Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

ఇక పట్టాభిషేకమే

pranab

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ నామినేషన్
బరిలో ఒకే ఒక్కడు, పగ్గాలు చేపట్టడమే తరువాయి

*రాహుల్ కాంగ్రెస్ డార్లింగ్ : మన్మోహన్
*సమర్థుడైన నేత : గులామ్ నబీ భావి ప్రధాని : అమరేందర్ సింగ్
*ప్రత్యేక వ్యక్తిత్వమున్న నాయకుడు : నవజ్యోత్‌సింగ్ సిద్ధు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సోమవారం తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తల్లి సోనియా గాంధీ సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తరాల మార్పిడికి రాహుల్ దారితీశారు. సోమవారం పలువురు పార్టీ సీనియర్లతో కలిసి వెళ్లిన రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. రాహుల్ వెంట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. సోనియా గాంధీతో పాటు పలువురు నేతలు రాహుల్ పేరును ప్రతిపాదించారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో సోనియా గాంధీ అక్కడ లేరు. పార్టీ అత్యున్నత పదవికి రాహుల్ ఒక్కరే బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. వరుసగా 19 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వస్తున్న సోనియా గాంధీ నుంచి బాధ్యతలను స్వీకరించేందుకు రాహుల్‌కు మార్గం సుగమం అయింది.ఉదయం పదిన్నర ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన రాహుల్ అరగంట తరువాత పత్రాలను దాఖలు చేశారు. రాహుల్ తరఫున అయిదు సెట్ల పత్రాలు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నేతలు, సిడబ్లుసి సభ్యులు, పార్టీ కార్యవర్గంలోని వారు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జీలు , పార్టీ పాలిత రాష్ట్రాల సిఎంలు ఈ సెట్లను అందించారు. తొలి సెట్ నామినేషన్ పత్రాలలో రాహుల్ పేరును సోనియా, మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్ ఇతర సీనియర్లు ప్రతిపాదించారు. రెండవ సెట్‌లో రాహుల్ పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, పి చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, ఆనంద్ శర్మ , కర్నాటక సిఎం సిద్ధరామయ్య ఇతరులు ప్రతిపాదించారు. సోమవారమే నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఆదివారం వరకూ ఇతరులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ ఛైర్మన్ ముళ్లపల్లి రామచంద్రన్ వెల్లడించారు.
రాహుల్ కాంగ్రెస్ డార్లింగ్ : మన్మోహన్ మాట
కాంగ్రెస్‌కు రాహుల్ ప్రాణప్రదం (డార్లింగ్) అని ఎఐసిసి ప్రధాన కార్యాలయం వద్ద విలేకరులతో మాజీ ప్రధాని మన్మోహన్ చెప్పారు. పార్టీలో అంతా ఆయనను అభిమానిస్తారని తెలిపారు. 19 ఏళ్లుగా సోనియాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశానికి సేవల చేస్తూ వచ్చారని , ఇప్పుడు ఈ దిశలో మరో అడుగు ముందుగా రాహుల్ పదవీ బాధ్యతలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ బాధ్యతలను ఆయన సమర్ధవంతంగా నిర్వర్తిస్తారని, రాహుల్ దేశానికి అత్యుత్తమ ప్రధాని అవుతారని స్పందించారు. 47 ఏళ్ల రాహుల్‌ను మాజీ ప్రధాని కొనియాడుతూ ఘనమైన కాంగ్రెస్ మహోన్నత సాంప్రదాయాలను ఆయన నిలబెడుతారనే నమ్మకం ఉందని స్ప ష్టం చేశారు. సాధారణంగా ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండే మౌన మాజీ ప్రధాని ఇప్పుడు అందుకు భిన్నంగా రాహుల్‌పై స్పందించారు. విలేకరులతో ఇష్టాగోష్టి సమయం లో హుషారుగా కన్పించారు. రాహుల్ సమర్థుడైన నేత అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యా ఖ్యానించారు. ఆయన నాయకత్వం విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. పంజాబ్ సిఎం అమరిందర్ సింగ్ రాహుల్‌ను కొనియాడారు. భావి ప్రధానిగా అభివర్ణించారు. పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ స్పం దిస్తూ రాహుల్ ప్రత్యేక వ్యక్తిత్వపు నేత అన్నారు. పార్టీ సంక్షోభ సమయంలో ఆయ న ముందుకు వస్తున్నారన్నారు. పార్టీ శ్రేణులకు మనోధై ర్యం నేర్పేవాడే నిజమైన నేత అని, ఈ లక్షణం రాహుల్ కు ప్రత్యేకం అన్నారు. రాహుల్ నామినేషన్ ప్రక్రియ ఒక చారిత్రక ఘట్టం అని నేతలు ఆనంద్ కపిల్ సిబల్ తెలిపారు. పార్టీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇతరులు కూడా రాహుల్ ఆగమనపు సంకేతపు నామినేషన్ల ఘట్టం ప్రస్తావిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ప్రణబ్, మన్మోహన్‌ల దీవెనలు 

నామినేషన్ దాఖలుకు ముందు రాహుల్ గాంధీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసానికి వెళ్లారు. పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకుంటున్న క్రమాన్ని వివరించి ఆయన దీవెనలు తీసుకున్నారు. అదే విధంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ను కూడా కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. పార్టీ సారథ్య బాధ్యతలు రాహుల్ తీసుకుంటారనే అంశం చాలా కాలంగా నానుతూ వస్తోంది. అయితే ఇప్పటివరకూ దీనిపై చిక్కడు దొరకడు తరహాలో ఉన్న రాహుల్ ఇప్పుడు నామినేషన్ పత్రాల దాఖలుతో తన వైఖరిని స్పష్టం చేసుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలలో పార్టీ ప్రచారంలో రాహుల్ తీరిక లేకుండా ఉన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 11. అవసరమైతే పోటీ ఈ నెల 16న జరుగుతుంది.

Comments

comments