Search
Friday 20 April 2018
  • :
  • :

చరిత్రకు ఆనవాళ్లు

Old-Coins

చిన్నప్పటి నుంచి చరిత్రపై అభిరుచితో పరిశోధనే లక్షంగా జీవితాన్ని గడుపుతున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన మూశం దామోదర్‌రావు. చిట్యాల దగ్గరున్న నేరుడ గ్రామానికి చెందిన దామోదర్‌రావు చరిత్ర, లిపి, నాణేలు, శాసనాల పరిశోధకుడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తనదగ్గరున్న తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లతో ఓ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. అక్కడికి వచ్చేవారికి వాటి గురించి తెలియజేయనున్నారు. 2012లో తిరుపతిలో జరిగిన మహాసభల్లో కూడా ఆయన ప్రదర్శించిన నాణేలు, చరిత్రకు సంబంధించిన ఫర్మానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన తెలంగాణ చరిత్ర చాలా పురాతనమైనదని , తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రాచీన వేయి సంవత్సరాలు కాదు మూడు వేల ఏండ్లు అని ఆధారాలు లభిస్తున్నట్లు చెబుతున్నారు.

చిట్యాల నుంచి ఆరు జాడీల వెండి నాణేలతో హైదరాబాద్ వచ్చిన తన తాత సికింద్రాబాద్ జేమ్స్‌స్ట్రీట్ దగ్గర మొదటగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు. ఆయన దగ్గరే తను బ్రాహ్మీభాషను నేర్చుకున్నారు. శాతవాహన నాణాలపై ఉన్న బ్రాహ్మీభాషపై పట్టు సాధించడానికి అదెంతో తోడ్పడిందంటారు. శాతవాహనులకన్నా ముందు రాజులు ఎవ్వరూ లేరని అందరూ నమ్ముతారని, కానీ అది నిజం కాదంటున్నారు. శాతవాహనుల కన్నా ముందు గోపదరాజులున్నారని, వారు బ్రాహ్మీలిపిలో నాణేలపై తమ పేరు వేసుకున్నారని చెబుతున్నారు. బ్రాహ్మీలిపిని అశోకుడు ఒక్కడే రాయగలడని, ఆయన తర్వాత 500ఏళ్ల తర్వాత నాణేలపై ఈ లిపిని వేసినవారు కొద్దిమంది మాత్రమే ఉంటారని అంటున్నారు.

400 బీసీలో కోటి లింగాల్లో తెలంగాణకు చెందిన ఒక రాజు నాణేలపై బ్రాహ్మీలిపిని వేశాడంటున్నారు దామోదర్‌రావు. శాతవాహన చరిత్రలో కొన్ని తప్పులు ఉన్నాయని, వాటిని తెలుసుకోవడానికి పరిశోధనను ప్రారంభించినట్లు తెలిపారు. ఉత్తర కోసల, దక్షిణ కోసల రాజ్యం అనేవి ఉన్నాయని, కోసల రాజ్యంలో భాగంగానే తెలంగాణ ఉందని చరిత్ర చెబుతోందంటున్నారు. మన తెలంగాణలో కూడా గుర్రపు తెడ్డు, సీసపు నాణేలు తనకు లభించినట్లు చెబుతున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు 100 నాణేలు ఉంచుతున్నారు. శాతవాహనుల నాణేల సేకరణలో తెలుగు వరల్డ్ రికార్డుగా దామోదర్‌రావు పేరు నమోదయింది. భాషపై చేసిన సేవలకు గాను స్వచ్ఛంద భాషాసేవ అవార్డు తనకు లభించింది.

ఆడవాళ్లదే రాజ్యం: తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్లే రాజ్యాన్ని పాలించేవాళ్లు. శాతవాహన కాలంలో మహిళలు కూడా నెత్తిన రుమాలు కట్టుకునేవాళ్లు. లక్కతో తయారుచేసిన ఈ బొమ్మను ఇంతవరకూ ఎక్కడా ప్రదర్శించలేదు.

గరుడ నాణెం: శాతవాహనుల బంధువులు మహారాష్ట్రలో ఉండేవారు. నల్లగొండలోని పానగల్లు దగ్గర గరుడ వెండి నాణేలు దొరికాయి. వీటిని క్షేత్రపు నాణేలు అంటారు .

హైదరాబాద్ డ్రాగర్: హైదరాబాద్‌ను కులీకుతుబ్‌షా కట్టించినందుకు గుర్తుగా ఈ కాయిన్‌ను విడుదల చేశారు. దీన్ని పర్‌కుందా బునియాద్ అని అంటారు. 500 చార్మినార్: బ్రిటీష్ వాళ్ల రూపాయి కన్నా ఎక్కువ విలువగలది. బ్రిటిష్ వాళ్లది 10గ్రా. బరువుంటే నిజాం నాణెం 11.6 గ్రా. లుండేది. 1940లో 100 నిజాం నాణేలిస్తే 125 బ్రిటీష్ నాణేలు వచ్చేవి.

తొలి తెలుగు అక్షరం: శ్రీధర అనే మొదటి తెలుగు అక్షరం. దీన్ని తంజావూరు రాజు విడుదల చేశాడు. కాకతీయుల కాలంలో 300మంది కుటుంబాలు తంజావూరుకు వలస వెళ్లాయి. వీరిలో శ్రీధరుడు గొప్పవాడు. తమిళగడ్డపై మొదటి అక్షరం కూడా ఇదే.

Comments

comments