Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

భారీ అగ్నిప్రమాదం

hyd

కాలి బూడిదైన పెట్రో ట్యాంకర్ n ఐదుగురికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం
ట్యాంకర్ల నుంచి డీజిల్‌ను అక్రమంగా తీస్తున్న సమయంలోనే ఘటన ?

హైదరాబాద్/బోడుప్పల్: మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్లలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు పెట్రో ట్యాంకర్లు కాలి బూడిదయ్యాయి. ఘటన సమయంలో అటువైపుగా వెళ్లున్న ఐదుగురు ద్విచక్ర వాహనదారులు కాలిన గాయాలకు గురయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ట్యాంకర్ల నుంచి అక్రమంగా డీజిల్ దొంగిలిస్తున్న సమయంలోనే ఈ  ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. చర్లపల్లిలో ఇండియన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం  డిపోలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న ఆయా కంపెనీలకు చెందిన  పెట్రోల్ బంక్‌లకు  డీజిల్, పెట్రోల్  సరఫరా జరుగుతుంది. ప్రతి రోజు వందల పెట్రోలియం ట్యాంకర్లు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఇందులో కొంత మంది  డ్రైవర్లు, క్లీనర్లు దొంగచాటుగా ట్యాంకర్ల నుంచి డీజిల్, పెట్రోల్‌ను తీసి అమ్ముకుంటుంటారు. ఇందుకోసం చెంగిచెర్ల చౌరస్తా నుంచి చర్లపల్లికి వెళ్లే దారికి 50 మీటర్ల దూరంలో ఉన్న  రాజు మెకానిక్ షెడ్‌ను అడ్డాగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం  మధ్యా హ్నం రెండు పెట్రో ట్యాంకర్లు రాజు షెడ్‌కు  వచ్చాయి. సదరు ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు టీ తాగేందుకు రోడ్డు పక్కనే ఉన్న  హోటల్‌కు వెళ్లారు. ఒక ట్యాంకర్‌లోంచి అక్కడి వర్కర్లు డీజిల్‌ను తీసేశారు. ఆ తరువాత రెండో ట్యాంకర్‌లోంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క  డీజిల్ తీసిన ట్యాంకర్‌ను డ్రైవర్ రివర్స్ తీసుకుంటుండగా ఒక్కసారిగా మంటలు లేచాయి. ఈ హఠత్పరిణామంతో డ్రైవర్, షెడ్‌లో ఉన్న మిగతా వర్కర్లు పరారయ్యారు. అందరూ చూస్తుండగానే ఈ రెండు ట్యాంకర్లకు మంటలు అంటుకుని సుమారు 200 మీటర్ల ఎత్తు వరకు మంటలు ఎగిసిపడ్డాయి. ఐదు నిమిషాల తరువాత రెండు ట్యాంకర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఇదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఐదు ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు కాలిన గాయాలకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటనలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఎఎస్‌ఐ ముళీదాస్‌గౌడ్ కూడా గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి నాలుగు ఫైరింజర్లు చేరుకుని మం టలను అదుపు చేశాయి. అగ్ని ప్రమాద ఘటనతో వరంగల్ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి మల్కాజ్‌గిరి డిసిపి శర్మ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్న తరుణంలో షెడ్ గోడ తగలడంతో రాపిడికి మంటలు లేవడం అగ్ని ప్రమాదానికి కారణమని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై త్వరలోనే వెల్లడిస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.

Comments

comments