Search
Monday 23 April 2018
  • :
  • :

కొత్త జిల్లాలపై మళ్లీ ఉత్కంఠ

map

నిర్మల్ జిల్లాను రద్దు చేస్తారంటూ… జోరుగా ప్రచారం 

మనతెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో   జిల్లాల ఏర్పాటు వ్యవహారం మళ్లీ ఉత్కంఠకు దారితీస్తుంది. గత రెండు రోజుల నుంచి ప్రసార మాద్యమాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న కథనాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాను కొత్త జిల్లాల జాబితా నుంచి తొలగించబోతున్నారని కథనాలు వెలువడడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది దాటిపోయినప్పటికీ అడపాదడపా ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక పరీక్ష విషయంలో నాలుగు కొత్త జిల్లాలను ప్రాతిపదిక చేసుకోవడం వివాదాస్పదమవడమే కాకుండా ఈ అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించి ఆ నియామకాన్ని రద్దు చేయించారు. దీనికి తోడుగా పాత పది జిల్లాలను ప్రాతిపదిక చేసుకోవాలన్న ఉత్తర్వులను కోర్టు నుంచి పొందారు. అప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటు విషయంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాల ఏర్పాటుపై వెనుకడుగు వేసేందుకు సన్నద్దమవుతున్నట్లు వెలువడిన కథనాలు సందేహాలకు బలం చేకూర్చుతున్నాయని అం టున్నారు. అయితే మొదటి నుంచి కూడా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు కాగానే నిర్మల్ పేరు పరిశీలనలోకి రాకపోవడం గమనార్హం.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాలను కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు. ఆ తరువాత అనూహ్యంగా నిర్మల్ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై స్థానిక అధికార పార్టీ నేతలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, స్థానికులు ఆందోళనలు చేయడంతో కొత్త జిల్లా వ్యవహారం బలపడింది. దీనికి తోడుగా ప్రభుత్వం సైతం నిర్మల్‌ను జిల్లాగా చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం ఆ తరువాత జిల్లా ఏర్పాటవడమే కాకుండా కొత్త యంత్రాంగం సైతం విధులను చేపట్టారు. కలెక్టర్, ఎస్‌పిలతో పాటు మిగతా అధికారులంతా కొలువు తీరడమే కాకుండా కొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. దాదాపు 15 నెలలు గడిచినప్పటికీ పరిపాలన గాడిన పడుతున్న క్రమంలో నిర్మల్ రద్దు వ్యవహారంపై ప్రచారం మొదలవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాల విభజనకు అంగీకరించకపోవడమే కాకుండా రాజ్యాంగం ప్రకారం గుర్తింపునివ్వకపోవడంతోనే నిర్మల్ జిల్లా ఏర్పాటు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చన్న చర్చ జరుగుతుంది. అయితే స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ ప్రచారాన్ని కొట్టి వేస్తున్నారు. ఇప్పటికే పరిపాలన గాడిన పడడమే కాకుండా కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణాలకు నిధులు సైతం విడుదల కావడం, టెండర్ ప్రక్రియ పూర్తి కావడం జరిగిపోయిందని ఈ సమయంలో జిల్లా ఏర్పాటు రద్దు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments