Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఐపిఎల్ వేలం బరిలో 1122 మంది క్రికెటర్లు

ipl

ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా 1122 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బెంగళూరు వేదికగా ఈ నెల 27, 28 తేదీల్లో ఐపిఎల్ వేలం జరుగనుంది. వేలానికి సంబంధించి ఎంత మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ వేలంలో ప్రపంచ వ్యాప్తంగా పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలో కొందరినే అట్టి పెట్టుకున్నాయి. గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, అజింక్య రహానె, కెఎల్.రాహుల్, మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, చాహల్, కుల్దీప్ యాదవ్ వంటి భారత స్టార్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక అంతర్జాతీయ స్టార్లు క్రిస్ గేల్, మాక్స్‌వెల్, విలియమ్సన్, సాకిబ్ అల్ హసన్, డ్వేన్ బ్రావో, మిఛెల్ స్టార్క్, డుప్లెసిస్, బ్రాత్‌వైట్, హాషిం ఆమ్లా, కొలిన్ మన్రో, టామ్ లాథమ్, మోర్ని మోర్కెల్, జో రూట్, రబడా తదితరులు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, సునీల్ నరైన్, రసెల్, భువనేశ్వర్ కుమార్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్లను ఆయా ఫ్రాంచైజీలు అంటి పెట్టుకున్నాయి. అయితే యువరాజ్, గంభీర్, మాక్స్‌వెల్, అశ్విన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. దీంతో వీరంత వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలావుండగా భారత్ నుంచి మొత్తం 778 మంది క్రికెటర్లు వేలం పాట కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి 58, దక్షిణాఫ్రికా నుంచి 57 మంది క్రికెటర్లు బరిలో దిగనున్నారు. శ్రీలంక, విండీస్‌ల నుంచి 39 చొప్పున క్రికెటర్లు పేర్లను రిజిస్టర్ చేసుకున్న వారిలో ఉన్నారు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన 26, ఇంగ్లాంగ్‌కు చెందిన 26 మంది క్రికెటర్లు కూడా వేలం బరిలో నిలువనున్నారు. కాగా, ఐపిఎల్ పదకొండో సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 4న ప్రారంభం  కానుంది. కాగా, మే 31న జరిగే ఫైనల్‌తో టోర్నమెంట్ ముగుస్తోంది. ఈసారి వేలం పాటలో క్రిస్‌గేల్, కొలిన్ మన్రో, ఆమ్లా, మాక్స్‌వెల్, గంభీర్, యువరాజ్ సింగ్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.

Comments

comments