Search
Sunday 21 January 2018
  • :
  • :

మధ్యంతర భృతి?

tg

పిఆర్‌సికి ముందే 30% మధ్యంతర  భృతి?

జూన్ లేదా జులై నుంచి రాష్ట్ర ఉద్యోగులకు ఇవ్వాలని యోచన
మూడున్నర లక్షల మంది సిబ్బంది, ఉపాధ్యాయులు, రెండు లక్షల మంది పదవీ విరమణ చేసిన వారికి లబ్ధి

 హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో తీపి కబురు అందనుంది. కొత్త వేతన సవరణ సంఘం (పిఆర్‌సి) చేసే సిఫారసులతో సం బంధం లేకుండా రానున్న జూన్ లేదా జులై మాసం నుంచి వర్తించే విధంగా 30 శాతం మధ్యంతర భృతిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏర్పాటైన పదవ పిఆర్‌సి పదవీకాలం ఈ ఏడాది జులై 1వ తేదీతో ముగుస్తున్నందున 11వ పిఆర్‌సి ని ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిర్ధిష్టమైన అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను అందజేయడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ నెలాఖరుకల్లా పిఆర్‌సి ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత పిఆర్‌సి 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యపర్చే రీతిలో 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించా రు. ఆర్‌టిసి సిబ్బందికి కూడా ఇదే తరహాలో ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోకతప్పలేదు. పదవ పిఆర్‌సి చేసిన సిఫారసులతో సంబంధం లేకుండా కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే తరహాలో కొత్త పిఆర్‌సి సిఫారసులు ఎలా ఉన్నా ఉద్యోగులను, ఉపాధ్యాయులను సంతృప్తి పర్చే విధంగా ఫిట్‌మెంట్ ప్రకటన కూడా ఆశ్చర్యపర్చేలా ఉండనున్నట్లు సమాచారం. అందులో భాగంగా మధ్యంతర భృతిగా 30 శాతం ఫిట్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఏ మేరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందో ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సిఎం సంప్రదించినట్లు తెలిసింది. ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు మూడున్నర లక్షల ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పదవీ విరమణ చేసిన సుమారు రెండు లక్షల మందికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ నెలాఖరుకల్లా 11వ పిఆర్సిని ఏర్పాటు చేసే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతనాలు, ఆర్థిక అంశాలపై అవగాహన ఉన్న పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని పిఆర్సి ఛైర్మన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్ళకోసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సిని ఏర్పాటుచేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వి.కె. అగర్వాల్ నేతృత్వంలో పదవ పిఆర్సి 2013లో ఏర్పాటైంది. ఈ ఏడాది జూలై 1వ తేదీకల్లా దాని గడువు పూర్తికానుంది. అప్పటికి కొత్త పిఆర్సి ఉనికిలోకి రావాల్సి ఉన్నందున నిర్దిష్టమైన సిఫారసులను కూడా తయారుచేయడానికి వీలుగా ఈ నెలాఖరుకే దీనిపై ప్రకటన చేయాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వారి సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించడానికి పట్టే ఆరు నెలల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వీలైనంత తొందరలోనే పిఆర్సి ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. సిఫారసులతో సంబంధం లేకుండా వెంటనే 30% ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. మూల వేతనంలో పెరిగే ఈ ఫిట్‌మెంట్, దానికి అదనంగా వచ్చే కరువు భత్యం తదితరాలన్నీ కలిపితే ప్రభుత్వంపై పడే ఆర్థికభారం గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.
ఉద్యోగుల వివరాల క్రోడీకరణ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగానే ఉన్నా కొన్ని కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్, కంటింజెంట్, వర్క్‌ఛార్జ్‌డ్, ఫుల్‌టైం, పార్ట్ టైమ్, అంగన్‌వాడీ… ఇలా అనేక పేర్లతో కొనసాగుతున్నవారి వివరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ కోరింది. వీరికి వేతనాలు, ప్రత్యేక అలవెన్సుల రూపంలో ఏ మేరకు చెల్లించబడుతుందో ప్రభుత్వం దగ్గర వివరాలు లేవు. ఒక విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న గ్రాంట్లలోంచి ఇలాంటి ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నందువల్ల ప్రభుత్వం దగ్గర వీటికి సంబంధించిన వివరాలు ఉండడంలేదు. కొన్ని కార్పొరేషన్లు కూడా వాటి అవసరాలకు అనుగుణంగా కొద్దిమంది ఉద్యోగులను వివిధ రూపాల్లో చేర్చుకుంటూ ఉన్నందువల్ల వారికి చెల్లిస్తున్న వేతనాల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. ఇలాంటివాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేతనాలు, అలవెన్సులు తదితరాలకు ఎంత మొత్తంలో చెల్లింపు జరుగుతుందో పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ కోరింది. రానున్న బడ్జెట్‌లో ఆయా సంస్థలకు ఏ మేరకు వార్షిక గ్రాంట్లను ఇవ్వాల్సి ఉంటుందో, వాటి వినియోగం ఏ అవసరాలకు వెచ్చిస్తున్నారో తెలుసుకోడానికి ఇది దోహదపడుతుంది. ఈ వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయడంతో పాటు ఇకపైన ఆ సంస్థలు ఎవరిని నియమించుకున్నా వెంటనే సమాచారాన్ని ఇవ్వడం ద్వారా కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం, పదవీ విరమణ చేసిన తర్వాత వారి వివరాలను పింఛను జాబితాలోకి చేర్చడం.. ఇలాంటి అవసరాలకు ఉపయోగపడుతుందని ఆర్థికశాఖ అధికారులు భావిస్తున్నారు. కొన్ని సంస్థలు ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ఉన్నందువల్ల వాటి వివరాలను కూడా సమర్పించాలని కోరారు.

Comments

comments