Search
Saturday 21 April 2018
  • :
  • :

జలప్రళయానికి అడ్డుకట్ట…. ఉస్మాన్ సాగర్

Osman-Sagar

చెరువుల నిర్మాణం, జలవనరుల పరిరక్షణలో తరతరాల సంప్రదాయాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన ఆసఫ్ జాహీ రాజులు పాటించారు. ఆనాటి నిజాం సంస్థానంలో అనేక చెరువుల నిర్మాణంజరిగింది. చెరువుల నిర్మాణం, మరమ్మతులు,బావుల తవ్వకాలకు 1878 లో నిజాం ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈశాఖను సదర్-ఉల్-మిహం పర్యవేక్షణలో ఉండేది. తాలూకాదారులు ఎప్పటికప్పుడు నీటిపారుదల నివేదికలు అందించేవారు. జిల్లాలవారీగా తాలుకాదారులకు సహాయకారులుగా కర్కూన్స్ అనేబడే ఉద్యోగులు జలవనరుల నివేదికలను రూపొందించేవారు. అయితే ఆసఫ్ జాహీల కాలంలో నీటిపారుదలరంగం పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే చెరువులు ఉండకపోవడంతో మూసినది ముప్పు పొంచి ఉండేది. వరదలు జలప్రళయాన్ని సృష్టించేవి. తొలిసారిగా మూసీ వరదలు 1829లో వచ్చినట్లు ప్రత్యేక్షంగా వరదలు వీక్షించిన ఏనుగుల వీరస్వామి రచనల్లో తెలుస్తుంది.

ఆతర్వాత 1908 సెప్టెంబర్26,27 తేదీల్లో కురిసిన 32.5 సెంటీమీటర్ల వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఎక్కడికక్కడ- హైదరాబాద్ శివార్లలోని వందలాది చెరువులు నిండిపోయాయి.వరద మూసిలో చేరడంతో ప్రళయం తాండవించింది. హైదరాబాద్ ను మూసి ముంచేసింది. సెప్టెంబర్ 26న ప్రారంభమైన వర్షం 28 వరకు ఎడతెరపకుండా కురవడంతో నమోదైన 440 మిల్లీ మీటర్ల వర్షం హైదరాబాద్ ను సముద్రంగా మార్చింది. 15వేలమంది మూసీవరదల్లో మృతిచెందగా 80వేల మంది క్షతగాత్రులయ్యారు. పాలన స్తంభించింది. ప్రధాన రాజసౌధాలు కూడా నీటమునిగాయి. అప్జల్ గంజ్, చార్మినార్, నాంపల్లి తో పాటు పాతబస్తీలోని అనేక జనావాసాలు నీటతేలియాడాయి. బస్తీలు మూసిలో కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ మృత్యుఘోషతో నిండిపోయింది. వరదల నివారణ కోసం ఆనాటి నిజాం పాలకులు ప్రణాళికలను రూపొందించారు. భవిష్యత్ అవసరాల పట్టణీకరణకు నిజాం ప్రభుత్వం 1909 అక్టోబర్ 1న నగరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరదల నివారణకు ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను సుప్రసిద్ధ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. 1912 లో జరిగిన నగరాభివృద్ధి ట్రస్టు సమావేశంలో మూసివరదల నివారణ కోసం హైదరాబాద్ శివార్లలో చెరువులను నిర్మించాలని తీర్మానించారు. ఈ చెరువులు ప్రజలకు తాగునీటిని అందివ్వడంతో పాటు మూసివరదలను అడ్డుకునే విధంగా ఉండాలని నిజాంరాజు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో 1920లో నిర్మించిన చెరువు ఉస్మాన్‌సాగర్ ఈ చెరువు గండిపేటగా ప్రసిద్ధిచెందింది. ఈ చెరువు చుట్టుకొలత 46 చదరపు కిలోమీటర్లు,వైశాల్యం 29 చదరపు కిలోమీటర్లు ఉండగా జలాశయం లోతు ఒకవేయి790 అడుగులు ఉండగా 3.9 టి.ఎం.సి నీటినిల్వ సామర్థ్యం ఉస్మాన్ సాగర్‌కు ఉండే విధంగా నిర్మాణం జరిగింది. అలాగే సరస్సుకు ఎదురుగా నిజాం రాజు విడిది కోసం సాగర్‌మహల్ నిర్మించారు. హైదరాబాద్ నగరకేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గండిపేట చెరువు హైదరాబాద్‌తో పాటు సికింద్రబాద్‌కు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడం నిర్మాణంలోని మరో ముఖ్యఉద్దేశం. ఎత్తులో ఉన్న అనంతగిరి అడవుల్లోని ఔషధ మెుక్కలను తాకుతూ వరదప్రవాహం ఉస్మాన్ సాగర్ లో చేరడంతో గండిపేట నీటికి ఔషధ ప్రాధాన్యం పెరిగింది. హైదరాబాద్ నీళ్ళు పడ్డాయి…రంగుమారాడు అనే నానుడి ఈ చెరువునీళ్ళతోనే రావడం చెరువుప్రాధాన్యం స్పష్టం చేస్తుంది.

ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ఈ చెరువు ఆనాటి పాలకుల దూరదృష్టికి తార్కాణంగా నిలిచింది. మూసి నదీవరదలను అరికట్టడంతో పాటు తాగునీటి సరస్సుగా ఖ్యాతి పొందింది. అలాగే అనేక చెరువులను నిర్మించి సాగుతాగునీటిని ఆసఫ్ జాహీ రాజులు ప్రజలకు అందించారు. సంస్థానాల విలీనం అనంతరం చెరువుల నిర్మాణం ఆగిపోయింది. ఇప్పటికీ ఆనాటి రాజులు నిర్మించిన చెరువుల నీటితోనే సాగునీరు లభిస్తుంది. అయితే కాలగమనంలో గండిరేటచెరువు వైశాల్యం తగ్గింది. పట్టణీకరణతో చెరువుచుట్టూ జనావాసాలు చేరడం, రకరకాల కాలుష్యం చేరడంతో గండిపేట గతవైభవాన్నికోల్పోతుంది. హైదరాబాద్‌కు నీటికష్టాలను తెచ్చిపెట్టింది. ఫలితంగా 2000లో కురిసిన భారీవర్షంతో మూసిలో చేరిన నీటిప్రవాహం ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఇళ్ళలోకి చేరాయి . మాభూములు మీరు కాజేస్తే మీ ఇళ్ళ లోకి మేము వస్తామని వరదలు ప్రజలను హెచ్చరించాయి. మానవమనుగడకు, నాగరికతకు నిలయాలైన జలవనరులను కాపాడుకునే బాధ్యతను వరదలు హెచ్చరించాయి.

వి. భూమేశ్వర్
మన తెలంగాణ ప్రతినిధి

Comments

comments