Search
Friday 20 April 2018
  • :
  • :

చరిత్ర పై తెలుగు సంతకం

hARIVILLU-IMAGE

పురాతన నాణాలు – తెలుగు జాతి ఘన కీర్తికి ఆనవాళ్ళు. తెలుగు జాతి చరిత్రను తిరగ రాయాల్సివస్తే అతడితోనే మొదలుపెట్టాలి. అతడే గోబద. ఇతడే తెలుగు జాతి తొలి రాజు. అశోకుడు(క్రీ. పూ. 268-232), చంద్ర గుప్తుడు, హర్షవర్ధనుడు అని గొప్పగా చెప్పకుంటాం. కానీ మన గోబద అందరి కంటే గ్రేట్. క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాలలో ప్రస్తుత ఉత్తర తెలంగాణాలోని కోటి లింగాల కేంద్రం (రాజధాని)గా తెలుగు నేలను ఏలిన రాజు గోబద. అందరు రాజులు, చక్రవర్తులు పంచ్ మార్క్ (సూర్యుడు, చంద్రుడు, షడ్బుజి, కొండలు, చెట్లు, జంతువులు, విల్లు, బాణం తదితర చిహ్నాలు గల నాణేలను ముద్రిస్తుంటే గోబద నాణేలపై తన పేరును కూడా ముద్రించి తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఇలా నాణేలపై అక్షరాలను ముద్రించిన తొలి భారతీయ రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. బ్రాహ్మీలిపి అక్షరాలు ఉన్న గోబద నాణేలు కోటిలింగాలలో దొరికాయి.

గోబద, సిరివయ, కామవయ, నరన, సిర కమ, సమగోప – ఈ ఆరుగురూ కోటిలింగాలను కేంద్రంగా చేసుకుని తెలుగు నేలను ఏలినవారే. వీరందరూ నాణేలపై తమ పేర్లను ముద్రించటం విశేషం. మన చరిత్ర గ్రంథాలన్నీ తెలుగువారి చరిత్రను శాతవాహనుల నుంచే ప్రారంభిస్తాయి. ఈ తెలుగు రాజుల ప్రస్తావన ఎక్కడా కన్పించదు. నాణేల ద్వారానే ఈ పేర్లు పురావస్తు శాస్త్రజ్ఞుల దృష్టికి వచ్చాయి. అంటే శాతవాహనుల కంటే ముందే మన తెలుగునేల వెలుగులు విరజిమ్మిందన్నమాట. క్రీ.పూ.321-298కి చెందిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో కొంతకాలం ఉన్న గ్రీకు రాయబారి మెగస్తనీస్ ( 350-290) రాసిన ఇండికా అనే గ్రంథంలో మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతి అని, ఆగ్నేయ దక్కనులో ఉన్న ఆంధ్రుల రాజ్యం బలవత్తరమైందని ప్రశంసించాడు.

ఆంధ్రులకు లక్ష కాల్బలం(సైన్యం), 20 వేల అశ్విక (గుర్రాలు) దళం, వేయి గజాలు (ఏనుగులు) ఉన్నాయని వారి ఏలుబడి కింద శత్రు దుర్భేద్యమైన 32 దుర్గాలు, అనేక గ్రామాలు ఉన్నాయనీ పేర్కొన్నాడు. సింగవరం, పెద్ద బొంకూరు, కొండాపూర్, కోటిలింగాల వంటి దుర్గాలు అయిఉండవచ్చు. మెగస్తనీస్ పేర్కొన్న మిగతా ఆంధ్ర దుర్గాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి? భూపొరల్లోంచి బయటకు రాకపోతే సింగవరం, కోటిలింగాల సంగతి ప్రపంచానికి తెలిసేదే కాదు.ఈ నేలలో ఇంకా ఎన్నెన్ని వింతలు దాగి ఉన్నాయో?2200 సంవత్సరాల క్రితపు గోబద (గోభద్రుడు) సిరి వయ (శ్రీ వాయు), నరన, సిరి కమ, సమ గోప(స్వామి గోపుడు) నాణాలు.

                                                                                                                                                                              వెంకటేశ్ కందుల,
                                                                                                                                                                        9347334494                             

Comments

comments