Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

యువతకు ఉపాధికల్పనలో ప్రభుత్వం విఫలం

cpi

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాథి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు మండిపడ్డారు. బుధవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడెన్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరలేదని అన్నారు. ఉద్యమ పార్టీగా వున్న సమయంలో టీఆర్‌ఎస్ నీళ్లు, నిధులు, నియామకాలపై పెద్దగా మాట్లాడినా అధికారాన్ని చేపట్టిన తరువాత వాటిని మరచిపోయిందని విమర్శించారు. ఉద్యమ సమయంలో రెండు లక్షల ఉద్యోగఖాళీలు వున్నాయని పేర్కొన్న కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత అసెంబ్లీలో కేవలం లక్షా 15వేల ఉద్యోగాలే వున్నాయని చెప్పారని, దీనికి తోడు మరో 50వేలకు పైగా ఉద్యోగుల పదవి విరమణతో వచ్చి చేరినా నియామక ప్రక్రియపై దృష్టిసారించడం లేదన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న టీఐపాస్ ద్వారా కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే పరిశ్రమలు నెలకొల్పొతున్నారని, ఇది మారి మండల, జిల్లా కేంద్రాల్లో పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా చూడాలని కోరారు. టీఐపాస్ ద్వారా ఏర్పాటైన పరిశ్రమల్లో పెద్దగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదన్నారు. సిద్దిపేటలాంటీ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దిపై ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. వ్యవసాయ అధారిత పరిశ్రమలను నెలకొల్పితే రైతులకు, నిరుద్యోగులకు లాభం చేకూరుతుందని ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించే వారిపై అధికార పార్టీ ఎదురుదాడికి దిగడం బాగాలేదని, అరెస్టులు, నిర్బంధాలతో ఎవరిని ఆపలేరని స్పష్టం చేశారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీ, కాగజ్‌నగర్ పేపర్‌మిల్లు, ఏటురునాగారంలోని బిల్టు పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల బలోపేతం కోసం టీమాస్‌ను ఏర్పాటు చేసామని, రానున్న రోజుల్లో ప్రజావ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వెంకట్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ అధికార కాంక్షతో అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మతోన్మాదులు భౌతిక దాడులకు దిగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసిచూడనట్టు వ్యవహరిస్తోందన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా సిపిఎం కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు రేవంత్‌కుమార్, గోపాలస్వామిలు పాల్గొన్నారు.

Comments

comments