Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

తుపాకులగూడెం బ్యారేజీ పనులపై ముఖ్యమంత్రి అసహనం

cm2

*తుపాకులగూడెం బ్యారేజీ పనులను పర్శిలించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు
*పనులు వేగవంతం చేయాలని ఆదేశం
*మూడు షిప్ట్‌లలో పనులు పూర్తి చేయాలని సూచన

మనతెలంగాణ/ వరంగల్‌బ్యూరో/బూపాల్‌పల్లి పతినిథి:
ప్రాజెక్టుల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంపై సిఎం కెసిఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులను వేగవంతంగా చేయకుంటే అనుకున్న సమయానికి నీళ్లు అందించలేమని అధికారులపై సిఎం ఆసహనాన్ని వ్యక్తం చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్యారేజీ పనులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీనీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి సిఎం కెసిఆర్ పరిశీలించారు. కరీంనగర్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 10:20 నిమిషాలకు తుపాకులగూడెం చేరుకొని అక్కడ గోదావరిపై ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను హెలీకాప్టర్ ద్వారా పరిశీలించారు. 10:35 గంటలకు హెలీకాప్టర్ దిగి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. తుపాకులగూడెం వద్ద పనులు నత్తనడకన సాగుతుండడంపై నీటిపారుదలశాఖ అధికారులతోపాటు ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకులగూడెం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తేనే దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు మెదక్, కరీంనగర్ జిల్లాలకు అందించగలుగుతామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్న వ్యాప్‌కోస్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. బ్యారేజి నిర్మాణం పనులు ప్రస్తుతం ఎన్ని షిప్టులలో జరుగుతున్నాయని అడుగగా ఒక షిప్టులోనే జరుగుతున్నాయని అధికారులు చెప్పగా వెంటనే ఇలా అయితే ఎప్పటికి పూర్తి చేస్తారంటూ పనులను మూడు షిప్టులలో జరిగే విధంగా చూడాలని ఎజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. తుపాకులగూడెం వద్ద గోదావరి నీటి ప్రవాహం ప్రస్తుతం ఎంత ఉన్నదని అధికారులను అడుగగా 6వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని తెలిపారు. మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం వద్ద ప్రాజెక్టు పనులను పరిశీలించినతుపాకులగూడెం నుంచి నేరుగా మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం 11:21 నిమిషాలకు చేరుకున్న సుమారు 40 నిమిషాలపాటు ప్రాజెక్టు ప్రాంతాన్ని తిరిగి పరిశీలించారు. ముందుగా హెలీకాప్టర్‌పై నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన తరువాత కిందకి క్షణ్ణంగా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శన ద్వారా ప్రాజెక్టు పనులను అధికారులు వివరించారు. మధ్యాహ్నం 12గంటలకు మేడిగడ్డ నుంచి అక్కడి నుంచి కన్నెపల్లి చేరుకున్నారు. కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద నిర్మాణ పనులలో వేగం లేకపోవడంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదటి దశ నీటిని పంపింగ్ చేయాలని అధికారులకు సిఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలకు సాగునీరు అందించాల్సి ఉందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 33లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని సిఎం అన్నారు. పనుల్లో వేగం పెంచాలని సిఎం అధికారులను, ప్రాజెక్టు నిర్మాణ ఎజెన్సీలను ఆదేశించారు. అక్కడ నుంచి అన్నారం బ్యారేజి వద్దకు వెళ్లి నిర్మాణం పనులను సిఎం పరిశీలించారు. అక్కడి నుంచి మంథని మండలంలోని సుందిళ్ల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను, నిర్మాణ ఎజెన్సీలను ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎం వెంట మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరుహరీష్‌రావు, ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపి బాల్కసుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, డిజిపి మహేందర్‌రెడ్డి, డిఐజి నాగిరెడ్డి, ఎస్‌పి బాస్కరన్, ములుగు సబ్‌కలెక్టర్ గౌతమ్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్‌రావు, నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు. సిఎం భద్రతా ఏర్పాట్లను డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సిఎం ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా ప్రాజెక్టుల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు.
-కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో….
తెలంగాణ సస్యశ్యామలం
భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన గోదావరి నదీ తీరాన నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారనుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం రాష్ట్ర సరిహద్దుల్లో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ,కన్నెపల్లి పంప్ హౌజ్ ,అన్నారం బ్యారేజీ తో పాటు కన్నాయిగూడేం మండలం పరిధిలోని గోదా వరి పై నిర్మిస్తున్న తూపాకుల గూడెం ప్రాజెక్టులను సీఎం కేసిఆర్ మంత్రు లు,అధి కారులతో కలిసి పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జీబీషన్‌ను తిలకించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రయోజనం కలుగనుందని 37 లక్షల ఎకరా లకు సాగునీరు అందుతుందని తెలిపారు. మేడిగడ్డ కేంద్రంగా కాళేశ్వరం రూపకల్పన జరుగుతుందని అన్నారు.కన్నెపల్లి వద్ద 40 మెగావాట్ల సామర్థంతో 11 పంపులను ఏర్పాటు చేయనున్నట్లు అందుకుతగిన ప్రతిపా దనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అన్నారం బ్యారేజీ నీటి విలువ 10ః87 టీఎంసీల నీరు ఉంటుందన్నారు. తెలంగాణకే తలమానికంగా మారిన కోట్లాది రూపాయలతో నిర్మించే ప్రాజెక్టులు నిదర్శనంగా ఉండబోనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, తూపాకులగూడెం,కన్నెపెల్లి ప్రాజెక్టుల పనితీరును పరిశీలించిన సీఎం కేసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపా యలతో నిర్మిస్తున్న పనుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించడం నత్తనడకన పనులు సాగడం చూస్తే అధికారుల పనితీరు అర్థం అవుతుందని మండిపడ్డారు. నిర్లక్షం వీడి ప్రాజెక్టుల పనులను త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు పనుల వివరాలను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్రమంత్రులు తన్నీరు హరిష్ రావు, ఈటల రాజేందర్,సిఎస్ ఎస్పీసింగ్,రాష్ట్ర డిజీపి మహేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్య దర్శి స్మిత సభర్వాల్,ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్,ఎంపిలు బోయిని పల్లి వినోద్ కుమార్,బాల్క సుమన్,మంథిని ఎమ్మేల్యే పుట్ట మధు,ఎమ్మేల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,జిల్లా కలెక్టర్ మురళి, జయశం కర్,మహబూబాబాద్,ఎస్పీలు భాస్కరన్,కోటి రెడ్డి,జిల్లాలోనిఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
బ్యారేజీ పనుల పరిశీలన
తుపాకులగూడెం బ్యారేజీ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, వినోద్‌కుమార్, పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్‌లతో కలిసి తుపాకులగూడెం బ్యారేజీ పనులను సందర్శిం చారు. ఉదయం 10.25 గంటలకు ఆయన తుపాకులగూడెం బ్యారేజీ వద్ద హెలిక్యాప్టర్‌లో దిగారు. అనంతరం కాన్వాయ్‌లో అధికారుల తో కలిసి బ్యారేజీ పనులు, బ్యారేజీ నిర్మిత గోదావరి నది ప్రదేశాన్ని వీక్షించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చా రు. సుమారు అరగంట పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల తో మాట్లాడారు. బ్యారేజీ నిర్మిత ప్రదేశంలో ఎంత భూమి ముంపుకు గురవుతుంది, ఏఏ పనులు జరుగుతున్నాయి, వాటి ప్రగతి ఏస్థాయిలో ఉంది వంటి వివరాలను తెలుసు కున్నారు. ప్రస్తుతం కాపర్ డ్యాం మధ్యలో పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి, అన్నారం, తదితర పనులతో పోలిస్తే తుపాకులగూడెం బ్యారేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఒకే షిప్టులో కాకుండా రోజు మూడు షిఫ్టుల్లో పనులు చేయాల్సిందిగా చెప్పారు. పనులు వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించారు. తాను మరో నెలరోజుల్లో తుపాకులగూడెం బ్యారేజి పనుల వద్దకు మళ్లీ వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజి నాగిరెడ్డి, జయశంకర్ జిల్లా ఎసీ రాహుల్‌హెడ్డే, ఐటీడీవో పీవో చక్రాధర్‌రావు, ములుగు సబ్ కలెక్టర్ గౌతమ్, ఏటూరునాగారం సిఐ రఘుచందర్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్వర్లు నీటిపారుదల శాఖ ఈఎస్‌సి మురళీధర్‌రావు, దేవాదుల సీఈ బంగారయ్య, నాగేందర్‌రావు, ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు, ఈఈ జగదీష్, ట్రాన్స్‌కో ఎండి డి.ప్రభాకర్‌రావు, టిఎస్ ఎన్‌పిడిసిఎల్ ఎస్‌ఈ జె.నరేష్, ఈఈ భాస్కర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments

comments