Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

దత్తాత్రేయం సమామ్యహం

life

  అనసూయాత్రి సంభూత
  దత్తత్రేయ మహామతే

  దేవత్వం మమ చిత్తం స్థిరకురు 

దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారు ఝూమునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్రం, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. 

మార్గశిర శుద్ద పున్నమి దత్త జయంతి. దత్తాత్రేయుడు లోకాలకు ఆదిగురువు. సృష్టి స్థితి లయాలకు కారకుడని స్మృతి కౌస్తుభం చెబుతోంది. త్రిమూర్తులు సత్వరజస్తమో రూపాలకు ప్రతీకలు. ఒకనాడు నారదుడు విష్ణువును సత్యరూపం కలవాడిగా దర్శించాలని కోరుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఒక్కటిగా అయినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని విష్ణువు అన్నాడు. ఆ తర్వాత నారదుడు భూలోకానికి వచ్చి అత్రి-అనసూయల ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తిరిగి వైకుంఠం వెళ్లి లక్ష్మీదేవితో అనసూయతో సమానమైన పతివ్రత మరొకరు లేరని అన్నాడు. ఇలాగే పార్వతి, సరస్వతులకు కూడా చెప్పాడు అనసూయ పాతివ్రత్యం పరీక్షించమని ఆ ముగ్గురు ఇల్లాళ్లు తమ భర్తలను కోరారు. వారి కోరిక మేరకు త్రిమూర్తులు బ్రాణ్మణ వేషాలు ధరించి అత్రి ఆశ్రమం చేరి భిక్ష అడిగారు. అదివిన్న అత్రి మహర్షి తన భార్య అనసూయకు కొంత మంత్ర జలాన్ని ఇచ్చాడు. ఆ మంత్ర జలాన్ని ఆమె బ్రాహ్మణ రూపాల్లో ఉన్న త్రిమూర్తులపై చల్లడంతో వారు పసిబాలురుగా మారిపోయారు. త్రిమూర్తులు ఇలా పసివారిగా అత్రి ఆశ్రమంలో మారిపోవడంతో లక్ష్మి, పార్వతి , సరస్వతులకు జ్ఞానోదయమైంది. వారి ప్రార్థన మేరకు అనసూయ బాలురను త్రిమూర్తులుగా మళ్లీ మార్చింది. సంతానంలేని అత్రి, అనసూయ దంపతులకు తమకు కుమారుడుగా జన్మించమని వారిని వేడుకున్నారు. ఆ దంపతులకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో ఓ కుమారుడు జన్మించాడు. మూడు ముఖాలు, ఆరు చేతులతోపుట్టి దత్తుడుగా పేరుపొందాడు. దత్తుడు అత్రి మహర్షి కుమారుడు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. దత్తాత్రేయుని మూడు శిరస్సుల్లో మధ్య ఉన్నది శ్రీమన్నారాయణుడిది. ఆ శిరస్సుకు కుడి ఎడమల్లో శివబ్రహ్మలు కొలువుదీరి ఉన్నారు. దత్త సంప్రదాయం ఆదినాథ సంప్రదాయంగా కీర్తి పొందింది. దత్తాత్రేయుడు ఆదిగురువు. ఆ పిదప దత్త అవతారాల్లో పదహారింటిని గురు సంప్రదాయంలో భాగంగా స్తోత్రం చేస్తారు. దత్తుడు భోగ మోక్షాలను ఇచ్చేవాడు .ఆ దేవదేవుడ్ని ఆరాధించడం , పాదుకలను అర్చించడం ఎంతో శ్రేయదాయకం. నాలుగు వేదాలూ నాలుగు కుక్కల రూపంలో ఆయన ముందు సాగిలపడ్డాయి. అన్ని అపవిత్రాలను పోగొట్టే వేదాలు సైతం కుక్కలుగా మారి ఆయన ముందు సాగిలపడ్డాయంటే స్వామి వారి మహత్యం ఆ దేవతలకు కూడా అర్థంకాని విషయమని అర్థమైపోయింది. కార్తవీర్యార్జునుడు , పరశురాముడు ఇంకా అనేకమంది ఈ సంప్రదాయాన్ని అనుసరించి కొత్త కొత్త తంత్ర మార్గాలను లోకానికి పరిచయం చేశాడు. దత్తుని ఒకానొక అవతార సమయంలో వామదేవుడు అనే రుషి జన్మించాడు. అతని జన్మ కూడా బహు చిత్రమైంది. జన్మించక పూర్వమే అతను తల్లి గర్భం నుంచి బయటకు ఓసారి చూసి తిరిగి గర్భస్తమయ్యాడు. దేవతల కోరిక మేరకు జన్మించాడు. దత్త సంప్రదాయాన్ని లోకానికి పరిచయం చేసిన వారిలో ఆయ న ఆద్యుడు. దత్త సంప్రదాయం నేటి కాలంలో కూడా అనుసరణీయం. ఈ మార్గం ప్రకారం దత్తుని అవతారాలివి..శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి, స్వామి సమర్థ, అక్కల్‌కోట మహారాజ్, మాణిక్ ప్రభు, కృష్ణ సరస్వతి స్వామి, మరో మార్గంలో శ్రీ జనార్థనుడు, ఏకనాధుడు, దశోపంత్, నిరంజన్, రఘునాథుడు, నారాయణ్ మహరాజ్, మాణిక్ ప్రభు, స్వామి సమర్థ మిగతా వారంతా నరసింహ సరస్వతి శిష్యులుగా చెబుతారు. వీటిలో నిరంజన రఘునాధ సంప్రదాయం సుప్రసిద్ధం. శ్రీదత్త ప్రభువు నుంచి త్రిమూర్తులు,వారి నుంచి ముక్కోటి దేవతలు, వారి నుంచి 33కోట్ల మంది దేవతలు వచ్చారని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వర్ణించింది. శ్రీగురుదత్త, జైగురుదత్త, దత్త, దత్త…అని , జైజై సమర్థ సద్గురు దేవదత్త అని, జైగురుదత్తా అని దత్తోపాసకులు దత్తుడిని ఉపాసిస్తారు. దత్తాత్రేయునికి చాలా ఇష్టమైనవి మేడి పండ్లు, స్వామి మేడి చెట్టు కింద నివసిస్తాడని దత్త సంప్రదాయం చెబుతోంది. మేడిచెట్టుకు పువ్వులుండవు. కాండం దగ్గర కొమ్మల దగ్గర పండ్లు లభిస్తాయి. సకల జనులకు సేవ చేయడం, జీవులందరూ ఒక్కటేననే భావంతో ఉండటం, అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించడం దత్తాత్రేయుని స్వభావమని ఆయన శిష్యులు అంటారు. కుల మత వర్గ విచక్షణలేకుండా అందరినీ సమానంగా చూడాలని, అదే దత్తునికి ఇష్టమని దత్త సంప్రదాయం చెబుతోంది. శివకేశవులకు ఏకరూపం కల్పించే యత్నం చేయడమే హరిహరమార్గమనుకుంటే ఈ మార్గంలో ప్రభవించిన దైవమే దత్తాత్రేయుడు.

భిన్న  సంప్రదాయాల మేలికలయిక

దత్తాత్రేయ ఆరాధనలో అనేక సంప్రదాయాలున్నాయి. వీటిలో పురాణ సంప్రదాయం ముఖ్యమైనది. దత్తాత్రేయ ప్రాచీన శిష్యులలో, కార్తవీర్య సహస్రార్జునుడు అత్యంత ప్రియ శిష్యుడు. ఇతరులు, అలర్క, సోమవంశానికి చెందిన ఆయు రాజు, యాదవులకు చెందిన యదు రాజు పరశురాము ప్రముఖులు. వీరుకాక సాంకృతి అనే మరో పేరు కూడా ఉంది. అవధూతోపనిషత్, జాబాలోపనిషత్ లలో సాంకృతి ప్రస్తావనలున్నాయి.
శ్రీ గురుచరిత్ర సంప్రదాయం
ఈ సంప్రదాయానికి శ్రీపాద శ్రీవల్లభ, నరసింహ సరస్వతి మూలపురుషులు. దత్తా-అవతారాలలో ప్రధానంగా చెప్పుకునే జనార్దనస్వామి, ఏకనాథ్, దశోపంత్, నిరంజన్ రఘునాథ్, నారాయణ్ మహరాజ్ జ్వాలాంకర్, మాణిక్ ప్రభు, స్వామి సమర్థ్, షిర్డీ సాయిబాబా, వాసుదేవానంద సరస్వతి మొదలైనవారు ఈ సంప్రదాయం నుంచే వచ్చారు. శ్రీ నరసింహ సరస్వతి శిష్యులు, కుమసి నుంచి త్రివిక్రమ్ భారతి, సయందేవ్ నాగంత్, దేవరావ్ గంగాధర్, కదగంచి నుంచి సరస్వతి గంగాధర్, అక్కల్‌కోట్‌కు చెందిన స్వామి సమర్థ్ మరియు వాసుదేవానంద సరస్వతి (టెంబెస్వామి)తదితరుల వివరాలు ఈ గురుచరిత్రలో కనిపిస్తాయి.
నిరంజన్ రఘునాథ్ సంప్రదాయం
ఇతడి అసలు పేరు అవధూత్. కానీ తన గురువు శ్రీ రఘునాథ స్వామి ఇతడి పేరును నిరంజనుడిగా మార్చాడు. ఇతడికి మహారాష్ట్రలోని నాసిక్‌‌, జున్నూర్, కలాంబ్, కొల్హాపూర్, మీరజ్ వంటి చోట్ల పలువురు శిష్యులు ఉండేవారు. రామచంద్ర తత్య గోఖలే, గోవిందరావు నానా పట్వర్థన్-శాస్త్రి వంటివారు ఈయన శిష్యులే. ఇతడి వారసత్వం సూరత్, బరోడా, గిర్నార్ ఝాన్సీ ఉత్తర ప్రాంతం వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. నిరంజన రఘునాథ్ అత్యంత ప్రసిద్ధ శిష్యుడు నారాయణ్ మహరాజ్ జ్వాలాంకర్. నారాయణ్ మహరాజ్ మాళ్వ ప్రాంతంలో పనిచేశాడు. అతడు రాసిన సుప్రసిద్ధ సాహిత్య రచనలలో సప్త సాగర్ ఒకటి. ఈ పరంపర లక్ష్మణ్ మహరాజ్‌తో కొనసాగింది. ఇతడు ఇండోర్ నుంచి వచ్చాడు. బలభీమ్ మహరాజ్ సదేకర్ ఇతడి శిష్యుడు. ఇతనికి గురుపడిచవేద అంటే గురు ఉన్మాది అనే పేరుంది. సద్గురు భగీరథనాథ మహరాజ్ కూడా ఇండోర్ నుంచే వచ్చాడు. దత్తాత్రేయ మహదేవ్ చోల్కర్, భగీరథినాథ్ మహరాజ్ యొక్క ప్రియశిష్యులలో ఒకడు. ఇతడు పుట్టుకతోనే గుడ్డివాడయినప్పటికీ, తన బోధనా పద్ధతులలో ఇతడు చాలా నేర్పరి. ఇతడు మూలంలోని బ్రహ్మాత్మబోధ్‌ని పద్యశైలిలో రాశాడు. భగీరథ్ నాథ్ దీన్ని మెచ్చుకుని, కొన్ని సవరణలు చేసి, సాధారణ పాఠ్య రూపంలో తిరగరాశాడు. ఇతడు దాదాపు 4 వేలకంటే ఎక్కువగానే భజనగీతాలను రాశాడు. మహదేవ్ చోల్కర్ యువత్మల్ (మహారాష్ట్ర) లో భారీ ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం పేరు శ్రీ భాగీరథి గురు మందిర్. ఈ ఆలయ నిర్వాహక కమిటీ ప్రతి నిత్యం ప్రార్థనలు, అద్వైత కీర్తనలు మరియు కార్యక్రమాలను నిర్వహించేది.
సకలమత సంప్రదాయం
మాణిక్ ప్రభు ప్రారంభించిన అద్వితీయ సంప్రదాయం ఇది. వీరు భగవానుని చైతన్యదేవుడిగా పూజించారు. బంగారం, ముత్యాలు, వజ్రాలు, ఖరీదైన దుస్తులు, సంగీతం, కళలను సంప్రదాయంలో భాగంగా చూశారు. పేదలు, సంపన్నులను వీరు ఒకే విధంగా చూసేవారు. అన్ని విశ్వాసాలు తమ అనుయాయులకు దైవత్వాన్నే ఇస్తాయని వీరు నమ్ముతారు. హిందువులు, ముస్లిం భేదం లేకుండా అందరికీ వీరి ఆశ్రమాలలో ప్రవేశముండేది. బాపాచార్య, నారాయణ్ దీక్షిత్, చిన్మయ బ్రహ్మచారి, గోపాల్‌బువలు ఈ సంప్రదాయంలోని సుప్రసిద్ధ భక్తులు.
అవధూత పంత్ సంప్రదాయం
అవధూత పంత్ సంప్రదాయాన్ని బెల్గాం సమీపంలోని బలెకుండ్రికి చెందిన పంత్‌మహరాజ్ బలెకుండ్రికార్ ప్రారంభించారు. ఈ సంప్రదాయానికి సంబంధించిన భక్తులు గోవిందరావుజీ, గోపాలరావుజీ, శంకరరావుజీ, వామనరావు, నరసింహారావులను ‘పంత్‌బంధువులు’ అని పిలిచేవారు.
కర్నాటకలోదత్తాత్రేయ జ్ఞానోదయం పొందిన గంగాపూర్ పట్టణం ఉత్తర కర్నాటక లోని గుల్బర్గ జిల్లాలోని భీమానది ఒడ్డున ఉంది. గురుచరిత్రకారుడు శ్రీ సరస్వతి గంగాధర్ కన్నడిగుడు.
తెలుగునాట..
దత్తాత్రేయ ప్రథమ అవతారం శ్రీపాదవల్లభ ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురానికి చెందినవాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న మాతాపూర్ /మహుర్ ప్రాంతం ఆ కాలంలో తెలంగాణాలో భాగంగా ఉండేది. మహుర్ ఆలయ పూజారి దత్తాత్రేయ యోగిగా పిలువబడేవాడు. క్రీస్తు శకం 1550 ప్రాంతంలో దత్రాత్రేయ యోగి తన శిష్యుడు దాస్ గోసవికి మరాఠీలో దత్తాత్రేయ తత్వశాస్త్రాన్ని బోధించాడు. దాస్ గోసవి తర్వాత ఈ తత్వశాస్త్రాన్ని తన తెలుగు శిష్యులైన గోపాల్‌భట్, సర్వవేద్‌కి బోధించాడు. దాస్ గోసవి పుస్తకం వేదాంతవ్యవహారసంగ్రహాన్ని సర్వవేద్ తెలుగులోకి అనువదించాడు. దత్తాత్రేయ యోగి, దాస్ గోసవిలు తెలుగునాట దత్త సంప్రదాయంలో మూల గురువులు. పరమానందతీర్థ దత్తాత్రేయ శతకం రచించాడు. ఇవికాక ఈయన రచించిన అనుభవదర్పణం, శివధ్యానమంజరిలను దత్రాత్రేయకు అంకితం చేశాడు. ఇతడు రచించిన సుప్రసిద్ధ గ్రంథం వివేక చింతామణిని నిజశివగుణయోగి కన్నడలోకి అనువదించగా దీన్ని లింగాయత్ ఋషి శాంతలింగస్వామి మరాఠీలోకి అనువదించాడు.
తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌జిల్లాలోని మక్తల్ మండలంలో పసుపుల గ్రామంలో వల్లభాపురం పేరుతో దత్తత్రేయ దివ్యక్షేత్రం ఉంది. ఇది నూరేళ్ళనాటి క్షేత్రం. అలాగే మెదక్‌జిల్లా బర్దీపూర్‌లో మరో దత్తక్షేత్రం ఉంది. హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఒక దత్తాలయం ఉంది. అలాగే సీతారాం బాగ్, ఆసిఫ్‌నగర్‌లో కూడా ఒక ఆలయం ఉంది.

Comments

comments