Search
Monday 11 December 2017
  • :
  • :

నక్సల్స్ డెన్‌పై పోలీసుల దాడి

 

ph2

 

ముగ్గురి అరెస్టు పట్టుబడిన ఆయుధాలు
సిపిఐ(ఎంఎల్) సిపి బాట పేరుతో కొత్త పార్టీ

ఏటూరు నాగారం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని నర్సింహసాగర్ అట వీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు సిపిఐ(ఎంఎల్) నక్సల్స్ డెన్‌పై దాడి చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు నక్సల్స్ పోలీసులకు దొరకగా, మరికొందరు నక్సల్స్ పారిపోయారు. ఏటూరునాగారం ఎఎస్పి రాహుల్ హెగ్గే కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. నర్సింహసాగర్ అటవీ ప్రాంతంలో సిపిఐ(ఎంఎల్) సిపి బాట నక్సల్స్ కొన్నిరోజులుగా ఆశ్రయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక పోలీస్ బలగాలతో కలిసి ఏటూరునాగారం సిఐ, మంగపేట ఎస్సై ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించేందుకు పోలీసులు వెళ్లారు. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఖాకీ దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఒ ప్రత్యేక ప్రాంతంలో సమావేశమై ఉన్నట్లు తారసపడింది. దీంతో పోలీసులు నక్సల్స్‌గా భావించి వారిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లగానే నక్సల్స్ ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. పారిపోతున్న వారిని వెంబడించగా అందులో ముగ్గురు నక్సల్స్ మూడు తుపాకులతో దొరికారు. నక్సల్స్ ఆశ్రయం తీసుకున్న ఆ ప్రాంతంలో వెతికితే వారి విప్లవ సాహిత్యం కొన్ని పుస్తకాలు, జెండాలు తదితరాలు వదిలి పారిపోయారు. సంఘటనా స్థలంలో 1 ఎస్బిబిఎల్ తుపాకి, 20 ఎస్‌ఎల్‌ఆర్ రౌండ్స్, 8 ఎంఎం రౌండ్స్, 122 ఎస్బిబిఎల్ రౌండ్స్, 82 ఖాళీ మ్యాక్జిన్లు, 5 కిట్‌బ్యాగులు, 6 సెలఫోన్లు, 7 పవర్ బ్యాంకులు, 2 గ్రైనేడ్స్, రూ.65 వందల నగదు, తుపాకులు,కిట్‌బ్యాగులు, వంటపాత్రలు, వంట సామా గ్రి, స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిలో సిపిఐ(ఎంఎల్) సిపి బాట జిల్లా కమిటీ సభ్యుడు మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామానికి చెందిన ధర్మవరపు యాకయ్య అలియాస్ మోహన్, మంగపేట, ఏటూరునాగారం, ఏరియా దేశానికి చెందిన డిప్యూటి దళ కమాండర్ ఇదే మండలంలోని పొద్మూరుకు చెందిన ధార అశోక్ అలియాస్ శ్రీకాంత్, దళ సభ్యుడు కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కావిరి నర్సింగరావు అలియాస్ దిలీప్ ఉన్నట్లుగా తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దళాలు : అదుపులోకి తీసుకున్న ముగ్గురు నక్సల్స్‌ను విచారించగా తాము సిపిఐ(ఎంఎల్) సిపి బాట నక్సల్స్‌మని, తమ పార్టీని 2017 జులై 24న కరీంనగర్ జిల్లాకు చెందిన కూర రాజన్న, నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన బొమ్మాని నర్సింహులు, అలియాస్ విశ్వనాథం, అలియాస్ ఆనంద్ స్థాపించారని చెప్పినట్లు తెలిపారు. కేవలం 15 మంది దళ సభ్యులతో ప్రారంభమైన ఈ నక్సల్స్ పార్టీ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నాలుగు దళాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పంచాయతీలు నిర్వహించడం, సెటిల్‌మెంట్లు చేయడం బెదిరించి డబ్బు, వసూళ్లకు పాల్పడడం వంటి కార్యక్రమాలకు, సివిల్ తగాదాల్లో తలదూర్చడం, పోడు భూముల వ్యవహారంలో తలదూర్చడం ఈ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పార్టీ స్థాపితమైందని చెప్పారు. ముగ్గురు నక్సల్స్ అరెస్ట్‌తో ఏటూరునాగారం, మంగపేట ఏరియా కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొన్నారు.

Comments

comments