Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

అశ్లీల దృశ్యాలను అరికట్టే సైన్యం

Sudents-image

ప్రస్తుత కాలంలో పిల్లలకు కంప్యూటర్‌తో కూడిన చదువు చాలా ముఖ్యమైంది . పిల్లలు కంప్యూటర్‌లో ఏం చూస్తున్నారు? నెట్‌లో అశ్లీల దృశ్యాలు వారి కంటపడితే ఎలా? అని ప్రతీ తల్లిదండ్రుల్లోనూ భయం ఉంటుంది. పెద్దపెద్ద కంపెనీలైతే ఎంతైన ఖర్చుపెట్టి యాంటీ సాఫ్ట్‌వేర్‌లతో అలాంటి దృశ్యాలను గుర్తిస్తాయి. మరి మధ్య తరగతి వారు ఏం చేస్తారు? ఇలాంటి వారి కోసం ఉచితంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది హైదరాబాద్ ఐఐటీకి చెందిన విద్యార్థి బృందం. అశ్లీల చిత్రాలు, దృశ్యాలను వడపోసే సైన్యం (సాఫ్ట్‌వేర్) కనుగొన్నారు. వీరి ఆలోచన బాగుండటంతో గ్లోబల్ సైబర్ ఛాలెంజ్‌లో వీరికి మూడోస్థానం దక్కించుకున్నారు బృందం సభ్యులైన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న డి.సత్యవీరారెడ్డి, భరత్, ఎంటెక్ విద్యార్థి కేవీవీ దుర్గాప్రసాద్‌లు.

అంతర్జాలంలో అశ్లీలతకు అడ్డుకట్ట వేసేలా ఈ ముగ్గురు యువకులు ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు పెద్ద సంస్థలే ఇలాంటి సాంకేతికతను వాడుకుంటున్నాయి. అదే వీరు రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎవరైనా ఉచితంగా వాడుకునేలా ప్రోటోటైప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో భాగంగా మంచి చిత్రాలు, దృశ్యాలతో పాటు అశ్లీలంగా ఉన్న చిత్రాలు, దృశ్యాలను కంప్యూటర్‌కు ఇస్తూ దాదాపు 30గంటల పాటు పరీక్షించారు. ఏది పిల్లలు చూడొచ్చు… ఏయే చిత్రాలు అశ్లీలంగా ఉన్నాయనే విషయాన్ని కంప్యూటరే గుర్తించేలా అల్గారిథమ్ సిద్ధం చేశారు. ఇలా చేసిన తర్వాత చెడు చిత్రం, దృశ్యం కనిపిస్తే వెంటనే కంప్యూటర్ దానిని అడ్డుకునేలా చేయడంలో వీరు విజయవంతమయ్యారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను నెట్‌వర్క్ గేట్‌వేలో ఇన్‌స్టాల్ చేస్తే చాలు తన పని తాను చేసుకుపోతుంటుంది.

గత సంవత్సరం నవంబరులో ఢిల్లీలో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ కార్యక్రమం నిర్వహించారు. అదే నెల 20, 21 తేదీల్లో గ్లోబల్ సైబర్ ఛాలెంజ్ పోటీ జరిగింది. అంతర్జాలానికి సంబంధించిన అంశంలో ప్రధానంగా ఉన్న పదమూడు సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా వీరు ఆవిష్కరణలను ఆహ్వానించారు. మొత్తం 400ల పైగా పలు బృందాలు తమ ప్రదర్శనలని చేసారు. వాటిలో ఐఐటీ హైదరాబాద్ బృందం మూడోస్థానంలో నిలిచి నవంబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై కొంతకాలంగా పనిచేస్తున్నాం.ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు జరగకుండా ఇలాంటి డీప్‌లెర్నింగ్ పద్ధతిని వాడుకొని ఈ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసాం. సాధారణంగా అశ్లీలతకు అడ్డుకట్ట వేసే సాఫ్ట్‌వేర్ పేర్లు, ట్యాగ్‌లను గుర్తించి కొంత వరకే అడ్డుకోగలుగుతాయి. అదే అసభ్య చిత్రం ఒక మంచి వ్యక్తి, సంస్థ పేరుతో అంతర్జాలంలోకి వస్తే దానిని గుర్తించలేవు. మేం రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇలాంటి చిత్రాలు, దృశ్యాలనూ విశ్లేషించి అవి అసభ్యంగా ఉంటే తక్షణం వాటిని అడ్డుకుంటుంది. దీనిని ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి మరింత మద్దతు ఉంటే దీనిని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తాం అని సత్యవీరారెడ్డి, భరత్, దుర్గాప్రసాద్‌లు పేర్కొన్నారు.

Comments

comments