Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

కన్నీరే మిగిలింది

cow

*అన్నదాతకు తప్పని కష్టాల సేద్యం
*అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలం
*రైతుకు ధీమా ఇవ్వని బీమా

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : 2017 సంవత్సరం వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది. రబీ సీజన్‌లో అకాల వర్షాలు, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అనావృష్టి, తర్వాత అతివృష్టితో పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఖరీఫ్‌లో వరుస వర్షాలతో చేతికందే పంటలు నేలపాలయ్యాయి. వరి పంటకు దోమ కాటుతో దిగుబడి బాగా తగ్గిపోయింది. పంటలకు సకాలంలో రుణాలందుతాయని భావించిన రైతులకు బ్యాంకర్ల నుంచి మొండిచేయే దక్కింది. చివరకు తమకు ధీమాగా వుంటుందని చేసిన బీమా సైతం సకాలంలో చేతికి రాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు లక్ష ఎకరాల్లో పత్తి అధికంగా సాగు జరిగింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 70 వేల ఎకరాలు అదనంగా సాగైంది. గత సంవత్సరం సిద్దిపేట జిల్లాలో లక్షా 20 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఈసారి లక్షా 90 వేల ఎకరాల్లో సాగు చేశారు. సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరం లక్షా 70 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే ఈసారి దాదాపు రెండు లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వాణిజ్య పంటలకు నిలయమైన జహిరాబాద్ ప్రాంతంలో అల్లం, పసుపు, చెరకు పంటలు సాగు చేసిన రైతులు ఈసారి పత్తి అత్యధికంగా సాగు చేశారు.
తగ్గిన సోయాబీన్, మొక్కజొన్న పంటల దిగుబడి: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో మురిపించిన వర్షాలు తర్వాత కనుమరుగు కావడంతో మెతుకుసీమలో పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా సోయాబీన్, మొక్కజొన్న పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపలేదు. జులై నెలలో కేవలం పది రోజుల్లో మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో బోరుబావుల వద్ద మాత్రమే పంటలు సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో మొక్కజొన్న లక్షా 60వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. గత సంవత్సరం 2లక్షల 25వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సంవత్సరం సాగు శాతం సగానికి పడిపోయింది. మెదక్ జిల్లాలో ఈ సంవత్సరం మొక్కజొన్న 48వేల 100 ఎకరాల్లో సాగు చేయగా, సోయాబీన్ మూడు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాలో మొక్కజొన్న పంట లక్షా 80వేల ఎకరాల్లో సాగు చేయగా, సోయాబీన్ 75వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కాగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల నుంచి సోయాబీన్, మొక్కజొన్న పంటలను రక్షించుకొనేందుకు రైతులు నానా తంటాలు పడాల్సివచ్చింది.
ధీమా ఇవ్వని బీమా : పంటల బీమా ( పిఎం ఫసల్ బీమా యోజన పథకం) పథకం రైతులకు ఆశించిన స్థాయిలో ధీమా ఇవ్వలేకపోతోంది. బీమా సంస్థలు సకాలంలో బీమా డబ్బులు చెల్లించకపోవడంతో అన్నదాతలకు కష్టాలు తప్పలేదు. పంట నష్టం జరిగిన తరుణంలో సంబంధించిన కంపెనీలు బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో పంట నష్టం జరిగిన సందర్భాల్లో రైతులకు అందాల్సిన బీమా డబ్బులు అందలేదు. 2015-16 సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో 38,816 మంది రైతులు 28,365 హెక్టార్లలో వివిధ పంటలకుగానూ 2కోట్ల 91లక్షల 45వేల 730 రూపాయల బీమా డబ్బులు చెల్లించారు. కాగా గత సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాభావానికి తోడు సెప్టెంబరు నెలలో వర్షాలు, వరదలు రావడంతో రైతులు పంట నష్టం చవిచూడాల్సి వచ్చింది. అధికారులు మాత్రం పంటలు నష్టపోయిన వివరాలు సేకరించేందుకు నెలల తరబడి జాప్యం చేయడం వల్ల బీమా డబ్బులు సకాలంలో రైతు చేతికందలేదు.
రబీకి రైతన్న సన్నద్ధం : రబీ సాగు కోసం రైతన్నలు సన్నద్ధ్దం అవుతున్నారు. రబీ సీజన్‌లో కూడా పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం వుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రధానంగా వరి పంటతో పాటు మొక్కజొన్న పంటలు సాగు చేయగా పత్తి పంట అంచనాలకు మించి సాగు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఆయా జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండుకుండలా మారాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు పరిధిలో జనవరి 1వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్టు నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించడంతో సంగారెడ్డి జిల్లాలోని రైతులు రబీ కోసం సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు కూడా ప్రణాళికలు తయారు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశారు. రబీ సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసేందుకు మొత్తం 19160 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేసేందుకు సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో వుంచారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల మేరకు సబ్సిడీపై రైతులకు అందజేయనున్నారు.

Comments

comments