Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆడపిల్లల మైండ్ సెట్ మారాలి

Harivillu-image

కథ, కథానిక, నవల, కవిత, వ్యాసం, సమీక్ష ఇలా అనేక ప్రక్రియలు సాహిత్యమనే సముద్రంలో ఉంటే, ఆ సముద్రాన్నంతటిని తన గుప్పెట్లో ఇముడ్చుకుని అవసరం మేరకు వాటిని పాఠకులకు పంచిపెట్టే అత్యాధునిక రచయిత్రి కుప్పిలి పద్మ. తను వేరు సాహిత్యం వేరుగా కాకుండా తనే సాహిత్యమై నడిచే కుప్పిలి పద్మ స్త్రీవాద రచయిత అనిపించుకున్నా, పురుషద్వేషం చూపకుండా ఆయా అంశాలపట్ల సమస్యల మీద మాత్రమే తన రచనలను ఎక్కుపెట్టి స్త్రీవాద రచయితల్లో భిన్నమైన శైలీ విన్యాసం చేశారు. వాసిరెడ్డి సీతాదేవి అవార్డు అందుకున్న సందర్భంగా ఆమెతో మన తెలంగాణ మాటా ముచ్చట..

స్త్రీవాద రచనల వల్ల సమాజంలో ఏమైనా మార్పులొస్తున్నాయా?

సమాజంలో అనేక పార్శాలుంటాయి. అనేక రకాల మానసిక ధోరణులుంటాయి. పాఠకులకు తమ రచనల ద్వారా మేలు జరగాలనే రచయితలు ఆలోచిస్తుంటారు. ఆడపిల్లల మైండ్‌సెట్ మారాలి. ఇంటా బయటా ఎక్కడున్నా సరే మహిళలకు తమ మీద తమకు ఆత్మవిశ్వాసం, నమ్మకం, ధైర్యం ఉండాలి. అలా వారి ఆలోచనా ధోరణులు మారడానికి కొన్ని కథలు వారి మనసులు, ఆలోచనలపై టార్చిలైట్‌లాగా పనిచేస్తాయి.

ఇప్పుడు వస్తున్న కథలపై ..
కథలు ఎప్పుడు కూడా ఎవరిక్కావలసిన కథలు వారికి దొరుకుతుంటాయి. కొంతమందికి హాస్యకథలంటే మక్కువ. మరికొంతమందికి ప్రేమకథలు ఇష్టం. ఇంకొంతమందికి అపరాధ పరిశోధనాత్మక కథలంటే ఇంట్రెస్ట్. అంటే మన దృక్పథాల నుంచి మనకు కావలసిన సాహిత్యాన్ని వెతుక్కుంటాం. కొన్ని కథలు ఏం చేస్తాయంటే మన ఆలోచనా ధోరణిలో మార్పును తీసుకొస్తాయి. అందుకని కథలంటే ఒకే రకంగా ఉండవు. కథలు రకరకాల విషయాల్ని మాట్లాడతాయి. ఒకచేతి నుంచి మరో చేతికి , ఒక తరం నుంచి మరో తరానికి అందించుకుంటూ వెళ్తాయి కొన్ని కథలు. కథకులు కాలంతో పాటు ప్రయాణం చేస్తుంటారు. కొన్ని కథలు ఆ క్షణానికి మాత్రమే నిలుస్తాయి వెళ్లిపోతుంటాయి.

ఇప్పటి యువత ధోరణుల్లో స్త్రీల పట్ల ఏమైనా మార్పు వచ్చిందంటారా?
నా కథలు చదివిన చాలా మంది మగపిల్లలు, వారికి స్త్రీల పట్ల ఉన్న ఆలోచనా ధోరణి మార్చుకున్నారు. సహోద్యోగుల పట్ల, ఆడపిల్లల స్నేహాలు, మహిళలు కోరుకునే స్పేస్ లాంటి విషయాలకు విలువ ఇచ్చే మగవారున్నారు.

కథలు అందరిలో చొచ్చుకుపోతున్నాయా?
నిజాయితీగా వప్పుకోవాల్సిందేమంటే కథలు సినిమాల్లాగా అందరిలో చొచ్చుకుపోవు. కథలు చదివేవాళ్ల శాతం తక్కువగా ఉంటుంది. అందుకు కారణాలున్నాయి. కళలు, సాహిత్యం పట్ల అభిరుచి ఉండాలి. అక్షరాస్యులై ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్లు తక్కువుంటారు.

కథ ప్రభావం పాఠకులపై ఎలా ఉంటుంది?
ఒక కథ చదివి దాన్ని భద్రపరుచుకోవాలంటే ఆ కథ ఆ పాఠకుడిపై ప్రభావాన్ని చూపగలగాలి. ఒక చెప్పరాని ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, కుతూహలాన్ని, ఒక కొత్తప్రపంచాన్ని పాఠకుని అంతరంగంలో ఆవిష్కరిస్తే, ఆ కథ ఆ పాఠకునితో ప్రయాణిస్తుంది. అది లేనప్పుడు చదివి పక్కకు పడేస్తారు. దాచిపెట్టుకోరు. అట్లా రాయగలిగే కథల్ని రైటర్ పాఠకులకు అందించాలి.

మీ శైలిలో చలంగారు కనిపిస్తుంటారు?
శైలి ఇలాంటి పదాలన్నీ లోతుగా తెలిసేటప్పటికే నేను రాసేస్తున్నాను. నాకు దాని మీద పెద్దగా తెలీదు. చిన్నప్పటి నుంచీ నాకొక రాసే శైలి వచ్చేసింది. కొంతమంది చెప్తుంటారు చలంగారి శైలి అని. నేను రాసే దాంట్లో కూడా రీడబిలిటీ ఉండటం, సౌందర్యాత్మకంగా, సులభంగా ఉండటం వల్ల కూడా ఆ పోలిక వచ్చి ఉండొచ్చేమో. చలంగారు ముందు చూపున్న రచనలు చేశారు. అతని అక్షరాలలో రీడబిలిటీ ఉంటుంది. అందుకే ఆ పోలిక చెప్తుంటారు. పెద్దలతో పోల్చినప్పుడు సంతోషంగా ఉంటుంది కదా!

మీ రచనల్లో ఎక్కువగా ప్రకృతి కనిపిస్తుంటుంది. మీకు వర్షం అంటే అంత ఇష్టమా?
నాకు చాలా ఇష్టమైన కాలం చలికాలం. అందుకే ‘మంచుకురిసిన మంత్రనగరి సరిహద్దుల్లో..’ కథల నిండా చలికాలం ఉంటుంది. మంచుపూల వాన, ఆకాశనీలిమ వీటన్నింట్లో మంచుతో పెనవేసుకుపోయిన ఒక రమ్యత ఉంటుంది. రుతువులు మారేటపుడు గాలిలో చిన్న మార్పు వస్తుంది .ఆ మార్పును చాలా ఆస్వాదిస్తాను. ప్రకృతిని చూస్తూ గడిపేయడం ఇష్టం. పనిలో భాగంగానే అవికూడా ప్రయాణిస్తుంటాయి. అవన్నీ నా కథల్లోకి వచ్చేస్తాయి.

సోషల్ మీడియా ప్రభావం కథపై పడుతోందా?
చాలానే. సోషల్ మీడియా వల్ల చాలా మందికి పుస్తకాల గురించి తెలుస్తోంది. అప్‌డేట్ అవుతున్నారు. కానీ దీనికంటే ఉపయోగకరం లైబ్రరీనే. పట్టణాల్లో, పల్లెల్లో కూడా గ్రంథాలయాలుండాలి. స్కూల్లో వారానికి ఒకసారి లైబ్రరీ అవర్‌గా పెట్టాలి. అప్పడు పిల్లల్లో అభిలాష ఏర్పడుతుంది.

వాసిరెడ్డి సీతాదేవి అవార్డు తీసుకున్నందుకు ఎలా ఫీలవుతున్నారు?
సీతాదేవిగారు సామాజికంగా, స్త్రీల పరంగా, రాజకీయంగా చాలా ఒక ఇన్‌సైట్‌తో రచనలు చేశారు. అలాంటి రైటర్‌కి సంబంధించిన అవార్డు రావడం అనేది ఆనందంగా ఉంది. మనం చేస్తున్న పనికి గుర్తింపు రావడమే కాకుండా అదొక గౌరవంగా భావిస్తున్నాను. సీతాదేవి గారికి నా రచనలంటే ఇష్టం. ఆమె ఒక మాట చెప్పేవారు ‘గుండెపుష్టి, హృదయ సౌందర్యం ఉన్న రచయితవి నువ్వు’ అని.

ఇప్పటివరకు ఎన్ని కథలు రాశారు?
కథలు వంద వరకు, అహల్య, మహి అనే రెండు నవలలు రాశాను. కవిత్వం రాశాను. కాలమ్స్ చాలా రాస్తుంటాను. ఇప్పటివరకూ ఎవ్వరూ రాయని ప్రేమలేఖలు రాశాను. అవి చాలా పాపులర్ అయ్యాయి.

                                                                                                                                                                                మల్లీశ్వరి వారణాసి

Comments

comments