Search
Wednesday 23 May 2018
  • :
  • :

విరాట్ విహారం

 కోహ్లి డబుల్ సెంచరీ, భారత్ 536/7 డిక్లేర్డ్,
 లంక 131/౩, చివరి టెస్టు

kohli

శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (243) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆది వారం రెండో రోజు ఆట ముగిసే సమ యానికి 3 వికెట్ల నష్టానికి 131 పరు గులు సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే లంక మరో 405 పరుగులు చేయాలి. సీనియర్ ఆట గాడు మాథ్యూస్ 57, కెప్టెన్ దినేష్ చండీమల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారీ లక్షంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంకకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మహ్మద్ షమి లంక ఓపెనర్ దిముత్ కరు ణరత్నె (౦)ను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే మరో ఆటగాడు ధనంజయ డిసిల్వా (1) కూడా పెవిలియన్ చేరాడు. ఇషాంత్ అద్భుత బౌలింగ్‌కు ధనంజయ వికెట్ల ముందు దొరికి పోయాడు. దీంతో లంక 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
-న్యూఢిల్లీ

ఆదుకున్న పెరీరా, మాథ్యూస్..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను ఓపెనర్ దిల్రువన్ పెరీరా, మాజీ కెప్టెన్ మాథ్యూస్ తమపై వేసుకున్నారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. మాథ్యూస్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, పెరీరా దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లపై ఎదురు దాడి చేసిన పెరీరా ఫోర్ల వర్షం కురిపించాడు. ఇదే క్రమంలో మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేశాడు. అయితే 42 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో లంక 75 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన కెప్టెన్ చండీమల్ అండతో మాథ్యూస్ మరో వికెట్ కోల్పకుండా జట్టు స్కోరును 131 పరుగులకు చేర్చాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూస్ 8 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చండీమల్ 3 ఫోర్లతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.
కోహ్లి దూకుడు..
అంతకుముందు రెండో రోజు 371/4 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ కోహ్లి తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. అతనికి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తిచారు. వీరిని ఔట్ చేసేందుకు లంక బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే క్రమంలో 78 బంతుల్లోనే ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.
ఆటకు అంతరాయం
తొలి డ్రింక్స్ సమయానికి భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 442 పరుగులకు చేరింది. ఈ సమయంలో శ్రీలంక క్రికెటర్లు కాలుష్య సమస్య వల్ల తమకు శ్వాస పీల్చడం కష్టమవుతుందని, ఆటను నిలిపి వేయాలని అంపైర్‌ను కోరారు. దీంతో కొంత సేపు ఆటను అంపైర్లు నిలిపి వేశారు. అయితే రిఫరీ జోక్యంతో తిరిగి ఆట మొదలైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లికి ఇది వరుసగా రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు నాగ్‌పూర్ టెస్టులో కూడా కోహ్లి ద్విశతకం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు రోహిత్ శర్మ 88 బంతుల్లో ఐదు బౌండరీలు, మరో రెండు సిక్సర్లతో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. అంతేగాక కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. లంచ్ విరామ సమయానికి భారత స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 500 పరుగులు చేసింది. లంచ్ తర్వాత కోహ్లి దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. అతను భీకర ఫాంలో ఉన్న సమయంలో శ్రీలంక క్రికెటర్లు మరోసారి కాలుష్య సమస్యను అంపైర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోహ్లి తన మార్క్ ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతేగాక కోపంతో తన బ్యాట్‌ను మైదానంలో విసిరి పరేశాడు. మరోసారి రిఫరీ, అంపైర్లు జోక్యం ఆటను తిరిగి ప్రారంభించారు. అయితే అప్పటికే ఏకాగ్రతను కోల్పోయిన కోహ్లి వికెట్‌ను చేజార్చుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 287 బంతుల్లో 25 ఫోర్లతో 243 పరుగులు చేసి సండకాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా, భారత స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరోసారి లంక క్రికెటర్లు ఆటకు అంతరాయం కలిగించారు. దీంతో భారత కెప్టెన్ అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పటికే సాహా 9, రవీంద్ర జడేజా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, లంక బౌలర్లలో సండకాన్ నాలుగు, గమాగె రెండు వికెట్లు పడగొట్టారు.

రికార్డుల రారాజు.. కోహ్లి

భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి మరో డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ సిరీస్‌లో కోహ్లికి ఇది వరుసగా రెండో ద్విశతకం కావడం విశేషం. లంకతో ఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులో కోహ్లి 243 పరుగులు సాధించాడు. కోహ్లి కెరీర్‌లో ఇది ఆరో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కోహ్లి ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇందులో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును కూడా కోహ్లి బద్దలు కొట్టాడు. ఢిల్లీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించడం దారా తక్కువ సమయంలో ఆరు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో బ్రాడ్‌మన్ పేరిట ఉన్న 581 రోజుల్లో ఆరు డబుల్ సెంచరీల రికార్డును కోహ్లి తిరగరాశాడు. కోహ్లి కేవలం 499 రోజుల్లోనే ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేగాక కెప్టెన్‌గా ఆరు డబుల్ సెంచరీలు సాధించడం ద్వారా క్రికెట్ గ్రేట్, విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉన్న ఐడు డబుల్ సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. అంతేగాక వరుస ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలో వినోద్ కాంబ్లీ రికార్డును సమం చేశాడు. 243 పరుగులు చేయడం ద్వారా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. అంతేగాక ఆరు డబుల్ సెంచరీలతో భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన నిలిచాడు. సచిన్, సెహ్వాగ్‌లు కూడా కెరీర్‌లో ఆరేసి డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే.

Comments

comments