Search
Saturday 21 April 2018
  • :
  • :

పేదల బియ్యం..మాయాజాలం

rice* భారీ ఎత్తున రీసైక్లింగ్
* మహారాష్ట్ర సరిహద్దులో స్థావరాలు
* కొంత మంది లబ్ధిదారులే అసలు సూత్రధారులు
* పక్కదోవ పట్టిస్తున్న వ్యాపారులు

మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో   జిల్లావ్యాప్తంగా పేదలకు పంపిణీ చేసే సబ్సిడీ బియ్యా న్ని పెద్ద ఎత్తున కొంతమంది వ్యాపారులు రీసైక్లింగ్ చేస్తూ లక్షల రూపాయల సర్కారు ధనానికి గండి కొడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యమే కాకుండా ఆయా ప్రాంతాల్లోని మండల స్థాయి స్టాక్(ఎంఎల్‌ఎస్) పాయింట్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యం గా రేషన్ దుకాణాలలో పేదలకోసం పంపిణీచేస్తున్న బియ్యాన్ని సదరు లబ్దిదారులే కొంత మంది దళారులకు విక్రయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ దళారులు రేషన్ దుకాణాల వద్ద తిష్ట వేస్తున్నట్లు చెబుతున్నారు. కొంత మంది లబ్ధిదారులు తమ బియ్యాన్ని వీరికి పది నుంచి పదిహేను రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు.  విక్రయిస్తున్న బియ్యాన్ని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో వ్యాపారులు భద్రపరుస్తున్నట్లు సమాచారం. ఒకే సారి రెండు మూడు లారీల బియ్యాన్ని మహారాష్ట్ర సరిహద్దుకు దాటిస్తున్నారని అంటున్నారు. అక్కడ కొన్ని రైస్ మిల్లులలో ఈ దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యంగా రీసైక్లింగ్ చేస్తూ మళ్లీ వాటిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు తరలిస్తున్నారని అంటున్నారు. గత కొన్ని నెలల నుంచి బియ్యం వ్యాపారులు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ సన్నబియ్యం పేరిట ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ముఖ్యంగా నిర్మల్, ఖానాపూర్, భైంసా, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర చోట్ల దొడ్డు బియ్యం రీసైక్లింగ్ దందా మాఫియాను తలపించే విధంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో రూపాయికి కిలో బియ్యం అందిస్తుండడం అలాగే అర్హతలు లేని వారికి, ఆదాయం పన్ను చెల్లించే వారికి తెల్ల రేషన్ కార్డులుండడంతో వారు తమకందే బియ్యాన్ని వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు పేర్కొంటున్నారు. అర్హులైన నిరుపేదలంతా దొడ్డు బియ్యాన్నే వినియోగిస్తుండగా, మధ్య తరగతికి పైవారంతా ఈ దొడ్డు బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారని అంటున్నారు. ఇదిలాఉండగా కొన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కూడా దొడ్డు బియ్యం అక్రమ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యంను తూకం పేరిట బురడీ కొట్టిస్తూ ఈ ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ వ్యాపారులు కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారని అంటున్నారు. బహిరంగంగా ఈ అక్రమ దందా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులకు తోడు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం షరా‘మాములు’గా మారిందని అంటున్నారు. ఇటీవల నిర్మల్ ప్రాంతంలో ఇలా రీసైక్లింగ్ కోసం భద్రపర్చిన వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన ఉదంతం ఈ దందా తీవ్రతను, అధికారుల నిర్లిప్తతను వెల్లడిస్తుందని అంటున్నారు.

Comments

comments