Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఈసారికి ఇంతే..

 ద్రవ్యోల్బణం ఆందోళనలతో వడ్డీ రేట్లు యథాతథం
రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో 5.75 శాతమే కొనసాగింపు
ద్రవ్యోల్బణం అంచనా 4.7 శాతానికి పెంపు :ఉర్జిత్ పటేల్

urjith-patel

న్యూఢిల్లీ: ఆర్థికవేత్తలు ఊహించినట్టుగానే ద్రవ్యోల్బణం ఆందోళనలతో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించింది. రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం అంచనాలను 4.3 4.7 శాతానికి పెంచింది. గత సమీక్షలో ఈ అంచనా 4.2 4.6 శాతంగా ఉంది. 201718 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనా 6.7 శాతాన్నే కొనసాగించగా, రెండో త్రైమాసికంలో జివిఎ(గ్రాస్ వాల్యూ యాడెడ్) 6.3 శాతంగా సూచించింది. బుధవారం ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని ఆరు సభ్యుల ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) రెండో రోజు సమావేశంలో నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (201718) ఐదో ద్వైమాసిక సమీక్ష వివరాలను ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడిస్తూ.. కీలక రెపో రేటు 6 శాతం, రివర్స్ రెపో 5.75 శాతాన్నే యథాతథంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్లు 6.25 శాతం వద్ద కొనసాగనున్నాయి. వినిమయ ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణం మధ్యకాలిక లక్షం 4 సాధించడం కోసం, అదే సమయంలో వృద్ధి రేటు పెంపునకు అండగా ఉండేందుకు రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది.
కారణాలేమిటి?
రిటైల్ ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.58 శాతంతో 7 నెలల గరిష్ఠానికి చేరింది. దీంతో ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. అదే సమయంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో 6.3 శాతం వృద్ధిచూపడం కూడా వడ్డీ రేట్ల తగింపునకు చెక్ పెట్టినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ మొదలు రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుండడంతో రెపోను తగ్గించే అవకాశాలను దెబ్బతీసినట్లు నిపుణులు చెబుతున్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం
క్రూడ్ ఆయిల్ ధరలు, కూరగాయల ధరలు 4.3 శాతం నుంచి 4.7 శాతానికి పెరుగుతాయని ఆర్‌బిఐ అంచనావేస్తోంది. వచ్చే ఏడాదిలో ఉత్పత్తిని తగ్గించాలనే ఒపెక్ నిర్ణయంతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇటీవల పెరిగాయి. ఈ రేట్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బిఐ భావిస్తోంది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాల మాఫీ, పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను పాక్షికంగా ఉపసంహరించడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. అలాగే కొన్ని వస్తువులకు జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) రేట్లు, సేవల పన్ను రేట్లలో కోత వల్ల రెవెన్యూ తగ్గడమూ ఓ కారణంగా ఆర్‌బిఐ పేర్కొంది.
కోతకు మొగ్గుచూపింది ఒక్కరే..
ఆరుగురు సభ్యుల ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) సమావేశంలో ఒక్కరు మాత్రమే వడ్డీ రేట్ల కోతకు మొగ్గుచూపారు. మిగతా సభ్యులంతా ఇతర అంశాల దృష్టా రెపో రేటును యథాతథంగానే కొనసాగించాలని ఓటు వేశారు. అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ రవీంద్ర దోలకియా మాత్రమే వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించారు. ఆరుగురు సభ్యులున్న ద్రవ్యపరపతి విధాన కమిటీల్లో ఈయన ఒకరు కాగా.. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు పాలసీ ప్రకటనలో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటారు. బుధవారం ఆర్‌బిఐ సమీక్ష వివరాలను మీడియాకు వెల్లడించే సమయంలో డాక్టర్. చేతన్ ఘటే, డాక్టర్. పామి దువా, డాక్టర్ వైరల్ వీ.ఆచార్య, మైఖెల్ పాత్ర, డాక్టర్ ఉర్జిత్ పటేల్, రవీంద్ర దోలకియా ఉన్నారు. కేవలం రవీంద్ర దోలకియా మాత్రమే 25 బేసిస్ పాయింట్ల వరకు రెపోను తగ్గించవచ్చని పేర్కొన్నారు. గత ఆర్‌బిఐ విధాన సమీక్షలో కూడా ఆయన రేటు కోతకే మొగ్గుచూపారు. అయితే రిజర్వు బ్యాంక్ మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలతో రెపో రేటును యథాతథంగానే కొనసాగిస్తూ వస్తోంది.

Comments

comments