Search
Tuesday 19 June 2018
  • :
  • :

నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు

home*అద్దెభవనాల్లోని కార్యాలయాలకు కేటాయిస్తే ప్రయోజనం
*భవనాలను ఖాళీగా వదిలేస్తే కూలిపోవడం తథ్యం

మన తెలంగాణ/జహీరాబాద్ : ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో అధికారులు నిర్లక్షం వహిస్తున్నారని చెప్పవచ్చు. ప్రజా ధనమైన ప్రభుత్వ నిధులను కాపాడాల్సిన అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నా అధికారుల్లో చలనం కానరావడం లేదు. సొంత భవనాలు లేక అద్దెలు చెల్లిస్తూ చాలీచాలని భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలు శాఖల కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మారిస్తే ప్రతి మాసం వేలల్లో చెల్లిస్తున్న అద్దెలు మిగిలిపోవడంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…జహీరాబాద్ పట్టణంలోని నడిబొడ్డులో జాతీయ రహదారి పక్కన గల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పక్కన 1981లో ఎపి డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు లక్షలు వెచ్చించి పశుసంవర్థ్ధక శాఖ వారు పశుసంవర్థ్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని, పశువుల ఆస్పత్రి భవనాలను నిర్మించారు. ఆయా భవనాలను అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి బి రాందేవ్‌తో అప్పటి స్థానిక శాసన సభ్యులు, మంత్రి యం.బాగారెడ్డి నేతృత్వంలో ప్రారంబించారు. పలు సంవత్సరాలు ఆయా భవనాల్లో కార్యకలాపాలు కొనసాగడంతో రైతులకు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేది. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్దం కావడంతో పశువుల ఆస్పత్రి, ఎడి కార్యాలయాలను అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి నెలకొనడంతో పట్టణంలోని బీదర్ చౌరస్తా వద్ద సుమారు 25 లక్షలకు పైగా నిధులు వెచ్చించి పశుసంవర్ధక శాఖ, పశువుల ఆస్పత్రి భవనాలను నిర్మించారు.
నిరుపయోగ భవనాల్లో అసాంఘిక కార్యకలాపాలు… లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు ఖాళీగా ఉండటంతో పోకిరీలకు, మందుబాబు (తాగుబోతులు)లకు అడ్డాగా మారడం తో భవనాల పరిసరాలను అపరిశుభ్రంగా మారండం మారిపోయింది. సాయంత్ర అయితే చాలు ఆ పరిసర ప్రాంతాలు మందుబాబులు, పేకాట రాయుళ్లతో నిండుకుంటుంది. ఇక రాత్రి అయితే ఆ ప్రాంతంలో కొనసాగే కార్యకలాపాలు చెప్పనలవిగా ఉంటాయని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.
ఇతర కార్యాలయాలకు కేటాయిస్తే ప్రయోజనం… పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం పట్టణంలో ఓ అద్దె భవనంలో ఇరుకిరుకు గదుల్లో కొనసాగుతున్న విషయం డివిజన ప్రజలకు తెలసిందే. రిజిస్ట్రేషన్ పనులపై కార్యాలయానికి చేరుకున్న రైతుల పనులు త్వరిత గతిన పూర్తి కాక, కార్యాలయం లోపల, బయట కూర్చునే సౌకర్యం లేక రైతులు పడుతున్న పాట్లు చెప్పనలవిగా ఉన్నాయని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఖాళీగా ఉన్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోకి మారిస్తే ప్రభుత్వ నిధులు వృదా కాకుండా చూడొచ్చని చెప్పవచ్చు. అద్దె భవనం నుంచి ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయంలోకి మారిస్తే అద్దె రూపంలో నీళ్లపాలవుతున్న నిధులను కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వ భవనాలు కూలిపోకుండా చూసే అవకాశం కల్గుతుంది.
కలెక్టర్ స్పందిస్తే ప్రభుత్వ నిధులు ఆదా…
ఒక శాఖకు కేటాయించిన కార్యాయలంలో ఇతర శాఖల కార్యకలాపాలు కొనసాగేలా చూడాలంటే జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. నెల వారిగా అద్దె రూపంలో చెల్లిస్తున్న నిధులు వృదా కాకుండా, ప్రభుత్వ భవనాలు అలంకార ప్రాయంగా ఉండకుండా చూడాలని డివిజన్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపితే బాటుందని ప్రజలు సూచిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే…

Comments

comments