Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అరికట్లం కట్టుకునుడు సలిమంటలు, ఎండపొడకాగుడు

సలికలానికి పెయ్యి ఇర్రు ఇర్రు మంటది పేలి పొతది పలగుతది . అందుకే రాత్రి గని తెల్లరి తనం చేసినక  గని కొబ్బరి నూనె , నువ్వుల నూనె పెయ్యింత రాసుకుంటారు. అట్లనే తానం చేసినప్పుడు గట్టి  పిండి పెట్టుకొని పెయ్యికి పోసుకుంటరు.

Winter

సలికాలం వచ్చిందంటే ఇగం పెయ్యికెక్కువది గజగజ వనుకు పుడుతది ఇగం అంటే చలి. ఎన్కట ఇప్పటి లెక్క బ్లాంకెట్లు లేవు గొంగల్లు ఉండేది అవి కూడా చలిని మస్తు ఆపుతయి. అయితే చలి ఉన్నా ఎండ ఉన్నా వాన ఉన్నా ఊర్లల్ల ఎవసాయ దార్లకు పనులు ఉండే ఉంటయి చేస్క బతుకుడే కదా . బాగ సలికాలంల ఆడోల్ల్లు తెల్లరి లేసి వాకిలి ఉడ్వాలె పాలు పిండాలె ఆలుకు సల్లాలె బర్లను ఊర బర్లల్ల కలుపాలె ఇదంత ఎగెలిసారంగా సలిలనే చేయాలె. అయితె అప్పడ నెత్తిమీద కలిపి అరికట్లం కట్టుకునేటోల్లు పాత చీరలనే సగం చేసి కట్టుకునేది . మొగపిలగాండ్లు సుత చీరలను కాదు కాని తెల్ల దోతిని కాని లుంగీలను కాని కప్పుకుందురు. సలి రగపోవు.

అట్లనే సలి మంటలు అని పెట్టుకుందురు ఇంటి ముందట వాకిల్లల్ల రోజు కంది పొరుక లేక ఇంకేదన్న కట్టెలు పెట్టి మంట పెట్టుదురు. ఆ మంట సుట్టు ఇంట్ల ఉన్నొల్లు అందరు కుసుంటారు కుసోని ముచ్చట్ట పెట్టుకుంటరు. ఒక దగ్గర మంట పెట్టుకుంటే ఆ సుట్టు పక్కల ఇండ్లవాల్లు కూడ వచ్చి కూసుంటారు కూసోని మంట కాగుకుంట ముచ్చట్లు పెట్టుకుందురు. సలి మంటలు రాత్రి బువ్వలు తిన్నంక అంటే ఏడు గొట్టంగ మొదలు పెడితే పది దాక ఉంటయి. మల్ల తెల్లారి లేసి అంటే ఎగిలివారంగనే లేశి మల్ల గంటసేపు సలిమంట పక్కపొన్న కుసుంటారు.

ఆన్నుంచే ఒక్కలొకలు ఎవరి పనులకు వాల్లు పోతరు. ఇండ్లడ్లనే కాదు ఎవుసాల కాడ బాయిలకాడ కూడా కావలి పోయ్‌నోల్లు ఇట్లనే సలి మంటలు పెట్టుకుంటరు. సలి పోయి పెయ్యికి వెచ్చదనం వస్తదన్నట్టు. సలికాలం మడెకట్లల్ల నాగలిదున్నగ సల్లగ అయితయి. శేద బాయిల నీళ్ళ చేదుకుంటే మాత్రం ఎచ్చగ ఉంటయి. సలికాలం వచ్చిందంటే పిలగాండ్లకు ఏదన్న కొరుకుడు కావాలె మక్క జొన్న ప్యాలాలు, కందికాయ కూడ ఇప్పుడే వస్తది ఉలువలు ఏంచుకు బుక్కుతరు . సలికి ఒక్కొక్కరు రెండు శెద్దర్లు కప్పుకుంటరు. గొంగడి జర ధరచిన్నది కావున ఇంటికి ఒక్కటే ఉంటది. అది ఆ ఇంటి పెద్దమనిషికి ఇస్తరు . గొంగడి భుజం మీద ఏసుకుంటే మంచిగనిపిస్తది ఆయనకు గొంగడి ఉంటే ఇంట్ల ఆమెకు మాత్రం శుద్దరి ఉంటది.

సలి పోవడానికి ఎండ పొడ కగుడు ఉంటది. పొద్దు పొడచినంక వచ్చే ఎండకు నిలబడలె పెయ్యి అంత హాయిగ ఉంటది. వెచ్చని కిరణాల స్పర్శలో శరీరం అంత గమ్మత్తు ఉంటది. ఇది అందరికీ అనుభవమే అయితె అంత తీరాటం ఉన్నల్లకు ఇది సాధ్యం.ఇండ్లల్ల లోపల వంటలు చేస్తాంటే పిలగల్లు ముసలోల్లు ఎండ పొడకు నిలబడుతరు . అరుగులు ఉంటే కూసుంటరు. ఎండ పొడకు నిలపడుతె ఇగ నెత్తికి రుమాలు కప్పకున గొంగడి శెద్దరి అరికట్లం అన్ని తీసి పారెయ్యాలె. ఎచ్చని కిరణాల సొగసు రావాలె. పట్నలల్ల ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇరుకు ఇరుకు ఇండ్ల అసలు ఎండనె ఇండ్లకు రాదు . ఇగ అపార్ట్‌మెంట్లకైతె ఎండ అన్నది ఎప్పుడు కనబడది.

వాల్లు సూర్యున్ని టిఎలల్ల సూస్తరు. ఎప్పుడు లైట్ల ఎలుగులే. పొద్దు పొడిచినప్పుడు కుంగేటప్పుడు సుత ఇట్లాంట ఎచ్చని ఎండ పెయ్యికి తాకలె అపుపడె సలగిలి అంత పోతది. సలికాలానికి పెయ్యి ఇర్రు ఇర్రు మంటది. పేలిపోతది.పలుగుతది. అందుకే రాత్రి గని తెల్లరి తానం చేసినంక గాని కొబ్బరి నూనె , నువ్వుల నూనె పెయ్యింత రాసుకుంటారు. అట్లనే తానం చేసేటప్పుడు గట్టి పిండి అంటే ఉల్వల పిండితోని తానం చేస్తే పెయ్యి అంత నున్నగ ఉంటది. అట్లనే పెదవులు పలుగకుండ ట పెదవులకు ఎన్న రాసుకుంటరు . ఎన్న అంటే వెన్న. నెత్తికి సమరు రాసుకొని పనికి పోతరు. అసలు రుమాలు సుట్టుకుంటేనే సలి శెవులల్లకు పోదు. ఏంకాదు. ఎన్కటకి ప్రతి ఒక్కరికి రుమాలు ఉండేది. ఇప్పటి వాల్ల లెక్క బెడ నెత్తిన ఎవలు ఉండరు. సలి జాగ్రత్తలు ఎప్పుడు ఉంటనే ఉంటయి.

అన్నవరం దేవేందర్,
9440763479

Comments

comments