Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

కష్టాల్లో లంకేయులు

లంక  410, ప్రస్తుతం 31/3, గెలుపు దిశగా భారత్, చివరి టెస్టు

Team-India

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 410 పరుగుల భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులకు ఆలౌటైంది. తర్వాత కెప్టెన్ చండీమల్ 164 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ 52.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని లంక ముందు 410 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన లంకకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ సదీరా సమరవిక్రమ (5), దిముత్ కరుణరతె (13) పెవిలియన్ చేరారు. అంతేగాక నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బౌలర్ సురంగ లక్మల్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి ఆరో ఓవర్‌లోనే సమరవిక్రమను పెవలియన్ పంపించి భారత్‌కు పైచేయి అందించాడు. అప్పటికి లంక స్కోరు 14 పరుగులు మాత్రమే. కొద్ది సేపటికే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కరుణరత్నె ఔటయ్యాడు. అదే ఓవర్‌లో లక్మల్ కూడా వెనుదిరిగాడు. దీంతో లంక 31 పరుగుల వద్దే మూడో వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ధనంజయ డిసిల్వా(13), మాథ్యూస్ (౦) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పించుకోవాలంటే లంక మరో 379 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోవడం, పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారడంతో లంకకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.
రహానె మరో ‘సారి’…
రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. భీకర ఫాంలో ఉన్న ఓపెనర్ మురళీవిజయ్ ఈసారి నిరాశ పరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి లక్మల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్య రహానె తన పేలవమైన ఫాంను ఈసారి కూడా కొనసాగించాడు. రెండు ఫోర్లతో పది పరుగులు చేసి పెరీరా చేతికి చిక్కాడు. ఈ సిరీస్‌లో రహానె ఘోర వైఫల్యం చవిచూస్తున్న విషయం తెలిసిందే. కనీసం నాలుగో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తాడని భావించిన వారికి నిరాశే మిగిల్చాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ద్వారా సిరీస్‌లో తొలిసారి రెండంకెలా స్కోరును అందుకున్నాడు. సహచర ఆటగాళ్లు సెంచరీలతో హోరెత్తిస్తున్న ఈ సిరీస్‌లో రహానె చెత్త బ్యాటింగ్‌తో అందరిని విస్మయానికి గురి చేశాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతని బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఆదుకున్న పుజారా, ధావన్
ఒక దశలో 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్, స్టార్ ఆటగాడు, నయా వాల్ చటేశ్వర్ పుజారా ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచే పుజారా దూకుడుగా ఆడాడు. ధావన్ ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేయగా, పుజారా దూకుడుగా ఆడుతూ స్కోరు పరిగెత్తించాడు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ కష్టాల్లోంచి గట్టెక్కింది. పుజారా తన స్వభావానికి భిన్నంగా చెలరేగి ఆడాడు. ఒక దశలో తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరోవైపు బర్త్‌డే బాయ్ ధావన్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ముందుకు సాగాడు. ఇదే క్రమంలో ఇద్దరు మూడో వికెట్‌కు వేగంగా 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో పుజారా చేసిన పరుగులే 36 ఉండడం విశేషం. డ్రింక్స్ విరామ సమయానిక భారత్ స్కోరు రెండు వికెట్లకు 102 పరుగులకు చేరింది. కాగా, కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 66 బంతుల్లో ఐదు ఫోర్లతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ధావన్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు.
కోహ్లి, రోహిత్ దూకుడు…
మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి తన భీకర ఫాంను రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించాడు. లంక బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఒకటి, రెండు పరుగులు తీస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. అతనికి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ స్కోరు 44.5 ఓవర్లలోనే 200కి చేరింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 58 బంతుల్లో మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి గమాగె బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 49 బంతుల్లోనే ఐదు బౌండరీలతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా భారత స్కోరు ఐదు వికెట్లకు 246 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. అప్పటికే రోహిత్ (50), రవీంద్ర జడేజా (4) క్రీజులో ఉన్నారు.

Comments

comments