Search
Wednesday 21 March 2018
  • :
  • :
Latest News

దేవుని ప్రేమ

jesus-photos-hd

దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ మాటలను మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని రోమా పత్రిక 5వ అధ్యాయంలోని 8వ వచనంలో చూడగలము.

ప్రేమగల దేవుడు లోకములో ఉన్న మనలనందరిని ప్రేమించి మనలను పాపము నుండి విడిపించడానికి యేసు క్రీస్తును ఈ లోకములోనికి పంపించినాడు. ఆ యేసుప్రభువు ఈ లోకములో జీవించినంత కాలం ‘‘ నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును ? ’’ (యేహాను 8:46) అని ధైర్యంగా చెప్పినారు, పాపమే యెరుగలేదని 2కొరంథీ 5:21వ వచనంలో అపొస్తలుడైన పౌలు సాక్షమిస్తున్నాడు. యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు ‘‘ ఆయన పాపము చేయలేదు.. ఆయన నోటను ఏ కపటమును లేదని 1పేతురు 2:22వ వచనంలో వ్రాసినాడు.

పాపులమైన మనలను పాపము నుండి రక్షించడానికి పాపము లేని వ్యక్తిగా యేసుక్రీస్తు మన కొరకు మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఇప్పుడు సజీవుడైయున్న యేసుక్రీస్తు దేవుని కుడిపాశ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపనము కూడా చేస్తున్నాడు (రోమా 8:34) ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఉన్న నిరీక్షణ ఏమిటంటే ఆ దేవుని ప్రేమ నుండి మనలను ఎవరూ ఎడబాపలేరు.

మన ఇంట్లో ఒక పిల్లవాడు బయట ఆటలాడి వచ్చి మురికిగా ఉంటే తల్లి ఆ పిల్లవాడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తుంది.. అంతేకానీ ఆ పిల్లవాడికి ఉన్న మురికి కారణంగా పిల్లవాడిని ఇంట్లో నుంచి పంపివేయదు. అలాగే లోకములో ఏదో ఒక పాపములో పడినట్లైతే యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన ప్రతి పాపము నుండి మనకు విమోచన కలుగుతుంది. ఆ క్రీస్తుప్రేమ నుండి మనలను ఎవరును ఎడబాపలేరు. మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను (రోమా 5:8)

ఈ దేవుని ప్రేమను గురించిన మార్గమును తెలియక ఎందరో తమ సొంత మార్గములైన త్రాగుడు, ఇతర వ్యసనాలకు బానిసలై కుటుంబాలకు కుటుంబాలుగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. అసలు సృష్టికర్త ఎవరు? అని విచారించక సృష్టిని పూజిస్తూ నిజ దేవుడిని మరచిపోయారు.

ఒకసారి అమెరికాలో తూర్పు భాగమునందు ఒక రైలు బండి అతి కష్టంగా ముందుకు సాగుచున్నది. అందులో ఒక స్త్రీ తన చంటి బిడ్డతో ప్రయాణం చేస్తున్నది. ఆమె ఆతృత చూసి ఒక పెద్ద మనిషి ఆమెతో ‘‘ అమ్మా నీవు దిగవలసిన స్టేషను రాగానే చెప్పుతాను ఏమీ ఫర్వాలేదు నిశ్చింతగా కూర్చో’’అని ధైర్యం చెప్పాడు.

ఆ సమయంలో మంచు తుఫాను ఉధృతంగానుండెను. అంతలో రైలు ఒక చోట ఆగెను. వెంటనే ఆ పెద్ద మనిషి ‘‘ అమ్మా నీవు దిగవలసిన స్టేషను వచ్చినదని’’ ఆమెతో చెప్పెను. అతని దయగల మాటలకు ఆ స్త్రీ ఆయనకు నమస్కరించి, తన పసిబిడ్డతో అచ్చట దిగెను. రైలు నెమ్మదిగా కదిలి వెళ్లెను. కానీ, ఇంజనులో ఏర్పడిన లోపమును సవరించుటకు కొద్ది క్షణాలు మార్గ మధ్యములో ఆపవలసి వచ్చేనే గాని అప్పుడు నిజముగా స్టేషను రాలేదు. కానీ, ఆ స్త్రీ అప్పటికే ఆ చీకటిలో చాలా దూరం ప్రయాణం చేసింది. తరువాత రక్షక దళం వారు ప్రయత్నించి చూడగా వారిరువురును చనిపోయి బిగిసిపడియున్న స్థితిలో కనుగొనిరి.

ప్రియ స్నేహితులారా! చూశారా! పొరపాటుగా ఇచ్చిన సలహా రెండు నిండు ప్రాణాల్ని ఎట్లు బలిగొన్నదో! ఒక్క చిన్న సలహాతో ఆ స్త్రీ తాను దిగవలసిన స్టేషను తెలుసుకొనక తెలియని ప్రదేశములో దిగి తన గమ్యస్థానాన్ని చేరలేక చివరకు మరణానికి చేరువైంది. అలాగే మనం జీవిత యాత్ర కొనసాగుతున్న ఈ లోకంలో మనం చేరవలసిన గమ్యస్థానం తెలిసికొనకపోతే మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మనం ఒక మనిషి చినపోతే చచ్చిపోయాడు అని అంటాము. నిజానికి చచ్చింది ఏమిటి? పోయింది ఏమిటి? అని మనము గ్రహించుట లేదుచచ్చింది శరీరం.. పోయింది మనలోని ఆత్మ. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తున్నదేమనగా? ‘‘ మన్నయినది వెనుకటివలేనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలి పోవును (ప్రసంగి 12:7)

నిజదేవుడిని ఎరుగక సృష్టికర్తను ఎరుగక సృష్టమును మనుష్యులు పూజిస్తున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అన్నారు.. అదేమనగా ‘‘ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై యున్నాను’’ ఈ మార్గము, ఈ గమ్యము తప్ప మనకు పరలోకం చేరడానికి వేరే మార్గమును, గమ్యమును లేదు.

                                                                    డాక్టర్ టి.కిరణ్ కుమార్, పిహెచ్ డి

                                                                                                      (హెబ్రోన్ చర్చ్, హైదరాబాద్), ఫోన్: 9299204083

Love of God!

Comments

comments