులో కూడా చిన్న మ్యాజిక్ ఉంటుంది.

 అందుకే రిలీజ్ చేస్తున్నా…
సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. విక్రమ్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను. కానీ స్క్రీన్ మీద చూస్తే ఆ స్క్రీన్‌ప్లే అర్థమైంది. అవుట్‌పుట్ బాగుంది కాబట్టే సినిమాను రిలీజ్ చేస్తున్నాను. సినిమా సరిగా రాకుంటే రిలీజ్ చేసేవాడిని కాదు.

 కళ్యాణి బాగా చేసింది…
నేను చేసిన ‘నిర్ణయం’ దర్శకుడు ప్రియదర్శన్ కూతురే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి. నిజానికి ఆమె తల్లి లీసాను అప్పట్లో నాతోనే హీరోయిన్‌గా లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆమె కూతురు కళ్యాణి నా కుమారుడితో హీరోయిన్‌గా లాంచ్ అవుతోంది. అమ్మాయి నిజంగా చాలా బాగా నటించింది.

 జాకీచాన్ స్టంట్స్ గుర్తుకొస్తాయి…
సినిమాలో స్టంట్స్ కొత్తగా ఉంటాయి. వాటి కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను తీసుకొచ్చాం. ఒక ఫైట్ అయితే మొత్తం కృష్ణానగర్ ఇళ్ల మీదే ఉంటుంది. ఇంకొకటి మెట్రో రైలులో ఉంటుంది. ఫైట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. కొన్ని చోట్ల జాకీచాన్ స్టంట్స్ గుర్తుకొస్తాయి.

 అందుకే ‘హలో’ టైటిల్…
సినిమాలో హీరోయిన్ విడిపోయేటప్పుడు హీరోకు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తుంది. కానీ హీరో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తదు. అలా హీరో 15 ఏళ్లపాటు ఆమె నోటి నుండి హలో అనే పదం వినాలని ఎదురుచూస్తూ ఉంటాడు. అందుకే సినిమాకు ‘హలో’ టైటిల్ పెట్టాం.

 వారి హృదయాలు అవార్డుగా…
‘మనం’ మాకు ప్రత్యేకమైన సినిమా. ఇది నాన్నగారి ఆఖరి సినిమా. ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరించారు. వారి హృదయాలను మాకు అవార్డుగా ఇచ్చారు. అంతకంటే మాకు ఏం కావాలి. మాకు అది ఆస్కార్ కంటే ఎక్కువ. వేరే అవార్డులు (నంది అవార్డులు) మాకు అక్కర్లేదు.

Comments

comments