Search
Tuesday 19 June 2018
  • :
  • :

7,577 కోట్ల మూలధనం

ARUN

ఆరు బలహీన పిఎస్‌బిలకు  7,577 కోట్ల మూలధనం

ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం 

న్యూఢిల్లీ : మొండి బకాయిలు పేరుకుపోయి బలహీనపడిన ఆరు ప్రభుత్వరంగ బ్యాంకుల(పిఎస్‌బి)కు రూ.7,577 కోట్ల మూలధనం అందించాలనే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) దిద్దుబాటు చర్య కింద ఈ బ్యాంకులు మూలధన సాయం పొందనున్నాయి. ఈ బ్యాంకుల్లో ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) పెరగడంతో ఆస్తుల నాణ్యత తగ్గిపోయింది. దీంతో మూలధన కొరత ఏర్పడి ఈ బ్యాంక్‌లు అవస్థలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సహకారం అందివ్వనుంది. 2019 మార్చి ముగింపు వరకు ఇంద్రదనుష్ పథకం కింద రూ.70 వేల కోట్ల నిధులను అందివ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, యుకో బ్యాంక్ సహా ఈ ఆరు బ్యాంకులు షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా మూలధనం అందుకుంటాయి. కోల్‌కతా కు చెందిన యుకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు మూల ధనం పొందనున్నాయి. కాగా బ్యాలెన్స్ షీట్లను పటిష్టం చేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వద్ద తనఖా పెట్టిన ఆస్తులను అమ్మడం, బదలీ చేయడం వంటి అవకాశాలను పరిశీలించాలని కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవల సూచించింది. తనఖా ఆస్తులను అమ్మడంలో బలంగా ఉన్న ఇతర బ్యాంకులను సంప్రదించాలని పేర్కొంది. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు, భారీ ఎగవేతదారులు పెరిగిన నేపథ్యంలో తనఖా ఆస్తులను అమ్మేయాలని చెప్పింది. మొండిబకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకులను పటిష్ఠపరిచేందుకు రూ.2.11 లక్షల కోట్ల మూలధనాన్ని అందిస్తామని ఇటీవల ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రుణాల కోసం తనఖా పెట్టిన ఆస్తులు విక్రయిస్తే కొంత భారం తగ్గుతుందని, తద్వారా బ్యాంకు ముఖ్యమైన విధులు నిర్వర్తించుకునే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం సూచిస్తోంది. చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపారాలకు అధికంగా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాం కులు ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో జైట్లీ ప్రభుత్వరంగ బ్యాంకులకు రెండేళ్లకు గాను రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ను అందజేస్తున్నట్టు తెలిపారు. బాండ్ల ద్వారా రూ.1.35 లక్షల కోట్ల మూలధనాన్ని, కేంద్ర బడ్జెటరీ ఫండ్ నుంచి రూ.18,139 కోట్లు, మిగతా రూ.58 వేల కోట్లు ప్రభుత్వ ఈక్విటీని తగ్గించడం ద్వారా క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరించనున్నట్టు తెలిపారు. నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎ) పెరిగిపోయి పిఎస్‌బిల ఆస్తుల నాణ్యత ఆందోళనకరంగా మారింది.
అయితే మొండి బకాయిలు పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్యాంకులు ఇప్పుడు కనీస బ్యాలెన్స్ చార్జీల పేరిట వసూళ్లు చేపట్టాయి. ఈ చార్జీలు బ్యాంకులకు మంచి ఆదాయాన్నే అందిస్తున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) దాదాపు రూ.1,771 కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసిందని ఓ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల విరామం తర్వాత గతేడాది ఏప్రిల్ నెలలో కనీస బ్యాలెన్స్ నిబంధన విధించారు. ఎస్‌బిఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు(పిఎన్‌బి)కు కనీస బ్యాలెన్స్ చార్జీ వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ రూ.97.34 కోట్లను వసూలు చేయగా, ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.68.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.62.16 కోట్లు వసూలు చేశాయి. ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ మాత్రమే ఏప్రిల్‌నవంబర్ వ్యవధిలో ఎలాంటి కనీస బ్యాలెన్స్ చార్జీలకు వసూలు చేయలేదు.

Comments

comments