Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

పల్లె ప్రజల కష్టాలు .. కానరాని ప్రజా ప్రతినిధులు

road

*మదిర గ్రామాల దిశ మారేనా?
*కొత్త సర్కారులో సైతం నోచుకోని అభివృద్ధి
*రవాణా సౌకర్యానికి శాపంగా గడిమల్కాపూర్ రహదారి

మన తెలంగాణ/కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారుమూల గ్రామాలు ఆదర్శంగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా మదిర గ్రామాల అభివృద్ధ్దికి నోచుకోకపోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులకు కొంతమేరైనా అభివృద్ధ్దిపై ఆలోచనలు లేకుండా పట్టీపట్టనట్లు ఆ రోడ్డు స్థలం ఊసేత్తడంలేదు. అయితే అది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ మదిర గ్రామం. వివరాల్లోకి వెళ్తే… కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మదిర గ్రామ గడిమల్కాపూర్‌కు రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఎక్కడ చూసినా రోడ్డుపై కంకర రాళ్లు తేలి ప్రమాదాన్ని తలపించేలా దర్శనమిస్తుంది. గ్రామానికి దాదాపు 7 సంవత్సరాలు క్రితం రోడ్డు నిర్మించారు. గ్రామంలో రహదారి సక్రమంగా లేకపోవడం వల్ల బస్సు సౌకర్యమే లేదు.. అటో రానే రాదు, మోటర్ వాహనానదారులు కత్తిమీద సాములా ప్రతిరోజూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఈ గ్రామం నుండి పాఠశాలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ రోడ్డు శాపంగా మారిందని చెప్పవచ్చు. అంతేకాక మోటార్ సైకిల్‌పై ప్రయాణం చేస్తూ పలుమార్లు ప్రమాదాలు గురైన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే వర్షాకాలంలో ఈ రోడ్డు పరిస్థితి చెప్పనక్కర లేదు. వర్షం పడితే ఈ గ్రామం నుండి ప్రయాణం చేయాలంటే కల్వర్టు సరిగా లేక, బురద రోడ్డు, అందులో తేలిన కంకర ఇలా ఈ రహదారి గుండా ప్రయాణం దుర్భరంగా ఉంటుంది. దుకాణం, నిత్యావసర వస్తులకు, మండల కేంద్రానికి ప్రయాణం చేయాలంటే ఈ రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా పయనించాల్సి వస్తోంది.
108 వాహనం రాని దుస్థితి…ఈ గ్రామంలో ఏమైనా అత్యవసర వైద్య సదుపాయం అవసరమైతే 108 కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యావసర వస్తువులు, విద్యాబోధన, వైద్య సదుపాయం, ఇలా నిత్యావసరాలు తీర్చుకునేందుకు గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నా ఈ గ్రామం వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసిన పాపాన పోలేదు. ఇదంతా ఒక వైపు అయితే ఆ పల్లె ప్రజల కష్టాలు ప్రజా ప్రతినిధులకు వచ్చే స్థానిక ఎన్నికలకు అవకాశం ఇస్తున్నట్లుగా ఆశావహులై ఎదురు చూస్తున్నామనే సమాచారం వినిపిస్తోంది. మరి ఈ రోడ్డు తీరు ఎప్పుడు మారేనో వేచి చూడాల్సిందే.

Comments

comments