Search
Sunday 27 May 2018
  • :
  • :

విపత్తుల బాధ్యత ప్రభుత్వాలదే

భూమి వాడకంలో అనాలోచితంగా మనం వ్యవహరించడంవల్ల నీటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట ఏర్పడుతోంది. ముఖ్యంగా మౌలిక సౌకర్యాల కల్పన పథకాలకు ఆర్థిక వృద్ధి లక్షంతో అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి దాపురిస్తోంది. ఇటీవలే ఓఖీ తుపాను వచ్చి వినాశం ఇలా ప్రకృతి వైపరీత్యం వచ్చిన ప్రతిసారి అవే పాఠాలు మనకి ఎదురవుతున్నాయి. కానీ మనం వాటి నుంచి ఏమీ నేర్చుకోవడం లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహాయక సంస్థలు ఓఖీ తుపాను నేపథ్యంలో ఒకరినొకరు అభినందించుకొంటూ సహాయక చర్యల ఫొటోలను ట్వీట్ చేసుకున్నాయి. అయినప్పటికీ అసలు ఈ వైపరీత్యం సంభవించకుండా దాటవేసే వీలు లేనేలేదా అన్న ప్రశ్న మిగిలిపోతోంది.
ఓఖీ విషయంలో ప్రభుత్వ విపత్తుల యాజమాన్య నిర్వహణలో మూడు లోపాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. మొదటిది తుపాను హెచ్చరిక ఆలస్యం కావడం. రెండు అప్పటికే సముద్రంలోకి వందల మంది జాలర్లు ప్రవేశించడంవల్ల ఈ హెచ్చరిక పనికి రాకుండాపోవడం. మూడు ప్రభుత్వ భారీ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు నీటి వనరులపై కట్టడంవల్ల అవి మూసివేయబడి భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు ముంచెత్తాయి. 2015లో చెన్నైలో జల ప్రళయానికి అదే కారణం. ఓఖీ కరాళ నృత్యానికి 12 గంటల ముందు సముద్రం పోటెత్తి తొలి సంకేతం ఇచ్చింది. నవంబర్ 29న సముద్ర కల్లోలం హెచ్చరికను జారీ చేశారు. అదే రోజు అర్ధరాత్రి దాకా సముద్రంలో తీవ్ర వాయు గుండం నెలకొంది. అది మరునాడు తెల్లవారు జామున తుపాను కింద రూపాంతరం చెందింది.

ఎన్‌ఎండి తప్పు లేదనిన నిపుణుడు
సకాలంలో హెచ్చరిక ఇవ్వనందుకు కేరళ, తమిళనాడులో భారత వాతావరణ విభాగం (ఐఎండి), రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అటువంటి హెచ్చరిక కేవలం సాంకేతికపరమైన ఇచ్చింది కాదని ఐఎండి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేసిన ఎస్ రాఘవన్ చెప్పారు. అల్పపీడనం వాయుగుండంగా మారే పరిస్థితులనుబట్టి ఎంత ముందుగా హెచ్చరిక చేశామన్నది ఆధారపడి ఉంటుందని చెప్పారు. అలాగే తుపాను హెచ్చరికకు కూడా అవే పరిస్థితులు ముఖ్యమన్నారు. తీరానికి చాలా దూరంగా సముద్రంలో వాయు గుండం తుపానుగా మారితే ముందు హెచ్చరిక ఇవ్వడం సులభం. 1990లో మచిలీపట్నం తుపాను హెచ్చరికను ఐదు రోజుల ముందుగా ఇవ్వడం అందుకే సాధ్యపడింది. దానివల్ల భారీ ఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యమయింది. ఓఖీ విషయంలో అల్పపీడనం వాయు గుండంగా, తరువాత తీవ్ర తుపానుగా ఏర్పడడం కన్యాకుమారికి దక్షిణాన 60 కి.మీ. దూరం లో (తీరానికి దగ్గరగా) సంభవించింది. అందుచేత బాగా ముందు హెచ్చరిక చేయకపోవడం ఐఎండి తప్పిదం కాదని రాఘవన్ వాదిస్తున్నారు. అయితే రెండు రోజుల ముందు హెచ్చరిక వెలువడి ఉంటే ఓఖీ విధ్వంసం చాలా వరకు తప్పేదని ఆయన ఒప్పుకున్నారు. సముద్ర కల్లోలం హెచ్చరికను తమిళనాడులోని ఇతర ప్రాంతాల జాలర్లు పట్టించుకొన్నంతగా కన్యాకుమారి జాలర్లు పట్టించుకోలేదు. దానికి కారణమేమిటంటే కల్లోల సముద్రం కేవలం ఒక ‘న్యూసెన్స్’ తప్ప వారికి మరేంకాదు. సముద్రం ఆటుపోట్లను వారు పట్టించుకోరు. కన్యాకుమారిలో జాలర్ల సంఖ్య అత్యధికం. 72 కి.మీ. తీర ప్రాంతం వెంబడి 40,000 జాలరి కుటుంబాలు అక్కడ ఉన్నాయి. సమీపంలోని జలాల్లో చేపల సంఖ్య బాగా తగ్గిపోవడం వల్ల సముద్రం లోపలికి జాలర్లు వెళ్లారు. తీరం నుండి చాలా దూరం సముద్రంలోకి చేపల వేట కోసం జాలర్లు వెళ్లిపోవడంతో నష్ట నివారణ వీలుపడలేదు. సాధారణంగా సముద్రంలో చేపల వేట నెలలో సగటున 8 నుంచి 10 రోజుల పాటు జరుగుతుంది. 12 నుంచి 15 మీటర్ల పొడవుగల చెక్క పడవలు, మర పడవలు, తెడ్లతో ఈ వేట సాగుతుంది. వాటిలో సరియైన సౌకర్యాలు ఉండవు. నవంబర్ 29 నాటి హెచ్చరిక కొందరు జాలర్లను సముద్రానికి దూరంగా ఉంచగలిగింది.

తాజా తెలిసే వీలు లేదు
అయితే అప్పటికే కొన్ని రోజులపాటు చేపల వేటపై సముద్రంలోకి వెళ్లిన వారికి ఆ హెచ్చరిక అందే మార్గం లేదు. ఇక్కడే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం తీవ్ర విమర్శలకు గురి అయింది. అంతర్జాతీయ సముద్ర జల వనరుల చట్టాల నుంచి మనం మన జలాల భద్రతా చట్టాలను అరువు తెచ్చుకొన్నాం. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా వాటిలో మార్పులు చేర్పులు చేయలేదు. అంతర్జాతీయ చట్టాలు భారీ ఎత్తున యాంత్రిక పద్ధతుల్లో చేపలు పట్టడానికి సంబంధించినవి. మన దేశంలో అతి చిన్న పడవలలో జాలరి వృత్తి కొనసాగుతోంది. కాబట్టి మన పరిస్థితులకు అంతర్జాతీయ చట్టాలు సరిపడవు. సముద్ర జల వనరుల వినియోగంపై భద్రతా నియమాలను అంతర్జాతీయ మారిటైమ్ సంఘం జరిపిన సభల్లో రూపొందాయి. అవి 20 మీటర్ల కంటే పొడవైన పడవలకు వర్తించే నియమాలు.
మన దేశంలో 90 శాతం సముద్ర మత్స సంపదను పట్టడానికి చిన్నచిన్న పడవలనే వాడే ఆనవాయితీ ఉంది. మన ప్రస్తుత చట్టాలు సముద్రం లోపల చేపల వేటకు పడవలను అనుమతించవు. ఓఖీ తుఫాను విరుచుకుపడిన తరుణంలో సముద్ర తీరం నుంచి, సమీపంలోని ఇతర పడవల నుంచి వాతావరణ హెచ్చరిక తెలుసుకోడానికి ఆ జాలరి పడవల్లో తగిన బందోబస్తు లేదు. అంటే సముద్రంలోకి వెళ్లిన జాలర్లను వారి అదృష్టానికి మనం వదలివేసినట్లు అయింది. భారీ పడవలకే సహాయ చర్యలు పరిమితం అయ్యేలా మన చట్ట నియమాలు ఉన్నాయి.
దీనికి ప్రభుత్వాలే కారణం. కన్యాకుమారి జాలర్ల వద్ద విహెచ్‌ఎఫ్ (వెరి హై ఫ్రీక్వెన్సీ) రిసీవర్లు ఉంటాయి. 56 నాటికల్ మైల్స్ (911 కి.మీ) పరిధిలో సమాచారం ఇచ్చిపుచ్చుకోడానికి అవి ఉపకరిస్తాయి. వాటి ఉపయోగం సముద్రంలో సుదూర ప్రాంతాలలో ఉండదు. ఉపగ్రహ టెలిఫొన్ సౌకర్యాలు, ఇతర పరికరాలను జాలర్లకు భద్రతా కారణాల దృష్టా అనుమతించడం లేదు. సముద్రంలో ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితి గురించిన తాజా సమాచారం అందించే ఏర్పాట్లు చేయాలని కన్యాకుమారి జాలర్లు అధికారులను చాలా కాలం నుంచి వేడుకొంటున్నారు. అయినా లాభం లేకపోయింది. ‘భారత దేశం ‘సూపర్ పవర్’ అని చాటుతారు. కానీ మేము మాత్రం అత్యంత పురాతన పద్ధతుల్లో చేపల వేట సాగిస్తున్నాం’ అని కురుంపనాయ్ బెర్లిన్ అనే జాలరి వాపోయారు.
మన పట్టణాల్లో విస్తార ప్రాంతాలు గట్టి వానపడితే నీట మునిగిపోతాయి. ఈ పరిస్థితికి వాతావరణ హెచ్చరికలు లోపించడం కారణం కాదు. భూమి వాడకంలో అనాలోచిత పద్ధతులే ఈ ముంపునకు దారితీస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ వాణిజ్య మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నట్లు అందరూ భావిస్తారు. కానీ అవే నీటి స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకొని తరచూ ముంపునకు కారణమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా ’ పథకం ప్రచారానికి ఈ మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు ఎంతగా ఉపయోగపడుతున్నా సముద్ర తీర పర్యావరణానికి ఆ ప్రాజెక్టులు చావు బాజా వినిపిస్తున్నట్లు కన్యాకుమారి, చెన్నై వద్ద ఎన్నోర్ జాలర్లు చెబుతారు. సాగర్ మాల భారీ రేవు, భారత్ మాల రోడ్, రైలు మార్గాలు అటువంటి వినాశకర ప్రాజెక్టులను వారు చెబుతున్నారు. ఓఖీ తుపానుకు భారీ వర్షాలు తోడై జాలర్లు నివసించే కేరళ, తమిళనాడు ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురయ్యాయి. ఈ పరిస్థితికి మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు కారణమని జాలర్లుగట్టిగా విమర్శిస్తున్నారు.

                                                                                                                                                                         * నిత్యానంద్ జయరామన్ 

Comments

comments