Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

సర్పంచ్ లకు ప్రత్యక్షపోరు

ప్రతిపక్ష రాజకీయ పార్టీల డిమాండ్
సర్పంచ్‌లపై కెసిఆర్ చిన్నచూపు

               Sarpanch

మన తెలంగాణ/హైదరాబాద్ : సర్పంచ్‌లను ఎన్నుకు నేందుకు ప్రస్తుతం అవలంభిస్తున్న ప్రత్యక్ష ఎన్నికల విధానాన్నే కొనసాగించాలని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. దీనికి కాంగ్రెస్, బిజెపి, టిడిపి, తెలంగాణ లోక్‌సత్తా, తెలంగాణ ప్రజా పార్టీ తదితర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సర్పంచ్‌ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అందోల్ క్రిష్ణ అధ్యక్షతన పంచాయతీరాజ్ చట్టం, సవరణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన రౌండ్ టేండ్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ, రాచరిక, దొర పోకడలతో పాలన చేస్తున్న కెసిఆర్ వల్ల మరోసారి రాష్ట్రంలో నక్సలిజం వచ్చే ప్రమాదముందని అన్నారు. సర్పంచ్‌ల చెక్ పవర్ తీసేశారని, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎంఎల్‌ఎలను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి అవుతున్నట్టే వార్డు సభ్యులను కొనుగోలు చేసి సర్పంచ్‌లను గెలిపించుకోవాలని కుట్ర పన్నారన్నారు. అదే జరిగితే సర్పంచ్ ఎన్నికల్లో కూడా బడుగు, బలహీనవర్గాలకు ప్రాతినిథ్యం దక్కకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తున్న కెసిఆర్ పాలనపై ప్రజలు తిరగబడతారన్నారు. న్యాయ, పాలన, ప్రజాస్వామ్య వ్యవస్థలపై కెసిఆర్‌కు నమ్మకం లేదని ఆయన విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచ్‌లను చిన్నచూపు చూడడం తగదన్నారు.బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని తెలంగాణలో పరిస్థితి ఉందన్నారు. జమ్ముకాశ్మీర్ లాంటి అతి సున్నిత రాష్ట్రాలు సైతం సర్పంచ్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తున్నాయన్నారు. టిడిపి సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, అభద్రతాభావంతోనే ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందన్నారు. ఆదేశిక సూత్రాల ప్రకారం గ్రామ పంచాయతీలు పని చేయాలన్నారు. తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, అన్నాహజారే ఉద్యమం మాదిరిగా పౌర సమాజం బిల్లును ప్రవేశపెట్టాలని, ఆమోదం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. నాగార్జునసాగర్‌కు చెందిన సర్పంచ్ సువర్ణారెడ్డి మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ పార్టీలో చేరని సర్పంచ్‌లను వేధిస్తున్నారని ఆరోపించారు.

బిల్లుపై చర్చ జరగాలి : కోదండరామ్

ప్రత్యక్ష ఎన్నికలు తదితర డిమాండ్లతో సాగుతున్న పోరాటానికి జెఎసి మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ ప్రతిపాదిత పంచాయతీరాజ్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు దానిపై సంబంధిత వర్గాల్లో చర్చ జరగాలని టిజెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు.అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు చర్చించకపోతే సెలెక్ట్ కమిటీకి పంపి చర్చించాలన్నారు. సర్పంచ్‌లకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ బలహీనమవుతుందన్నారు. పరోక్ష ఎన్నికలు పెడితే సర్పంచ్‌లు తమ సీటును కాపాడుకోవడానికే సరిపోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలపై పరోక్షంగా పెత్తనం చేసేందుకు యత్నిస్తుందని విమర్శించారు. పరోక్ష ఎన్నికల్లో నామినేటెడ్, సీల్డ్ కవర్ సర్పంచ్‌లు వస్తారన్నారు.

Comments

comments