Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ రివ్యూ

spgr

గత ఏడాది ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమేడియన్ సప్తగిరి కథానాయకుడిగా చేసిన రెండో ప్రయత్నమే ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం  గురువారం విడుదలైంది. హిందీ హిట్ సినిమా ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమిది.

సినిమా కథ: ఎల్‌ఎల్‌బి పూర్తిచేసి తన ఊరి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సప్తగిరి (సప్తగిరి)కి అక్కడ వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలా కాదని పెద్ద లాయర్ అయిపోదామని హైదరాబాద్ వస్తాడు సప్తగిరి. ఇక్కడ అతని దృష్టి అప్పటికే ముగిసిన ఒక కేసుపై పడుతుంది. ఒక బడాబాబు తప్పతాగి రోడ్డు మీద నిద్రపోతున్న ఆరుగురిపై కారు ఎక్కించి వారి చావుకు కారణమైన కేసు అది. ఈ కేసును రాజ్‌పాల్ (సాయికుమార్) అనే పెద్ద లాయర్ టేకప్ చేసి ఆ బడా బాబును బయటకు తీసుకువస్తాడు. కోర్టు తీర్పు కూడా వచ్చేశాక ఈ కేసును తిరగదోడుతాడు సప్తగిరి. దీంతో అతనికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఆ ఇబ్బందుల్ని అతను ఎలా అధిగమించాడు..? ఈ కేసులో రాజ్‌పాల్ మీద అతను ఎలా విజయం సాధించాడు అన్నది మిగతా కథ.
విశ్లేషణ: సినిమాలో ప్లస్ పాయింట్ ఏమిటంటే సప్తగిరి టేకప్ చేసిన కేసులో వాదన, తీర్పు అనే అంశాలే. సప్తగిరి తాను రీ ఓపెన్ చేయించిన కేసులోని అసలు వాస్తవాల్ని తెలుసుకొని ఆ కేసులో బాధితులకు న్యాయం అందించడానికి పోరాడే ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విచారణ సమయంలో పెద్ద లాయర్ రాజ్‌పాల్ (సాయికుమార్)ను సప్తగిరి ఎదిరించే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అహం, తెలివితేటలు కలిగిన లాయర్‌గా సాయికుమార్ నటన చాలా బాగుంది. ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లో పేదవారికి న్యాయం జరగాల్సిందే అంటూ సాగే కోర్టు సన్నివేశాల్లో భావోద్వేగాలు ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేటట్లు చేశాయి. సినిమాలో కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఇంటర్వెల్ ముందు హీరోకు కనువిప్పు కలగడానికి కారణమైన చిన్నపాటి ట్విస్ట్ ఆకట్టుకుంది. జడ్జిగా శివప్రసాద్ నటన బాగుంది. సినిమాలో సప్తగిరి డ్యాన్సులతో అదరగొట్టేశాడు. అయితే సినిమాలో అక్కడక్కడా కథనం పెద్దగా ఆకట్టుకోలేదు. పెద్ద లాయర్ రాజ్‌పాల్‌ను మొదటి నుంచి చాలా ఇంటెలిజెంట్‌గా చూపించి చివరకు సింపుల్‌గా తేల్చేయడంతో హీరో పాత్రలో ఎలివేషన్ తగ్గింది. క్లైమాక్స్‌లో దర్శకుడు చరణ్ లక్కాకుల టాలెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తానికి హీరోగా సప్తగిరి చేసిన రెండో ప్రయత్నం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందనే చెప్పాలి.

Comments

comments