Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

నాలో ఆ కసి ఉంది

సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్‌పై సప్తగిరి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరితో ఇంటర్వూ…

sapthagiri

 సందేశాన్నిచ్చే చిత్రం…
హీరోగా నాకు మంచి పేరును, నిర్మాత డా.రవికిరణ్‌కు లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలనుకొని చేసిన సినిమాయే ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. సమాజానికి సందేశాన్నిచ్చే విధంగా సినిమా రూపుదిద్దుకుంది. బాలీవుడ్ మూవీ ‘జాలీ ఎల్‌ఎల్‌బి’కి రీమేక్ చిత్రమిది. ఇందులోని మెయి న్ థీమ్‌ను తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని చేశాం.

 న్యాయం కోసం పోరాడే…
భారతదేశంలో పుట్టిన ధనికులైనా, పేదవారైనా… ప్రతి పౌరుడికి న్యాయం దక్కాలని మన రాజ్యాంగం చెబుతోంది. అలాంటి న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కడం కోసం పోరాడే ఓ చిన్న లాయర్ కథే ఇది. సినిమా కథ అందరికీ నచ్చుతుంది.

 లాయర్లకు అంకితం…
రీమేక్ సినిమా చేయాలనే నిర్ణయాన్ని నేను, నిర్మాత కలిసి తీసుకున్నాం. నేను 75 సినిమాల్లో కమేడియన్‌గా చేశాను. మళ్లీ కమేడియన్‌గా చేస్తే బావుండదు. కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నాను. ఏదైనా నిజాయితీగా చేయాలనుకొని ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమా చేశాను. ఇందులో నాది లాయర్ పాత్ర. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ను కానిస్టేబుళ్లకు అంకితమిస్తే… ఈ సినిమాను నిజాయితీ గల లాయర్లకు అంకితమిస్తున్నాం.

 కట్టిపడేసే సన్నివేశాలు…
ఈ చిత్రం భావోద్వేగాలతో నడుస్తుంది. అలాగే నా కామెడీ కూడా ప్రేక్షకులను నవ్విస్తుంది. హిందీ సినిమాలో ఎక్కువగా పాటలుంటాయి. ఆ పాటల స్థానంలో మేము కమర్షియల్ ఎలిమెంట్స్‌ను చూపించాం. చివరి 45 నిమిషాల్లో ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలుంటాయి. ప్రేక్షకులు భావోద్వేగానికి, ఉత్కంఠతకు లోనవుతారు. సప్తగిరి చాలా చిన్నవాడు, కమేడియన్. అలాంటివాడు ఇలాంటి సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా మార్పులు చేసి సినిమా చేశాం.

 అనుకున్న సమయంలోనే…
చరణ్ లక్కాకుల సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్. మేము అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో మంచి అనుభవమున్న దర్శకుడు కావాలని అతన్ని కలిశాం. పాతికేళ్ల అనుభవమున్న వ్యక్తి కాబట్టి సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశారు.

 డ్యాన్స్ మాస్టర్‌ను పెట్టుకొని కష్టపడ్డా…
డ్యాన్సులు వేయాలనే కసి నాలో ఉంది. మ్యూజిక్ వినగానే నాలో ఒక ఊపు వస్తుంది. దాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టుకుంటే మంచి అవుట్‌పుట్ తేగలనని అనిపించింది. దాంతో ఓ డ్యాన్స్ మాస్టర్‌ను పెట్టుకొని కష్టపడ్డాను. సినిమా విడుదల తర్వాత నేను ఎలా డ్యాన్సులు చేశాననే విషయాన్ని ప్రేక్షకులు చెబుతారు. ఈ సినిమా కోసం పలువురు లాయర్లను కూడా కలిశాను. అలాగే టైటిల్ విషయంలో సెంటిమెంట్‌ను అనుసరించాం.

 మ్యూజిక్ సూపర్బ్‌గా…
బుల్గానిన్ అందించిన పాటలు, రీరికార్డింగ్ సూపర్బ్‌గా ఉన్నాయి. పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. బుల్గానిన్ మ్యూజిక్ సినిమాలో ప్రేక్షకుడిని లీనమయ్యేటట్లు చేస్తుంది.

 ముగ్గురం హీరోల్లా చేశాం…
హిందీలో బొమన్ ఇరానీ చేసిన పాత్రలో సాయికుమార్ నటించారు. సౌరవ్‌శుక్లా చేసిన క్యారెక్టర్‌ను శివప్రసాద్ చేశారు. ఈ సినిమాలో నేను, సాయికుమార్, శివప్రసాద్ ముగ్గురం హీరోల్లా చేశాం.

 ఏవిధంగానూ రాజీపడకుండా…
నిర్మాత రవికిరణ్ తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రెండో సినిమాతో కూడా మంచి హిట్‌ను అందుకుంటారు. సినిమాల్లో ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కాకుండా ఈ సినిమా నిర్మాణంలో ఏవిధంగానూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు.

Comments

comments