Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అక్కా, తమ్ముళ్ల దీన గాధా

s,b

పుట్టుకతోనే చూపులేని అభాగ్యులు
ఎవరు లేక అనాథలుగా బతికు సాగిస్తున్న వైనం
ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూపు
ఖమ్మం అర్బన్: పుట్టుకతోనే చూపులేని ఆ అక్కా, తమ్ముళ్లకు అన్ని తానై పెంచిన అమ్మ వారిని వీడి అనంతలోకాలకు వెళ్లింది. అప్పటి వరకు వారి అలనా పాలనా అన్ని తానై చూసుకుంది. వయస్సు పెరుగుతున్నప్పటికీ వారికి చూపు (అంధకారం) లేకపోవడంతో వారిని పసి పిల్లల వలే చూసుకుంటూ వారిని పెంచుకుంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తల్లి వయస్సు పైపడడంతో తనువు చాలించడంతో అప్పటి వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తల్లి లేకపోవడంతో వారి జీవనం మరింత అంధకారంగా తయారైంది. వివరాల్లోకి వెళితే… రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామానికి చెందిన బోబిళ్లపాటి జోసెఫ్, సంపూర్ణమ్మ దంపతులకు బాబు, సత్యావతి, ప్రభాకర్ ముగ్గురు పిల్లలు జన్మించారు. వారి దురదృష్టమో, శాపమో కానీ వారి ముగ్గురు సంతానం చూపులేకుండానే అంధులుగా జన్మించారు. అయినప్పటికీ జోసెఫ్ దంపతులు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకో సాగారు. ఇంతలో విధి వక్రించి వీరి చిన్న వయస్సులోనే తండ్రి జోసెఫ్‌ను కోల్పోయారు. దీంతో పాటు 15 ఏళ్ల క్రితం సోదరుడైన బాబు కూడా అనారోగ్యంతో మృతిచెందడంతో ఉన్న ఇద్దరు పిల్లలు బోబ్బిళ్లపాటి సత్యావతి, ప్రభాకర్‌లు సంపూర్ణమ్మ అన్ని తానై వారిని సాకుతూ వస్తుంది. వారికి ఉండడానికి సరైన గూడు కూడా లేకపోవడంతో క్రిస్టియన్ సంస్థ వారే ఇంటిని నిర్మాణం చేసి ఇచ్చారు. ఆ గూడునే ఆసారా చేసుకుని ఇద్దరు బిడ్డలను చంటి బిడ్డలవలే చదుకుంటూ నివాసముంటున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛన్ పథకంలో ఇద్దరు బిడ్డలకు వచ్చే పింఛన్‌తోపాటు తాను కూడా రెక్కల కష్టం చేస్తూ సంపూర్ణమ్మ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలకు అండగా ఉన్న సంపూర్ణమ్మ రెండేళ్ల క్రితం మృతిచెందడంతో కంటి చూపులేని అక్కా, తమ్ముళ్లకు జీవనం మరింత ఆగాదంగా మారింది. కేవలం మాటలు, శబ్దాల ద్వారా వారు ఇతరులను గుర్తుపడుతూ కాలనీ వాసుల సహకారంతో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వారికి పింఛన్ తప్ప మరో ఆదాయం లేకపోవడంతో వారి జీవనం కష్టంగా మారింది.
బ్రతుకు పోరాటం: పుట్టుకతోనే కంటి చూపు లేకపోవడంతో పాటు ఇప్పటి వరకు తమను కంటికి రెప్పలా కాపాడిన తల్లి కూడా తనువు చాలించడంతో అక్కా, తమ్ముళ్లు ఇద్దరు బతుకు పోరాటం సాగిస్తున్నారు. రెండేళ్లుగా అక్కా, తమ్ముళ్లు ఇద్దరు చేదోడు వాదోడుగా కలిసి మెలిసి తమ పనులను తామే చేసుకుంటున్నారు. కంటి చూపు లేకపోయినప్పటికీ వంట కూడా వారే చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలికిడి, శబ్దాల ద్వారానే వచ్చిపోయే వారిని గుర్తిస్తూ బతుకిడుస్తున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి ఇచ్చే రూ.3వేల పింఛన్‌తో బతుకుతున్నప్పటికీ ఆ రూ.3వేలు అన్ని అవసరాలు తీర్చకపోవడంతో వారి జీవితం మరింత అంధకారంగా మారింది. పింఛన్‌తో పాటు ప్రభుత్వం తరుపున సాయం అందించాలని గతంలో గ్రామానికి వచ్చిన కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు గ్రామస్తులంతా అక్కా, తమ్ముళ్ల దీనగాదను వివరించి సాయం అందించాలని కోరారు. ప్రభుత్వం దళితులకు ఇస్తున్న మూడెకరాల భూమి కూడా వీరికి అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు కంటి చుపు లేక అంధకారంలో జీవిస్తున్నా అక్కా, తమ్ముళ్లను ఆదుకుని ఆర్థికంగా చేయూతనివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

comments